ఇంట్రావర్ట్స్, ఎక్స్ట్రావ‌ర్ట్స్.. వీరిలో ఎవ‌రు ఆనందంగా ఉంటారు!

మ‌నుషుల స్వ‌భావాల గురించి మ‌నం మాట్లాడుకోవ‌డం మొద‌లుపెడితే వినిపించే మాట‌ల్లో ఎక్ట్స్ ట్రావ‌ర్డ్స్, ఇంట్రావ‌ర్ట్స్ అనేవి ముఖ్య‌మైన‌వి!

మ‌నుషుల స్వ‌భావాల గురించి మ‌నం మాట్లాడుకోవ‌డం మొద‌లుపెడితే వినిపించే మాట‌ల్లో ఎక్ట్స్ ట్రావ‌ర్డ్స్, ఇంట్రావ‌ర్ట్స్ అనేవి ముఖ్య‌మైన‌వి! న‌లుగురితో క‌లివిడిగా మాట్లాడుతూ, ప‌రిచ‌యాల‌ను పెంచుకుంటూ, న‌వ్వుతూ తిరిగే వారిని ఎక్స్ ట్రావ‌ర్ట్స్ గా ప‌రిగ‌ణిస్తూ ఉంటారు, త‌మ ప‌ని తాము చూసుకుంటూ అవ‌స‌ర‌మైన మేర వ‌ర‌కే మాట్లాడి, కొత్త వారితో ముందుగా తాము మాట్లాడ‌టానికి పెద్ద ఆస‌క్తి చూప‌ని వారిని ఇంట్రావ‌ర్ట్స్ గా ప‌రిగ‌ణిస్తూ ఉంటారు. మ‌రి ఈ రెండూ పూర్తి భిన్న‌మైన స్వ‌భావాలు.

ఒక స్వ‌భావం మ‌రొకొరికి అస్స‌లు న‌చ్చ‌క‌పోవ‌చ్చు కూడా! అంద‌రితోనూ అతిగా మాట్లాడుతూ, రాసుకుపూసుకుపోయే వారిని ఇంట్రావ‌ర్ట్స్ పెద్ద‌గా ప‌ట్టించుకోర‌స‌లు. త‌మ బోటి ఇంట్రావ‌ర్ట్స్ తోనే స్నేహాల‌కు వీరు ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. అదే స‌మ‌యంలో ముడుచుకుపోయే ఇంట్రావ‌ర్ట్స్ పోక‌డ ఎక్స్ ట్రావ‌ర్ట్స్ కు అంతుబ‌ట్ట‌దు! మ‌రీ అలా ఎలా ఉండ‌టం అంటూ వీరు ప్ర‌శ్నిస్తారు!

మ‌రి ఇంత‌కీ ఈ రెండు కేట‌గిరి స్వ‌భావాల్లో ఎవ‌రు ఆనందంగా త‌మ జీవితాల‌ను లీడ్ చేస్తారు అంటే.. అస‌లు వీరి ఆనందాలు ఎలా ఆధార‌ప‌డి ఉంటాయో ప‌రిశీలించాల్సి ఉంటుంది. ముందుగా.. ఎక్స్ ట్రావ‌ర్ట్స్ ఆనందాలు కొత్త కొత్త ప‌రిచ‌యాలు, ప‌రిచ‌య‌స్తుల‌తో మాట‌లు, వారు వీరితో న‌డుచుకోవ‌డం వంటి మీద ఆధార‌ప‌డి ఉంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు మాట్లాడుకోవ‌డానికి, ప‌దుగురిలోకి దూసుకుపోవ‌డానికి వీరికి టాపిక్ ఉండాల్సిందే. అలాగే తాము చెప్పింది న‌లుగురూ వినాలి, న‌లుగురితో తాము క‌లిసిపోగల‌గాలి. ఇవి ఎక్స్ ట్రావ‌ర్ట్స్ ఆనందానికి కీల‌క‌మైన అంశాలు.

