బాలయ్య చిన్నల్లుడు గీతం విద్యా సంస్థల అధినేత శ్రీ భరత్ కి విశాఖ నుంచి ఎంపీ కావాలని ఉంది. 2019 ఎన్నికల్లోనే ఆయన పోటీ చేసి కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడారు. ఈసారి మాత్రం గెలిచి తీరాలని చూస్తున్నారు.
పొత్తుల వల్ల విశాఖ ఎంపీ సీటుకే తొలి ఎసరు అని వార్తలు వస్తున్న క్రమంలో శ్రీ భరత్ ముందు జాగ్రత్త చర్యలకు దిగిపోయారు. ప్రతీ రోజూ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కలియ తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో తానే ఎంపీగా పోటీ చేస్తాను అని టీడీపీ క్యాడర్ కి చెబుతూ వారితో పాటు ప్రజలను కలుస్తున్నారు. ప్రజలతో మాటా మంతీ చేస్తూ వారితో పాటు భోజనం చేస్తూ బాలయ్య చిన్నల్లుడు తన వ్యూహాలలో తాను ఉన్నారు.
విశాఖ సీటుకు ఇపుడు భారీ పోటీ వచ్చిపడింది. బీజేపీతో పొత్తులు ఉంటాయని దాదాపుగా తెలిసిపోతున్న సందర్భంలో కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ నుంచి పోటీ చేయవచ్చు అంటున్నారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా పోటీకి తయారు గా ఉన్నారు.
ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఖాయం అని బీజేపీ వర్గాల భోగట్టా. పొత్తులు ఉంటే విశాఖ ఎంపీ సీటుని టీడీపీ వదులుకోవాల్సిందే అని అంటున్నారు. ఎందుకైనా మంచిదని తన ప్రయత్నాలలో తాను ఉన్న ఎంపీ భరత్ మాత్రం గడప గడపకు తిరుగుతూ టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పరిచయం చేసుకుంటున్నారు. చంద్రబాబు తనకు కొడుకు వరస అయ్యే శ్రీ భరత్ మీద అభిమానంతో పొత్తులో సీటు పోకుండా అడ్డు చక్రం వేస్తారా, లేక బాలయ్య సిఫార్సు చేసి తన చిన్నల్లుడి ముచ్చటను తీరుస్తారా అన్నది ఆలోచించాల్సి ఉంది.