మరో మూడు రోజుల్లో విడుదలకు రెడీ అవుతోంది ప్రభాస్-ఓంరౌత్ కాంబినేషన్ లో తయారైన ఆదిపురుష్. ఈ సినిమా తెలుగు హక్కులు హోల్ సేల్ గా భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. ఆపై రిటైల్ గా కూడా అదే రేంజ్ లో అమ్ముడుపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 250 నుంచి 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు కళ్ల చూడాల్సి వుంది. ఇది చిన్న ఫీట్ కాదు. ఇలాంటి ఫీట్ సాధించాలంటే థియేటర్ల ప్లానింగ్ పెర్ ఫెక్ట్ గా వుండాలి.
ఆదిపురుష్ అదృష్టం ఏమిటంటే విరూపాక్ష తరువాత ఇప్పటి వరకు సరైన సినిమా పడలేదు. థియేటర్లు అన్నీ లాస్ ల్లో నడుస్తున్నాయి. ఆదిపురుష్ మా థియేటర్లో వేయండి అంటే మా థియేటర్లో వేయండి అని ఎగ్జిబిటర్లు వెంటపడుతున్నారు. అందువల్ల ఎగ్జిబిటర్ అడ్వాన్స్ లకు పెద్దగా సమస్య కాదు. అలాగే థియేటర్లకు అంతకన్నా సమస్య కాదు. కావాల్సిననన్ని థియేటర్లు వేసుకోవచ్చు.
ఆంధ్రలో దాదాపు మాగ్జిమమ్ థియేటర్లలో ఆదిపురుష్ ను విడుదల చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోంది. అలాగే 50 రూపాయల అదనపు రేటు కూడా దాదాపు వచ్చినట్లే. ఆంధ్ర ప్రభుత్వం వైపు నుంచి సూత్ర ప్రాయంగా అంగీకారం వచ్చింది. జీవో రావాల్సి వుంది. వీలయినన్ని థియేటర్లలో, అదనపు రేట్లతో ప్రదర్శించడం ద్వారా మొదటి మూడు రోజుల్లో మాగ్జిమమ్ వసూళ్లు రాబట్టడం అన్నది ప్లానింగ్ గా కనిపిస్తోంది.
తొలి రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి 50 నుంచి అరవై కోట్ల వసూళ్లు సాధిస్తే, ఫస్ట్ వీకెండ్ లో టోటల్ టార్గెట్ లో సగానికి సగం సాధించవచ్చని లెక్కలు కడుతున్నారు. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ వ్యూహాలు అన్నీ ఫలించి, మంచి ఫలితాలు నమోదు చేసే అవకాశం వుంది.