టాలీవుడ్ – 18న ఏం జరుగుతుంది?

టాలీవుడ్ లో కాస్త కలవరం మొదలైంది. నైజాంలో శిరీష్/దిల్ రాజు వ్యాపారానికి గట్టి పోటీ దారుగా వున్న మైత్రీతో సితార చేతులు కలిపితే అది పెద్ద సంచలనమే అవుతుంది

థియేటర్లను అద్దెల ప్రాతిపదిక మీద కాకుండా, పర్సంటేజ్ ల లెక్కన నడపాలనే వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే ఈస్ట్, కృష్ణా, సీడెడ్, నైజాం ల్లో ఈ నినాదం ఊపు అందుకుంది. దీంతో రెండు రాష్ట్రాల ఎగ్జిబిటర్లతో ఫిలిం చాంబర్ ఈ నెల 18న ఓ అతి పెద్ద సమావేశం నిర్వహించబోతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్ల వెనుక వుండి ఆడిస్తున్న పెద్ద మనుషుల ఆట కట్టించాలనే ఆలోచనతో యాక్టివ్ నిర్మాతలు కొందరు ప్రతి వ్యూహాలు రచించడం ప్రారంభించారు.

ఇక్కడ విషయం ఏమిటంటే దగ్గుబాటి సురేష్ బాబు, ఆసియన్ సునీల్, దిల్ రాజు/శిరీష్ కలిసి ఎగ్జిబిటర్లను ఎగసం దోసి, పర్సంటెజ్ సిస్టమ్ కు రెచ్చగొడుతున్నారని యాక్టివ్ నిర్మాతలు అనుమానిస్తున్నారు. పర్సంటేజ్ సిస్టమ్ వస్తే పుష్ప లాంటి భారీ సినిమాలకు కనీసం పది నుంచి ఇరవై కోట్లు నిర్మాతలకు నష్టం వస్తుందని అంటున్నారు. అదే నైజాంలో నలభై కోట్లు వసూలు చేసే సినిమాకు కనీనం ఏడెనిమిది కోట్లు నష్టం వస్తుందని నిర్మాతలు అంటున్నారు.

థియేటర్లు రన్ చేయలేకపోతున్నామని, పెద్ద సినిమాలకు రెంట్లు అంటున్నారని, రెండు వారాలు కాగానే షేరింగ్ మీద ఆడమంటున్నారని, ఇది కరెక్ట్ కాదు కదా అని ఎగ్జిబిటర్లు అంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో పర్సంటేజ్ విధానానికి మద్దతు ఇస్తున్న శిరీష్/దిల్ రాజు కు బ్రేక్ వేయడానికి, మైత్రీ సంస్థతో చేతులు కలిపేందుకు సితార సంస్థ సిద్దం అవుతోంది. కొత్త పంపిణీ సంస్థను నైజాంలో ప్రారంభించి, కేవలం మల్టీ ప్లెక్స్ ల్లో సినిమాలు విడుదల చేస్తామని ఫీలర్లు వదిలారు.

దీంతో టాలీవుడ్ లో కాస్త కలవరం మొదలైంది. నైజాంలో శిరీష్/దిల్ రాజు వ్యాపారానికి గట్టి పోటీ దారుగా వున్న మైత్రీతో సితార చేతులు కలిపితే అది పెద్ద సంచలనమే అవుతుంది. దీంతో ఇప్పుడు పర్సంటేజ్ వివాదం కొత్త మలుపుతిరిగేలా వుంది.

ఈ నేపథ్యంలో ఈనెల 18న చాంబర్ లో ఎగ్జిబిటర్ల సమావేశం జరగబోతోంది. చాలా వాడి వేడిగా జరిగే ఈ సమావేశం తరువాత అసలు మలుపులు, మెరుపులు వుంటాయి.

One Reply to “టాలీవుడ్ – 18న ఏం జరుగుతుంది?”

  1. అసలు ఇందులో డబ్బులు ఇన్ని వందల కోట్లు పెట్టే  అర్హత లు ఉన్నాయా, వీళ్ళ వెనక ఏ పన్ను పోటు దారులు ఉన్నారో అసలు డబ్బులకి లెక్కలు ఉన్నాయా

Comments are closed.