ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా వ్యాక్సినేషన్ ప్రొగ్రామ్ భారత్ లో ప్రారంభం కాబోతోంది. మరికొద్దిసేపట్లో ప్రధాని మోదీ ఈ టీకా కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా ప్రారంభించబోతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రతి రాష్ట్రంలో నిర్దేశిత వ్యక్తులకు కరోనా తొలిదశ టీకాను అందించబోతున్నారు. వీళ్లలో కొంతమందితో మోదీ ఆన్ లైన్ లో సంభాషించబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా టీకా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా, బెజవాడలోని జీజీహెచ్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ముందుగా రాష్ట్రంలో పనిచేస్తున్న కేంద్ర వైద్య సిబ్బందికి, మంగళగిరి ఎయిమ్స్ సిబ్బందికి, విశాఖ నేవీలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి తొలి దశ టీకా ఇస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 332 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ప్రతి కేంద్రంలో ఆరుగురు సిబ్బందిని నియమించారు. హోం గార్డ్ నుంచి వైద్యుల వరకు వివిధ వృత్తులకు చెందిన వ్యక్తులు ఇందులో ఉంటారు. ఇప్పటికే రాష్ట్రానికి 4.77 లక్షల కోవీషీల్డ్, 20వేల కోవాక్సిన్ టీకాలు చేరుకున్నాయి. రెండో దశలో ఇంతే మొత్తాన్ని మళ్లీ సరఫరా చేయబోతున్నారు.
తెలంగాణలో కూడా మరికొద్దిసేపట్లే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గ్రేటర్ పరిధిలో పనిచేసే పారిశుధ్య కార్మికుడికి తొలి టీకా వేయబోతున్నారు. రెండో టీకాను ఏఎన్ఎంకు, మూడో టీకాను వైద్యుడికి వేయబోతున్నారు. గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్న ఈ కార్యక్రమంలో.. అన్ని ప్రధాన హెల్త్ కేర్ సెంటర్లలో వైద్య సిబ్బందికి వాక్సిన్ వేయబోతున్నారు.