ఎప్పుడైతే వీరికి అల‌వాటైన రీతిన దూసుకుపోవ‌డానికి అవ‌కాశం ఉండ‌దో.. అప్పుడు వీరి మాన‌సిక ఆనందం కూడా ప్ర‌భావితం అవుతుంది. మాట్లాడ‌టానికి కొత్త కొత్త వ్య‌క్తులు లేదా ప‌రిచ‌య‌స్తులు నిత్యం అందుబాటులో ఉండాలి వీరికి. ఇంటి క‌న్నా వీరు బ‌య‌టే ఎక్కువ సేపు గ‌డ‌పడానికి కూడా ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. ఆఫీసు, వృత్తి ప‌నో.. అయిపోయాకా.. వెంట‌నే ఇంటికి వెళ్ల‌డానికి కూడా వీరు ప్రాధాన్య‌త‌ను ఇవ్వ‌రు. ఇలా బ‌య‌ట వీరికి అవ‌కాశం ఉన్నంత‌సేపూ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే వీరికి త‌మ‌దైన ధోర‌ణిలో వ్య‌వ‌హ‌రించ‌డానికి అవ‌కాశం ఉండ‌దో.. అప్పుడు ఇబ్బంది క‌లిగిన‌ట్టుగా అనిపిస్తుంది!

ఇక ఇంట్రావ‌ర్ట్స్ సంగ‌తి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. ప్ర‌త్యేకించి వీరి ఆనందం ఎప్పుడూ ఇత‌రుల మీద ఆధార‌ప‌డి ఉండ‌దు! ఎలాగూ న‌లుగురితో రాసుకుపూసుకు తిర‌గ‌డానికి వీరికి మ‌రీ అత్యంత ఆస‌క్తులు ఏమీ ఉండ‌వు కాబ‌ట్టి.. వీరి ఆనందం వేరే వాళ్ల మీద ఆధార‌ప‌డి ఉండ‌దు. త‌మ ఆనందాన్ని వీరు త‌మ మీదే ఆధార‌ప‌డేట‌ట్టుగా చూసుకుంటారు. దీంతో వీరు వ్య‌క్తిగ‌త విష‌యాల మీదే ఎక్కువ ధ్యాస పెడ‌తారు. త‌ను, త‌న కుటుంబం, త‌న‌కు ఉన్న చిన్న పాటి స‌ర్కిల్. వారి గురించినే వీరి ఆలోచ‌న‌లు, వ్య‌వ‌హారాలు సాగుతాయి. దీంతో వారికి సంబంధించిన విష‌యాల గురించి త‌మ‌లో తామ ఆలోచ‌న‌ల‌తో ఇంట్రావ‌ర్ట్స్ ఎక్కువ స‌మ‌యం గ‌డుపుతారు. ఇలా వీరి ఆనందం పూర్తిగా వ్య‌క్తిగ‌తంగా ఉంటుంది.

మ‌రి త‌మ ఆనందం ఇత‌రుల మీద కాకుండా త‌మ మీద ఆధార‌ప‌డి ఉండ‌టం అనేది గొప్ప సంగ‌తే చెప్పాలంటే. ఇలా చూస్తే ఎక్స్ ట్రావ‌ర్ట్స్ క‌న్నా ఇంట్రావ‌ర్ట్స్ కు ప్ర‌శాంత‌త ఉండ‌వ‌చ్చు. అయితే ఎక్స్ ట్రావ‌ర్ట్స్ కు త‌మ దైన స‌ర్కిల్ ల‌భిస్తున్నంత సేపూ, దాన్ని ఎక్స్ పాండ్ చేయ‌డానికి అవ‌కాశాలు ఉన్నంత వ‌ర‌కూ వారికి ఢోకా ఉండ‌దు. వీలైనంత మంది ఎక్కువ‌మందిని క‌లుపుకుంటూ పోతూ వారు త‌మ ఆనందాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త‌గా వెదుక్కొనే అవ‌కాశం ఉన్నది ఎక్స్ ట్రావ‌ర్ట్స్ కే!

2 Replies to “ఇంట్రావర్ట్స్, ఎక్స్ట్రావ‌ర్ట్స్.. వీరిలో ఎవ‌రు ఆనందంగా ఉంటారు!”

  1. ఇంట్రావర్ట్స్ కి ఇంకొకడి మీద ఆధారపడవలసి అవసరం ఎప్పుడూ ఉండదు. తనతో తాను సంతోషం గా ఉండే వాడు ఎప్పుడూ ఆనందం గానే ఉంటాడు. ముఖ్యంగా ఇంట్రావర్ట్స్ చాలా మందికి పుస్తక పఠనం, సంగీతం లాంటి మంచి వ్యాపకాలు ఉంటాయి. అటువంటి వాళ్ళ సంతోషానికి ఎప్పుడూ ఢోకా ఉండదు.

Comments are closed.