ముత్తంశెట్టికి ముంగిట ముసలం

వైసీపీకి చెందిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు సొంత సీటు భీమునిపట్నంలో ముసలం పుట్టింది. ఆయన్ని నాన్ లోకల్ అంటూ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు. మాలమనాహాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు విమర్శించారు.…

వైసీపీకి చెందిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు సొంత సీటు భీమునిపట్నంలో ముసలం పుట్టింది. ఆయన్ని నాన్ లోకల్ అంటూ ఎస్సీ సామాజికవర్గానికి చెందిన నాయకుడు. మాలమనాహాడు వ్యవస్థాపక కార్యదర్శి భాగం గోపాలరావు విమర్శించారు. ఈసారి టికెట్ ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలని, పక్కా లోకల్ కే వైసీపీ టికెట్ దక్కాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

విద్యా వ్యాపారం చేసుకునే మాజీ మంత్రి ఇంట్లో నాలుగు పదవులా అని ఆయన విమర్శించారు. వైసీపీకి మద్దతుగా ఉంటూ వస్తున్న ఎస్సీలకు భీమిలీ నియోజకవర్గం పరిధిలో మొత్తం తొమ్మిది కార్పోరేటర్లు ఉన్నా ఎస్సీస్ కి ఒక్కటీ ఇవ్వలేదని విమర్శించారు. అలాగే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎస్సీస్ నుంచి లేరన్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో ఇద్దరు దళితులకు మంత్రి పదవులు ఇస్తే జగన్ ప్రభుత్వంలో ఆ సంఖ్యలో అయిదుకు పెంచి సామాజిక న్యాయం చేస్తున్నారని, అదే విధంగా భీమిలీ నియోజకవర్గంలో కూడా స్థానికులకు ఎస్సీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఆయన కోరారు.

మంత్రిగా మూడేళ్ల కాలంలో ముత్తంశెట్టి సరిగ్గా పనిచేయలేదని, భీమిలీలో ఎలాంటి అభివృద్ధి పనులను ఆయన చేపట్టలేకపోయారని నిందించారు. ఈసారి వైసీపీ భీమిలీలో విజయం సాధించాలంటే దళితులకే టికెట్ కేటాయించాలని అన్నారు.

ఇవన్నీ చూస్తూంటే మాజీ మంత్రి సొంత సీటులోనే టికెట్ చిచ్చు మొదలైనట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో హోరా హోరీ పోరు ఉంటుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో మాజీ మంత్రికి పోటీగా వైసీపీ నుంచి సీటు కోసం మరి కొందరు కూడా రానున్న కాలంలో బయటకు వస్తారని తెలుస్తోంది. మాజీ మంత్రి ఈ తలపోట్లను ఎలా తట్టుకుంటారో అన్నదే వైసీపీలో  నేతల మధ్య డిస్కషన్ గా ఉంది.