తను నిశ్చితార్థం చేసుకున్నది నిజమే అని, అలా అని అదేం ఆగిపోలేదని, మరో రెండేళ్ల తరువాత పెళ్లి చేసుకుంటా అని నటి రేణు దేశాయ్ అన్నారు. తన కుమార్తె మరి కొంచెం పెద్ద అయిన తరువాత బాధ్యతలు కాస్త తీరాక పెళ్లి చేసుకుంటా అని ఆమె ‘గ్రేట్ ఆంధ్ర’ కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు.
ఒకప్పుడు తాను కాస్త ఎమోషనల్ గా స్ట్రగుల్ పడ్డా అని, అయితే ఇప్పుడు అన్ని విధాలో బలోపేతం అయ్యానని అన్నారు. సోషల్ మీడయా పవర్ ఫుల్ మీడియం అని, దాంట్లో కొంత చెడు వున్న మాట వాస్తవం అని,అలా అని దూరంగా వెళ్లిపోకుండా, మార్చడానికి ప్రయత్నిస్తున్నా అని అన్నారు. ఈ పని ఎవరో ఒకరు చేయాలి కనుక తాను చేస్తున్నా అన్నారు.
సినిమాలు నిర్మించడానికే హైదరాబాద్ కు షిప్ట్ అయ్యా అని, ప్రస్తుతం రెండు చిన్న సినిమాలు ప్లానింగ్ లో వున్నాయని, ఆ తరువాత భారీ సినిమా కోసం ఓ మాంచి యాక్షన్ కథ రెడీ చేసానని రేణు అన్నారు. తనకు యాక్టివ్ పాలిటిక్స్ లో పాల్గొనే ఆలోచన లేదని ఆమె స్పష్టం చేసారు. మంచి కథ, మంచి బ్యానర్, మంచి దర్శకుడు ఈ మూడు కాంబినేషన్ లు సెట్ అయితేనే సినిమాలు చేస్తా అన్నారు. తనకు గతంలో కొన్ని మంచి స్క్రిప్ట్ లు వచ్చినా, ఈ మూడూ సెట్ కాకనే చేయలేదన్నారు.
తాను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా అని, అదే తన ఆదాయం అని రేణు వెల్లడించారు. తన గ్రాండ్ పేరెంట్స్ నుంచి తమ కుటుంబంలో ఈ వ్యాపారం వుందని అదే కొనసాగిస్తున్నానని అన్నారు. ఏ సినిమాలు లేకుండా ఎలా బతుకుతున్నారు అనే ప్రశ్నకు ఇదే సమాధానం అన్నారు. తన కూతురు ఆర్కిటెక్ట్ కావాలని అనుకుంటోందని, ఆ దిశగానే చదువుకుంటోందని అన్నారు.
ప్రస్తుతానికి పర్సనల్ క్వశ్చన్లకు సమాధానాలు చెప్పలేనని, త్వరలో కావాలంటే ఓ ఫ్రెస్ మీట్ పెట్టి మరీ గంటసేపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని రేణు దేశాయ్ అన్నారు.