ఎమ్బీయస్: అమిత్-బాబు భేటీ వ్యాసానికి తరువాయి భాగమిది. సిపిఐ నారాయణ అనేదేమిటంటే టిడిపి, బిజెపి, జనసేన కూటమి ఏర్పడితే జగన్ నెత్తిమీద పాలు పోసినట్లే అని. వాళ్ల బాధ వాళ్లదనుకోండి, టిడిపి బిజెపి వైపు వెళితే వాళ్లతో ఎవరూ పొత్తు పెట్టుకోక అనాథలవుతారు. ఆయన వాదన ఏమిటంటే రాష్ట్రానికి ఏమీ చేయలేదని ఆంధ్రులు బిజెపిపై కోపంతో ఉన్నారు. ఆ కోపం టిడిపి, జనసేనలపై కూడా ప్రసరించి నష్టపోతారు. బిజెపి వ్యతిరేక మైనారిటీ, పేదవర్గాల ఓటు బ్యాంకు సాంతం వైసిపి పక్షాన వెళ్లిపోతుంది. ఎందుకంటే వైసిపి, బిజెపిది సహజీవనం, వివాహం కాదు. బయటకు కనబడదు. టిడిపి వెళ్లి వివాహం చేసుకుంటోంది.
మరి టిడిపి వాళ్ల ఆలోచనేమిటి? బాబుకి ఆంతరంగికుడైన రాధాకృష్ణ యివాళ్టి తన ‘‘కొత్తపలుకు’’లో చెప్పిన సంగతేమిటంటే, బిజెపి, టిడిపి విడివిడిగా ఉండటం చేత జగన్ ఆంధ్రలో క్రైస్తవీకరణను ఉధృతం చేస్తున్నాడనే బాధతో ఆరెస్సెస్ పెద్దలు యీ భేటీని ఏర్పాటు చేశారు. 2019లో బిజెపితో వైరం పూని నష్టపోయిన తర్వాత బాబు జగన్ దాష్టీకం నుంచి తనను, తన క్యాడర్‌ను కాపాడుకోవడానికి మోదీని చల్లబరచే ప్రయత్నంలో ప్రతిపక్షాలకు కూడా దూరమయ్యారు. ఇప్పుడు భేటీకి వెళ్లారు. పొత్తు పెట్టుకుంటే లాభమా, నష్టమా అనేది టిడిపిలో కూడా చర్చనీయాంశంగా ఉంది. ముస్లిం జనాభా గణనీయంగా ఉన్న రాయలసీమ టిడిపి వాళ్లు వద్దంటున్నారు. అవినాశ్ వ్యవహారంతో సహా, కేంద్రం జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందనే అభిప్రాయం ఉన్న యీ తరుణంలో బిజెపితో పొత్తు పెట్టుకుంటే జగన్ వ్యతిరేక ఓటు తెచ్చుకోవడం ఎలా? అని కొందరు టిడిపి నాయకుల ప్రశ్న. పార్టీలో ఏకాభిప్రాయం లేనందునే బాబు పొత్తు గురించి ధాటీగా మాట్లాడటం లేదని అనుకోవాలి.
ఆంధ్రుల్లో బిజెపిపై ఆగ్రహం చల్లారాలంటే బిజెపి ఆధ్వర్యంలోని కేంద్రం అర్జంటుగా రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు చేస్తే ఆ క్రెడిట్ జగన్‌కు పోతుంది. కేంద్రాన్ని ఒప్పించి తెచ్చాడని వైసిపి టముకు వేస్తుంది. ఇప్పుడు చేయకుండా టిడిపి అధికారంలోకి వచ్చాక చేస్తాం అంటే జనాలకు నమ్మకం కుదరదు. 2014-19 మధ్య మీ నిర్వాకం చూశాంగా అని పెదవి విరుస్తారు. ఇది కాచ్ 22 సిచ్యువేషన్. అందువలన ఆంధ్ర వరకు వచ్చేసరికి బిజెపితో పొత్తు పెట్టుకోకున్నా, యిద్దరి మధ్య సఖ్యత ఉంటే చాలు, 2019 నాటి యిక్కట్లు తప్పుతాయి అని బాబు అనుకుంటూండవచ్చు. తెలంగాణలో టిడిపి పొత్తు లాభదాయకమో, నష్టదాయకమో అమిత్‌కూ యింకా క్లారిటీ వచ్చి ఉండకపోవచ్చు.
పొత్తులేమీ లేకుండానే ఒకరినొకరు విమర్శించుకోకూడదు, అడ్డు రాకూడదు అనే అవగాహనకు వచ్చారేమో! అందుకే భేటీ తర్వాత ఏ ప్రకటనా లేదు. జాతీయ నాయకుడు కాబట్టి అమిత్ చేయకపోయినా బాబు దిల్లీలోనో, రాష్ట్రానికి వచ్చో ‘జగన్ రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే, త్వరలో పెనుమార్పు రాబోతోంది’ అని ఓ ప్రకటన చేసి ఉండేవారు. అది లేకపోయినా టిడిపికి అలవాటైన రీతిలో లీకులు వదిలేవారు. అనుకూల మీడియాలో చర్చలు జరిపించేవారు. అదీ లేదు. పైగా పొత్తుల గురించి యిప్పుడే ఏమీ మాట్లాడవద్దు అని బాబు తన సహచరులకు గట్టిగా చెప్పారట. అంటే పొత్తు విషయం కరారు కాలేదన్నమాట. కానీ సుహృద్భావంగా మసలుకుందామని అనుకుంటూండవచ్చు.
