మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాం అని వైసీపీ నేతలు చెప్పడం పాతమాటే. మూడు రాజధానుల బిల్లుకి సరికొత్తగా కసరత్తులు చేస్తున్నామని చెప్పడం కూడా పాత వార్తే. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఆ బిల్లు పెడతారని అనుకున్నా.. అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.
సమయం చూసి బిల్లు పెడతామంటూ కొంతమంది మంత్రులు చెబుతున్నా.. ఈ సెషన్లో అది జరుగుతుందని అనుకోలేం. కొత్త మంత్రిమండలి కొలువుదీరాక, సమగ్రంగా తర్వాతి సమావేశాల్లో బిల్లు పెడతారో లేక, ఎన్నికల సమయానికి బిల్లు పెట్టి ప్రజా తీర్పు కోరతారో వేచి చూడాలి.
కొత్త బిల్లు ఎప్పుడు..?
మూడు రాజధానులపై గతంలో తీసుకొచ్చిన బిల్లుని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో అమరావతి రైతులు అప్పట్లో పండగ చేసుకున్నారు. అయితే పాత బిల్లు వెనక్కి తీసుకున్నామని, కొత్త బిల్లు ప్రవేశ పెడతామని, అది మరింత పగడ్బందీగా ఉంటుందని, న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోదని చెప్పారు వైసీపీ నేతలు.
ఆ దెబ్బతో అమరావతి రైతులు, టీడీపీ నేతల ఆశలు ఆవిరయ్యాయి. వైసీపీ ప్రకటన చేసింది కానీ, ఎప్పుడనేది చెప్పలేదు. బడ్జెట్ సమావేశాల్లోనే ఆ ముచ్చట తీర్చేస్తారని చాలామంది ఆశించారు. కానీ అది సాధ్యపడలేదు.
రెండడుగులు వెనక్కి..
బిల్లు వెనక్కి తీసుకున్నంత మాత్రాన వెనక్కి తగ్గినట్టు కాదు, కానీ పగడ్బందీగా మరోసారి బిల్లు ప్రవేశ పెట్టడానికి ప్రభుత్వం పక్కాగా ముందుకెళ్తోంది. న్యాయపరమైన వివాదాలు రాకుండా చూడాలనుకుంటోంది. అయితే మరింత సమయం వేచి చూసి.. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ బిల్లుని తెరపైకి తెచ్చే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
అదే నిజమైతే.. మూడు రాజధానులే ప్రధాన అజెండాగా వైసీపీ ఎన్నికలకు వెళ్లడం ఖాయం. అంటే మూడు ప్రాంతాల ప్రజలు కచ్చితంగా తమ అభివృద్ధిని అడ్డుకునే పసుపు బ్యాచ్ ని దానికి అండగా నిలబడే బ్యాచ్ ని కూడా విసిరి పక్కనపడేస్తారు.
ఈ స్ట్రాటజీ వర్కవుట్ అయితే, ఇక న్యాయస్థానాలు కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిందే. అమరావతికి కట్టుబడి ఉన్నారని చెప్పి, ఎన్నికల్లో గెలిచాక మూడు రాజధానులంటున్నారని ఇన్నాళ్లూ టీడీపీ రచ్చ చేసింది.
ఇప్పుడు నేరుగా ప్రజలకు మూడు రాజధానుల విషయం చెప్పి ఎన్నికలకు వెళ్తే ఇక మరోసారి ప్రత్యేకంగా మూడు రాజధానులపై ప్రజామోదం అవసరం పడదు. మరి జగన్ మనసులో ఏముందో చూడాలి. ఎన్నికల వరకు వేచి చూస్తారా? లేక ఈ లోపే ట్రిపుల్ కేపిటల్ ధమాకా చూపిస్తారా..?