ఏపీలో రాజకీయం వక్రమార్గాన్ని పట్టింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా మత రాజకీయం జరుగుతోంది. గత కొన్నాళ్లలో ఈ వ్యవహరం ఎలాంటి పరిణామాలకు కారణమైందో వేరే చెప్పనక్కర్లేదు. మారుమూల దేవాలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేయడం.. అక్కడకు ప్రతిపక్షాలు చేరిపోయి పోటాపోటీ రాజకీయం చేయడం.
ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం కూడా ఈ పరిణామాలపై దృష్టి సారించింది. ఎన్నడూ లేనిది.. ఉన్నట్టుంది ఎందుకు విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి? అనే అంశాల మీద విచారణ మొదలైంది. ఆ తర్వాత ప్రతిపక్షాలు కిమ్మనకపోవడం గమనార్హం. ఈ క్రమంలో.. విగ్రహాల విధ్వంసం, ఆలయాల్లో అనుచిత కార్యక్రమాలకు పాల్పడడం వంటి అంశాలకు సంబంధించి వచ్చిన వార్తలు, సోషల్ మీడియా ప్రచారాలపై దృష్టి సారించిన ఏపీ పోలీసులు కీలకమైన అంశాలను బయటకు తీస్తున్నారు.
కొంతమంది పచ్చ చొక్కాలు, బీజేపీ కార్యకర్తలు తామే ధ్వంసానికి పాల్పడి తామే సోషల్ మీడియాలో ప్రచారానికి పెట్టడం, లేదా తామే మీడియా కు సమాచారం ఇచ్చి ప్రచారం చేయించడం.. వంటి దుర్మార్గాలకు పాల్పడతున్న వైనాన్ని ఏపీ పోలీసులు బయటకు తీస్తున్నారు. మారుమూల ఆలయాల్లో విధ్వంసం జరిగడం గురించి సామాన్యులకు తెలియదు. జరిగిన ఘటనపై ఎలా ప్రచారం వస్తోంది? అనే అంశాన్ని పరిశీలిస్తే..అసలు దొంగలు దొరుకుతున్నారని స్పష్టం అవుతోంది.
మొదట సోషల్ మీడియాలో ఎవరు పెట్టారు? ఎవరు మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు? అనే అంశాలను పరిశీలించిన తర్వాత.. విధ్వంసాల వెనుక కుట్ర కోణాలు బయటపడుతూ ఉన్నాయి. ఇక్కడే గమనించాల్సిన మరో అంశం.. పాత అంశాలను కొత్తగా రాద్ధాంతం చేయడం.
గతంలో ఫొటోలను,గతంలోని వీడియోలను పట్టుకుని ఇప్పుడు విధ్వంసం సాగుతోందంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. వీటన్నింటి లక్ష్యం స్పష్టం అవుతూ ఉంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మత పరమైన వ్యతిరేకత పెంచే లక్ష్యంతోనే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటూ ఉన్నాయి.
తామే విధ్వంసాన్ని సృష్టించి, తామే రాద్ధాంతం చేసి, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను పెంచాలని అత్యుత్సాహంతో కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కార్యకర్తలు చేస్తున్న ఈ పనిని ఆయా పార్టీల అధినేతలు అందుకుంటూ ఉన్నారు.
చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాల్లో రామప్పంతుల్లా స్పందిస్తున్న సంగతిని వేరే చెప్పనక్కర్లేదు. ఈ దుర్మార్గాల వెనుక దాగి ఉన్న పచ్చచొక్కాలు, కాషాయాన్ని పులుముకున్న వారు అడ్డంగా దొరికిపోతూ ఉండే సరికి ఇప్పుడు పోలీసుల మీద ఎదురుదాడికి దిగుతున్నాయి టీడీపీ, బీజేపీ.