పొత్తుల గురించి మౌనంగా ఉండడంతో బాబు దిల్లీకి వెళ్లి తనపై కేసుల గురించి, మార్గదర్శిపై కేసుల గురించి బేరాలాడడానికి వెళ్లారనే విమర్శ వచ్చింది. ఆయన రాష్ట్రం గురించి వెళ్లానని చెప్పినా ఎవరూ నమ్మరు. సరేలే అని నవ్వేస్తారు. కానీ కేసుల గురించైతే స్వయంగా వెళ్లి మాట్లాడతారా? ఏ సుజనా చౌదరితోనో కబురంపుతారు. ఏదో స్వలాభం లేనిదే బిజెపి ఐనా బహిరంగంగా పిల్చి మాట్లాడరు. అదేమిటి? ఎన్నికల బెనిఫిట్ మాట ఎలా ఉన్నా మీడియా సపోర్టు కోసం అమిత్ పిల్చి ఉండవచ్చు. బిజెపి ఏమీ చేయటం లేదని తెలంగాణ ప్రజల్లో తెరాస బాగా నాటింది. బిజెపి తమతో కలిసి రావటం లేదనగానే ఎబిఎన్ వాళ్లు టీవీ చర్చల్లో బిజెపి ప్రతినిథులను రాష్ట్రానికి ఏం చేశారంటూ మాటిమాటికీ వెక్కిరిస్తున్నారు. దాన్ని కౌంటర్ చేయడానికి తెలుగు మీడియా బిజెపి గురించి పాజిటివ్‌గా మాట్లాడాలి. దాని కోసం ఏం కావాలి? అని అమిత్ బాబుని డైరక్ట్‌గా అడిగి కమిట్‌మెంట్ తీసుకుని ఉండవచ్చు.
ఈ భేటీ తర్వాత టిడిపి సైలెంటుగా ఉంది, తెలంగాణ బిజెపి సైలెంటుగా ఉంది, కానీ ఆంధ్ర బిజెపి ప్రతినిథులు కొందరు టీవీ చర్చల్లో ‘2019లో టిడిపిని సమాధి చేశాం, 2024లో వైసిపిని సమాధి చేస్తాం’ అంటూ మాట్లాడడం మొదలుపెట్టారు. కొన్ని ఎంపీ సీట్లకు ఫలానా బిజెపి నాయకులు అభ్యర్థులు అంటూ ఓ జాబితా కూడా బయటకు వచ్చింది. ఫలానా సీట్లకు యిద్దరు పోటీ పడుతున్నారు అంటూ కూడా వచ్చింది. జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకునేటప్పుడు గతంలో ఎంజీఆర్ ఫార్ములా అని ఉండేది. జాతీయ పార్టీకి పార్లమెంటు సీట్లలో మూడింట రెండు వంతులు, ప్రాంతీయ పార్టీకి అసెంబ్లీ సీట్లలో మూడింట రెండు వంతులు అని. ఆంధ్రలో 16 పార్లమెంటు సీట్లు తీసుకుని నిభాయించే శక్తి బిజెపికి లేదు. బాబు మహా అయితే ఐదు సీట్లు యివ్వవచ్చు. వాటిలో ముగ్గురు బాబు అనుయాయులే ఉంటారనుకోవచ్చు.
బిజెపి-టిడిపి పొత్తు కుదిరినా కుదరకపోయినా, యీ భేటీ ద్వారా అమిత్ బాబుకి స్నేహహస్తం చాచారన్నదానిలో సందేహం లేదు. ఎందుకు అనేదానిపై నాకొక ఫార్‌ఫెచ్‌డ్ ఐడియా వచ్చింది. ఎందుకంటే బిజెపివి కూడా దీర్ఘకాలిక ప్రణాళికలే. ప్రాంతీయ పార్టీలు వ్యక్తికేంద్రిత పార్టీలు. జాతీయ పార్టీలు వ్యవస్థలా పనిచేస్తాయి. ఈ రోజు మొక్క నాటి, ఫలితాల కోసం వేచి ఉండే ఓపిక వాటికి ఉంటుంది. వ్యక్తుల ఆయుర్దాయం కంటె సంస్థ ఆయుర్దాయం దీర్ఘంగా ఉంటుంది. శివసేన విషయంలో బిజెపి చేసినది చూడండి. కాంగ్రెసు పార్టీ ఐతే యితర పార్టీల అధినాయకులను ప్రలోభ పెట్టి పార్టీని తమలో కలిపేసుకునేది. అలా చాలా పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. వాటిలో చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి ఒకటి. తెరాసను కూడా అలాగే కలిపేస్తానని కెసియార్ నాటకమాడి, పని అయ్యాక జెల్ల కొట్టారు. ఇది ఊహించని కాంగ్రెసు కంగు తింది. ఇలాటి విలీనం సందర్భాల్లో పాత విధేయతలు కొనసాగిస్తూ ఆ పార్టీ సభ్యులు ఒక జింజర్ గ్రూపుగా కాంగ్రెసులో ఉంటూంటారు.
