మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చెల్లి భూమా మౌనికారెడ్డి నాలుగైదు రోజులుగా పత్తాలేకుండా పోయారు. ఆమె సెల్‌ఫోన్ కూడా స్విచ్ఛాప్‌లో ఉండడంతో అనుచరులు ఆందోళన చెందుతున్నారు. ఐదు రోజుల క్రితం ఆళ్లగడ్డకు వచ్చి భరోసా ఇచ్చి వెళ్లారు.
ఆమె మాటలు నమ్మిన వాళ్లకు నిరాశే ఎదురైంది. ఆళ్లగడ్డ టీడీపీ ఇన్‌చార్జ్, తన అక్క భూమా అఖిలప్రియ కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న నేపథ్యంలో కేడర్‌కు భరోసా ఇచ్చేందుకు చెల్లి మౌనిక రంగంలోకి దిగారు.
ఈ నేపథ్యంలో ఐదారు రోజుల క్రితం ఆమె ఆళ్లగడ్డ వచ్చారు. ముఖ్యమైన నేతలను ఇంటి వద్దకు పిలిపించుకున్నారు. ఆ సందర్భంలో ఆమె ఉద్వేగంగా, ఆవేశంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఏం మాట్లాడారంటే…
“మేమంతా భూమా నాగిరెడ్డి పిల్లలం. సింహం బోనులా ఉన్నా, బయట ఉన్నా సింహం సింహమే. రోడ్డు మీద ఉన్నా సింహం సింహమే. వాళ్ల అధికారం, రాజకీయం ఒక ఆడపిల్ల మీద చూపించుకున్నారే తప్ప, మరెందులోనూ నిరూపించుకోలేకపోయారు.
మొదటిసారి ఒక ఆడపిల్ల మీద ఇంత కక్ష రాజకీయాలు చూస్తున్నా. మన కార్యకర్తలందరికీ కూడా నేను ఒకే మాట చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ అక్కకు ఇబ్బందై హైదరాబాద్‌లో ఉన్నా కూడా, భూమా కుటుంబం నుంచి నేను తప్పకుండా కాంటాక్ట్‌లో ఉంటాను. ఏ సమస్య వచ్చినా నేను ముందుకుంటాను.
మీకు ఏ సమస్య వచ్చినా ఇంతకంటే గట్టిగా పోరాడుతాను. మీ సమస్య నా సమస్య అనుకుని నేను తప్పకుండా పోరాడి ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. బీజేపీ కిషన్‌రెడ్డితో మాట్లాడి కేసుల పరంగా మనవాళ్లకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను. ఏ సమయం అయినా, రాత్రి ఏ వేళైనా ఫోన్ చేసే అధికారం, హక్కు మీకుంది. ఎక్కడున్నా మీ ముందర వాలుతాను.
ఏ విధంగానైతే మా అక్క సమస్యపై ప్రభుత్వంతో , పోలీసులతో, డాక్టర్లతో పోరాడుతున్నానో, అంతకంటే ఎక్కువగా మీ కోసం పోరాడుతాను. భూమా కార్యకర్తపై కన్ను, చెయ్యి పడకుండా చూసుకుంటాను. నా నంబర్ ఇచ్చిపోతాను. డైరెక్టర్‌గా నాకే ఫోన్ చేయండి. మధ్యలో ఎవరూ ఉండరు. రాజకీయ ఒత్తిళ్లు, డిపార్ట్‌మెంట్ సమస్యలు…ఇలా ఏవైనా నేరుగా ఫోన్ చేస్తే చాలు, మీ ఇంటి వద్ద వాలుతా” అని గట్టి భరోసా ఇచ్చి వెళ్లారు.
ఈ నేపథ్యంలో భూమా అనుచరులపై వివిధ రకాల కేసులు నమోదవుతున్నాయి. దీంతో తమకు భరోసా ఇచ్చిన భూమా మౌనికకు వాళ్లంతా ఫోన్ చేస్తుంటే ..ఎలాంటి స్పందనా లేదని వాపోతున్నారు. తన సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాప్ చేసినట్టు భూమా అనుచరులు చెబుతున్నారు. ఇటీవల మౌనిక ఓ ఇంటర్వ్యూలో తన బావ భార్గవ్‌రామ్ గురించి మాట్లాడుతూ ….తనకు భద్రత లేదని, అలాంటప్పుడు ఏ విధంగా పోలీసులకు లొంగిపోతాడని ఎదురు ప్రశ్నించారు.
దీంతో భార్గవ్‌రామ్ ఆచూకీ మౌనికకు తెలిసి ఉంటుందని, అందువల్లే ఆమె ఆ విధంగా మాట్లాడారని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలిసింది. భార్గవ్‌రామ్ ఆచూకీ తెలపాలని తనను ప్రశ్నించేందుకు పోలీసులు సమాయత్తం అయ్యారనే విషయం తెలుసుకుని, మౌనిక తన సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేసినట్టు అనుచరులు చెబుతున్నారు. తనను తాను రక్షించుకోలేని మౌనిక, ఆళ్లగడ్డకు వచ్చి బీరాలు పలికి పోయారంటున్నారు.