తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితను చూసి వైసీపీ నేతలు, కార్యకర్తలు చాలా విషయాలు నేర్చుకోవాలి. తమ పార్టీ అధ్యక్షుల్ని, వారి కుటుంబ సభ్యులపై ప్రత్యర్థులు అవాకులు చెవాకులు పేలితే చెప్పులతో కొట్టాలని ఆమె చెబుతున్నారు. అంతేకాదు, తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి నోరు పారేసుకున్నారంటూ, ఏకంగా ఆయన చిత్రాన్ని తన సమూహంతో కలిపి ఆమె చెప్పులతో కొట్టారు. రానున్న రోజుల్లో పద్ధతి మారకపోతే నేరుగా ఇళ్లకెళ్లి చెప్పులతో కొడ్తామని ఆమె వార్నింగ్ ఇచ్చారు.
ఇంతకూ భువనేశ్వరిపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం. చంద్రబాబు ప్రాణాలకు ముప్పు వుందని భువనేశ్వరి తదితర కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కానీ ఆయనకు ఇంటి నుంచే అన్నం పంపుతున్నారని నారాయణ స్వామి గుర్తు చేశారు. చంద్రబాబును తుదముట్టించి లోకేశ్‌ను సీఎం చేయాలని భువనేశ్వరి అనుకుంటున్నారని నారాయణ స్వామి విమర్శించారు. ఇలాంటి విమర్శలను ఎవరూ అంగీకరించరు.
బాబును కుటుంబ సభ్యులే చంపుతారనే డిప్యూటీ సీఎం కామెంట్స్ వైసీపీ వాళ్లకు నచ్చొచ్చు. కానీ తటస్థులెవరూ స్వాగతించరు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కామెంట్స్‌పై తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విపరీతంగా స్పందించారు. నోటికొచ్చినట్టు కూతలు కూస్తావా అంటూ ఆయన చిత్రపటాన్ని చెప్పులతో తెలుగు మహిళా నేతలంతా కలిసి కొట్టారు.
రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని, వారి కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా మహిళలపై ఇష్టానుసారం నోరు పారేసుకుంటే, చెప్పులు, చీపుర్లతో కొట్టాలని పదేపదే వంగలపూడి అనిత లోకానికి చెబుతున్నారు. అనిత నుంచి వైసీపీ నేతలు ఎంతో నేర్చుకోవాల్సి వుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పాటు ఆయన కుటుంబంలోని మహిళలపై ప్రత్యర్థులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.
అలాగే మంత్రి రోజాపై మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి సమాజం సిగ్గుపడేలా దూషణకు దిగారు. ఇటీవల తిరుపతికి చెందిన జనసేన నాయకుడు సీఎం వైఎస్ జగన్ పుట్టుక గురించి నీచంగా మాట్లాడారు. అంతేకాదు, ఇదే నాయకుడు ప్రకాశం జిల్లాలో వైఎస్ విజయమ్మ కారు ప్రమాదానికి గురైతే, కుటుంబ సభ్యులే చేయించారని వాగాడు. అయినా వైసీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సీఎం జగన్‌పై టీడీపీ, జనసేన నాయకుల దూషణలను భువనేశ్వరిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్యల తీవ్రత ఏంటో జనానికి బాగా తెలుసు.
అనిత లెక్క ప్రకారం బండారు సత్యనారాయణమూర్తి, తిరుపతి జనసేన నాయకుడిని వైసీపీ శ్రేణులు చెప్పులు, చీపర్లతో కొట్టాలి. డిప్యూటీ సీఎం చిత్రపటంపై అనిత చెప్పుల దాడి ఇస్తున్న సంకేతాలు ఇవే. కీలక పదవుల్లో ఉన్న నాయకులను, వారి కుటుంబ సభ్యులపై నోరు పారేసుకున్నా చట్టాలు ఏమీ చేయలేవనే ధీమాతో ఉన్న వారికి ఇక చెప్పు దెబ్బలే సమాధానం అని చెప్పిన అనితను తప్పక అభినందించాలి. వైసీపీ నేతలకు ఇప్పటికైనా సిగ్గొచ్చి, అనితను ఆదర్శంగా తీసుకుని చెప్పులు, చీపుర్లతో సమాధానం చెబుతారేమో చూడాలి.