ఏపీ బీజేపీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటన ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీని బలోపేతం చేసే కార్యాచరణలో భాగంగా సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఆ ప్రకటనలో బీజేపీ రాష్ట్రశాఖ పేర్కొంది. ఇందులో భాగంగానే వివిధ వర్గాల నేతలతో సోము వీర్రాజు సమావేశం కాబోతున్నారని పార్టీ తెలిపింది.
ఈ నేపథ్యంలో కిర్లంపూడిలో శనివారం కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం, అనంతరం మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు కిమిడి కళా వెంకటరావు, అరుణలతో వారి నివాసాల్లో సోము వీర్రాజు సమావేశం అవుతారని బీజేపీ స్పష్టంగా పేర్కొంది. ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించే అవకాశం ఉందని కూడా బీజేపీ స్పష్టపరిచింది.
బీజేపీ ప్రకటనలో టీడీపీ ముఖ్యనాయకుడు కళా వెంకటరావును కలవనున్నట్టు పేర్కొనడంతో ఒక్కసారిగా ఆ పార్టీ ఉలిక్కి పడింది. పైగా కళా వెంకటరావు బీజేపీలోకి చేరనున్నారని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో టీడీపీ ఆందోళన చెందింది. కళా వెంకటరావుకు పెద్ద ఎత్తున ఫోన్‌కాల్స్ వెళ్లడం స్టార్ట్ అయింది.
అసలే ఎప్పుడెవరు పార్టీ మారుతారో తెలియని అయోమయ స్థితి టీడీపీలో నెలకుంది. ఈ పరిస్థితిలో నిన్నమొన్నటి వరకు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కళా వెంకటరావు బీజేపీలో చేరనున్నారనే వార్తలు టీడీపీని సహజంగానే ఉక్కిరిబిక్కిరి చేశాయి. పైగా కళా వెంకటరావుకు పార్టీ మారిన చరిత్ర ఉండనే ఉంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజే స్వయంగా కళా వెంకటరావు ఇంటికి వెళ్లనున్నారని ఆ పార్టీ ఏకంగా ప్రకటన ఇవ్వడం సంచలనం రేకెత్తించింది. పార్టీ మార్పుపై పెద్ద ఎత్తున ప్రచారం కావడం, మరోవైపు టీడీపీ అధిష్టానం నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో కళా వెంకటరావు ఎట్టకేలకు స్పందించాల్సి వచ్చింది.
తనపై జాతీయ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. టీడీపీతో, చంద్రబాబుతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తానే కాదు, తన వారసులు కూడా టీడీపీలోనే కొనసాగుతారని ఆయన స్పష్టం చేయడం గమనార్హం.
టీడీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును తను కలవడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తాను శనివారం ముద్రగడను మినహా మిగిలిన వారిని కలవడం లేదని పేర్కొన్నారు. ఇటీవల కళా వెంకటరావు అన్న కుమారుడు వినయ్‌కుమార్ తనను కలిశారని పేర్కొన్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వివిధ రంగాల ప్రముఖులను కలుస్తున్నట్టుగానే, ముద్రగడను కలవబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
తాను చంద్రబాబుతో ఉన్నట్టే … తన వారసులూ లోకేశ్‌తో ప్రయాణం సాగిస్తారంటూ కళా వెంకటరావు పేర్కొనడం గమనార్హం. కళా వెంకటరావుకు గతంలో పార్టీ మారిన చరిత్ర ఉంది. టీడీపీలో అనేక పదవులు అనుభవించిన కళా వెంకటరావు, పార్టీ కష్టకాలంలో ఉండగా 2009లో పార్టీ మారిన సంగతిని టీడీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నాయి.
తమ సామాజిక వర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టగానే, అందులోకి ఫిరాయించడాన్ని శ్రీకాకుళం టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తమ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, మరోవైపు టీడీపీకి భవిష్యత్ లేదనే సంకేతాలుండడం వల్లే కళా వెంకటరావు పక్క చూపులు చూస్తున్నారనే అనుమానాలు ఆ పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తం అవుతున్నాయి.
కిమిడి ఆందోళన నేపథ్యంలో తాను ఆయన్ను కలవడం లేదని సోము వీర్రాజు ప్రకటించారని చెబుతున్నారు. మొత్తానికి నిప్పు లేనిదే పొగ రాదంటారు. కిమిడి పార్టీ మారుతారనే ప్రచారాన్ని కూడా ఆ కోణంలోనే అర్థం చేసుకోవాలని టీడీపీ, బీజేపీ శ్రేణులు చెబుతుండడం గమనార్హం.