ఎన్నికలకు ఇక పెద్దగా సమయం లేకపోయినా.. పవన్ కల్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేస్తాడనే క్లారిటీ ఆయనకు కూడా ఉన్నట్టుగా లేదు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి మరీ ఓడిన పవన్ కల్యాణ్.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడనేది జనసైనికులకు కూడా క్లారిటీ లేని అంశమే! కాపుల జనాభా గట్టిగా ఉన్న చోట పవన్ పోటీ చేస్తారనేది మాత్రం క్లారిటీ ఉన్న అంశమే.
తనకు కులం లేదని, తను కుల రాజకీయం చేయనని పొద్దుకు పది సార్లు చెప్పుకునే పవన్ కల్యాణ్ తన రాజకీయం అంత కులం ఆలంబనగానే చేస్తారు, కుల రాజకీయమే చేస్తారు. తను పోటీ కూడా కుల బలం ఉన్న చోట్లను చూసుకుని గత ఎన్నికల్లో పోటీ చేశారు. అది కూడా రెండు చోట్లా కులం లెక్క వేసుకునే పోటీ చేశారు. అయితే పవన్ కుల రాజకీయం ఫలించలేదు.
ఇప్పుడు పవన్ అనంతపురం నుంచి పోటీ చేయబోతున్నారనే లీకును ఒకటి వదులుతున్నారు. పవన్ కల్యాణ్ అనంతపురం నుంచి పోటీ చేస్తే తన టికెట్ ను త్యాగానికి రెడీ అంటూ గతంలో అక్కడి టీడీపీ ఇన్ చార్జి ప్రభాకర్ చౌదరి ప్రకటిచారు! అలా పవన్ కోసం తెలుగుదేశం త్యాగరాజు అప్పట్లో ఆ ప్రకటన చేశారు. మరి ఇప్పుడు ఆయన ఆ ప్రకటనకు ఏ మేరకు కట్టుబడతారో చూడాల్సి ఉంది.
మరి తెలుగుదేశం గనుక పవన్ కల్యాణ్ కు అనంతపురం అసెంబ్లీ టికెట్ ను కేటాయిస్తే.. రాజకీయం ఆసక్తిదాయకంగా ఉంటుంది. అనంతపురంలో పవన్ పోటీ అనే మాటకు కూడా కారణం కులమే. దాదాపు 60 వేల బలిజల ఓట్లు ఉన్నాయక్కడ. బలిజల ఓట్ల ద్వారా బయటపడాలనే ప్రయత్నంతో పవన్ కల్యాణ్ అనంతపురం గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు!
ఈ బలిజల్లో మెజారిటీ తెలుగుదేశం వైపే ఉంటారు. 60-70 శాతం వరకూ తెలుగుదేశం ఓటు బ్యాంకే బలిజలు. ఇక్కడ నుంచి ప్రజారాజ్యం, జనసేనలు ఇది వరకటి ఎన్నికల్లో పోటీ చేసి కొంత స్థాయిలో బలిజల ఓట్లను పొందాయి. మరి రేపు పవన్ పోటీ చేస్తే.. తెలుగుదేశం కూడా మద్దతే కాబట్టి.. గంపగుత్తగా పడతాయనే లెక్కలతో పవన్ ఉన్నారు కాబోలు!
అయితే.. అరవై డెబ్బే వేల కాపు ఓట్లు ఉన్న చోటే పవన్ నెగ్గలేకపోయారు. మరి బలిజలంతా ఓట్లేస్తారనే లెక్కతో అనంతపురం నుంచి పోటీ చేస్తే పవన్ కు అది సాహసమే అవుతుంది. అందులోనూ తెలుగుదేశం లోపాయి కారీగా పవన్ కు సహకరించకుండా ఓడించేసి పవన్ రాజకీయానికి పూర్తిగా చెక్ పెట్టే అవకాశాలూ ఉండనే ఉంటాయి!