ఇటీవలే స్థానిక ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం కేరళ. హోరాహోరీగా సాగిన ఈ స్థానిక ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ పై చేయి సాధించింది. ఆ సంగతలా ఉంటే.. స్థానిక ఎన్నికల అనంతరం కేరళ మరోరకంగా కూడా వార్తల్లో నిలుస్తోంది. అదే భారీ సంఖ్యలో కరోనా కేసుల ద్వారా!
గత 24 గంటల్లో కేరళలో ఏకంగా ఆరు వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. ఇటీవలి కాలంలో దేశంలో ఒక్కో రాష్ట్రంలోనూ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఒక దశలో భారీగా కేసులు నమోదు అయిన రాష్ట్రాల్లో కూడా కూడా అవరోహన పద్ధతిలో కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే ఉన్నట్టుండి కేరళలో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది.
తాజాగా అక్కడ రోజువారీ కేసుల సంఖ్య ఆరు వేలకు పైగా చేరడం గమనించాల్సిన అంశం. ఒక దశలో వెయ్యి, రెండు వేల లోపుకు పడిపోయిన కేసుల సంఖ్య ఒక్క సారిగా ఒకే రోజు ఆరు వేలకు పైగా చేరింది. స్థానిక ఎన్నికలు ముగియగానే ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ గమనించాల్సిన అంశం. ప్రజలు తమ తమ యాక్టివిటీస్ లో ఇప్పుడు కూడా బిజీగానే ఉన్నారు. అయితే ఎంత రొటీన్ యాక్టివిటీస్ లో పడ్డా కొద్దో గొప్పో జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఎన్నికలు నిర్వహించాలంటూ ఏపీలో ఎన్నికల కమిషనర్ చాలా ఉబలాటపడుతున్నారు. అయితే ఇండియాలో ఎన్నికలు అంటే.. వందల పండగలు ఒకేసారి వచ్చినట్టు అనే విషయాన్ని మరవకూడదు.
విద్యాధికులు ఎక్కువగా ఉండే కేరళలోనే ఎన్నికలు అనగానే.. జనాలు ఎగేసుకు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ కరోనా కేసులు పెరిగాయి. సరిగ్గా స్థానిక ఎన్నికలు ముగియగానే కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యాన్ని కచ్చితంగా గమనించవచ్చు. ఒకే రోజు ఆరు వేలకు పైగా కేసులు నమోదు కావడంతో.. మళ్లీ దేశం దృష్టి కేరళ మీద పడింది.
కరోనా విజృంభించిన తమిళనాడు, కర్ణాటక, ఏపీ వంటి రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడు కేసులు రోజువారీగా వెయ్యి లోపుకు తగ్గిపోయాయి. ఇంతలోనే మళ్లీ సౌత్ లో కేరళ ఆందోళన రేపుతూ ఉంది. ఈ పరిణామాన్ని ఎన్నికల కమిషనర్ వారు కాస్త గుర్తించి.. ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలను విరమించుకుంటే మంచిది.
కేవలం ఆయన పదవీ కాలం ముగియబోతోందనే కారణం చేత ఎన్నికలు నిర్వహించాలనే ప్రయత్నం చేస్తే మాత్రం.. అది ఏపీని ప్రమాదంలోకి నెట్టేప్రయత్నం అవుతుందని కేరళ ఉదాహరణగా నిలుస్తోంది.