బాలయ్య లేదా చిరంజీవి సినిమాలు వచ్చినపుడల్లా ఫ్యాన్స్ ఫైట్ మామూలుగా వుండదు. సంక్రాంతికి ఈ ఇద్దరి సినిమాలు పోటా పోటీగా రావడం వల్ల ఫ్యాన్స్ పోటీ పడి రెండు సినిమాలకు ఇబ్బడి ముబ్బడిగా కలెక్షన్లు ఇచ్చారని, దేనికి అవి సోలోగా వచ్చి వుంటే పరిస్థితి వేరుగా వుండేదని ఇప్పటికి బిజినెస్ సర్కిళ్లలో వినిపిస్తూ వుంటుంది. తరువాత భోళాశంకర్ వచ్చింది. దాని మీద ఎంత ట్రోలింగ్ నడవాలో అంతా నడిచింది.
ఇప్పుడు బాలయ్య భగవంత్ కేసరి వస్తోంది. ఈ టైమ్ లోనే విజయ్-లోకేష్ కనకరాజ్ డబ్బింగ్ సినిమా లియో వస్తోంది. రెండూ ఒకే రోజు విడుదల. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే లియో సినిమాకు మెగా ఫ్యాన్స్ మద్దతుగా నిలుస్తున్నారని. ఆ సినిమాకు మంచి ఓపెనింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని.
నిజానికి ఇప్పుడు మెగా ఫ్యాన్స్.. బాలయ్య ఫ్యాన్స్ ఒక్కటి కావాలి. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నాయి కనుక. కానీ సినిమాల వరకు వచ్చేసరికి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.
ఈ లెక్కన చూస్తుంటే 19న రెండు సినిమాలు విడుదల నాడు సోషల్ మీడియాలో హడావుడి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. భగవత్ కేసరి వన్ సైడ్ విక్టరీ సాధిస్తే ఫరవాలేదు. లేదూ అంటే మెగా ఫ్యాన్స్ వైపు నుంచి ట్రోలింగ్ ఒక లెక్కలో వుండొచ్చు.