సినిమా సూప‌ర్ హిట్, ఓటీటీ రిలీజ్ వెన‌క్కు!

ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా ప‌డిన‌ట్టుగా ఉంది. ముంద‌స్తు ఒప్పందం ప్ర‌కారం గ‌త వార‌మే ఈ సినిమా ఓటీటీ లో విడుద‌ల కావాల్సింది.

భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన ఎల్ 2 సినిమా కేర‌ళ‌లో 87 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధిస్తే, ఆ త‌ర్వాత నెల రోజుల వ్య‌వ‌ధిలో వ‌చ్చిన తుడ‌రుం మాత్రం ఆ సినిమాను మించిన వ‌సూళ్ల‌ను సాధించింద‌ట కేర‌ళ బాక్సాఫీస్ వ‌ద్ద‌. మోహ‌న్ లాల్ కు తోడు పృథ్విరాజ్, టొవినో థామ‌స్ ఉన్న ఎల్ 2 పూర్తి స్థాయి ర‌న్ లో 87 కోట్ల రూపాయ‌ల గ్రాస్ ను రాబ‌ట్టింద‌ట‌. అయితే కేర‌ళ బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించిన సినిమాగా తుడ‌రుం నిలుస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఈ సినిమా ఏ మాత్రం అంచ‌నాల్లేకుండా వ‌చ్చి అద్భుత విజ‌యాన్ని అందుకుంది. ప్ర‌స్తుతానికి ఈ సినిమా కేర‌ళ‌లో వంద కోట్ల రూపాయ‌ల గ్రాస్ ను సాధించ‌డంతో పాటు, రెస్టాఫ్ ఇండియాలోనూ, విదేశాల్లో మ‌రో 90 కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింద‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా బ‌డ్జెట్ కు, ముందుగా ఉండిన పెద్దగా లేని అంచ‌నాల‌కూ .. ఇవి అతి భారీ వ‌సూళ్లే అని అంటున్నారు.

ఎలాంటి ప్ర‌చారం లేక‌పోయినా.. తెలుగు అనువాద వెర్ష‌న్ కూడా రెండు కోట్ల రూపాయ‌ల వ‌సూళ్ల‌ను సాధించింద‌ట‌. మ‌ల‌యాళీ హీరోలు ఈ మ‌ధ్య కాలంతో కొన్ని సినిమాల విష‌యంలో తెలుగునాట కూడా ప్ర‌మోష‌న్లు చేసుకుంటూ ఉన్నారు. అయితే వారు అంచ‌నాలు పెట్టుకున్న సినిమాల‌ను ప్ర‌మోట్ చేసుకుంటూ, మంచి సినిమాల‌ను మాత్రం స‌రిగ్గా ప్ర‌మోట్ చేసుకోలేక‌పోతున్నారు. తుడ‌రుం కూడా ఈ కోవ‌కే చెందుతుంద‌నుకోవాలి. మ‌ల‌యాళం టైటిల్ తోనే విడుద‌ల చేయ‌డంతో పాటు, ఈ సినిమా వ‌స్తోంద‌నే ప్ర‌చారాన్ని, పాజిటివ్ టాక్ ను కనీస స్థాయిలో ప్ర‌మోట్ చేసుకోలేక‌పోయారు. దీంతో ఆ రెండు కోట్ల రూపాయ‌ల స్థాయి వ‌సూళ్లే గొప్ప అయ్యాయి.

ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా ప‌డిన‌ట్టుగా ఉంది. ముంద‌స్తు ఒప్పందం ప్ర‌కారం గ‌త వార‌మే ఈ సినిమా ఓటీటీ లో విడుద‌ల కావాల్సింది. అయితే సినిమా కేర‌ళ‌లో సూప‌ర్ హిట్ కావ‌డంతో పాటు ఇంటాబ‌య‌ట మంచి టాక్ పొంద‌డంతో.. ఇప్పుడ‌ప్పుడే ఓటీటీలోకి వ‌ద‌ల‌డం లేద‌ట‌. ఏప్రిల్ 25న విడుద‌ల అయినా ఈ సినిమా బ‌హుశా జూన్ లో ఓటీటీలోకి రావొచ్చ‌నేది ప్ర‌స్తుత అంచ‌నా!

2 Replies to “సినిమా సూప‌ర్ హిట్, ఓటీటీ రిలీజ్ వెన‌క్కు!”

Comments are closed.