బిజెపి శివసేన విషయంలో వేరే వ్యూహం అవలంబించింది. శివసేన మొదట్లో ప్రాంతీయ భావజాలంతో పుట్టింది. కొన్నాళ్లకు అది ఓట్లు రాల్చటం లేదని హిందూత్వను పట్టుకుంది. తనతో భావసారూప్యత ఉందని గ్రహించి బిజెపి దాని పంచన చేరింది. కలిసి పని చేస్తూ, క్రమేపీ శివసేన క్యాడర్‌ను తన పార్టీ వైపు ఆకర్షించింది. కూటమిలో తనే బిగ్ బ్రదర్ అయింది. ఇటీవల శివసేనను చీల్చి పారేసింది. ఒక కమ్యూనిస్టు పార్టీని బిజెపి యిలా చేయగలదా? అసాధ్యం. వాళ్ల ఓటు బ్యాంకు వేరు. శివసేనది, తమది ఒకే ఓటు బ్యాంకు. అందుకని వారితో చేరి, లోపలికి చొచ్చుకుపోయి, ఆ భావజాలంలో మీ వాళ్ల కంటె మేమే ఛాంపియన్స్ అని ఆ పార్టీ అభిమానులను నమ్మిస్తే చాలు. దాన్ని స్వాహా చేసేయవచ్చు.
ఇప్పుడు టిడిపిపై దాని కన్ను పడింది అనుకుని ఆలోచిద్దాం. హిందూత్వ విషయంలో తప్పిస్తే టిడిపి, బిజెపిది ఒకే ఓటు బ్యాంకు. మధ్య, ఎగువ మధ్య తరగతి, అగ్రకులాలు, నగరవాసులు వీళ్లే యిద్దరికీ కామన్. మొన్న కర్ణాటక ఎన్నికలలో కూడా బెంగుళూరు నగరవాసులు, నెలకు రూ.30 వేల కంటె ఎక్కువ ఆదాయం వచ్చే వర్గాలు బిజెపి వెనుక సాలిడ్‌గా నిలిచాయి. ఆంధ్రలో 2019 వదిలేస్తే టిడిపి వెనక నిలబడిన వర్గాలేమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, కమ్మ, కాపు, బిసి, కొంతవరకు రెడ్లలోని మధ్య, ఎగువ మధ్యతరగతి వర్గాలు. యుపిఏ-2 పాలన తర్వాత వీరందరిలో కాంగ్రెసు పట్ల ద్వేషం, ప్రత్యామ్నాయం పట్ల ఆసక్తి పెరిగాయి. మోదీ వేవ్ 2013లో ప్రారంభమైన దగ్గర్నుంచి హిందూ రాడికలైజేషన్ కూడా ప్రారంభమైంది. అభివృద్ధి పేరుతో కాపిటలిజంపై మోజు పెరిగింది.
దీనికి భిన్నంగా యితర కులాలు, బడుగు కులాలు, బలహీన వర్గాలు కాంగ్రెసు స్థానంలో వచ్చిన వైసిపిని ఆదరించాయి. 2014లో యీ రెండు వర్గాల మధ్య పోరు జరిగింది. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో బాబు, యిద్దరూ కలిస్తే ఆంధ్ర దూసుకుపోయి తెలంగాణపై సొడ్డు వేసేస్తుందనే సమరోత్సాహం చూపినా కూటమికి వైసిపి కంటె ఒకటిన్నర శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. బిజెపి విభజన హామీలు నెరవేర్చినా, బాబు అమరావతి ఊబిలో కూరుకుపోకుండా అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేసినా బిజెపి-టిడిపి డెడ్లీ కాంబినేషన్‌గా ఉండేది. కానీ ఏ కారణం చేతనో బిజెపి ఆంధ్రను చిన్నచూపు చూసి, బాబు యిమేజి దెబ్బ తినేందుకు కారకమైంది. విధి లేని పరిస్థితుల్లో, తప్పుడు అంచనాలతో బాబు బిజెపితో కయ్యం పెట్టుకుని ఘోరంగా నష్టపోయారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ తన వర్గాల్లో బలం పెంచుకుంటూ పోయారు. టిడిపి, బిజెపి, జనసేన మూడూ కలిసినా జగన్ ఓటు బ్యాంకును ఏమీ చేయలేని పరిస్థితి. కూటమి నెగ్గాలంటే తటస్థుల ఓట్లు పడాలంతే!
పార్టీ చరిత్రలో కనీవినీ ఎరగనంత ఘోరంగా ఓడిపోవడంతో టిడిపి చతికిలపడింది. క్యాడర్, నాయకులు చప్పబడ్డారు. బాబు నాయకత్వంలోని ప్రధాన లోపం డెలిగేట్ చేయకపోవడం! తనకు డెలిగేట్ చేసి ఎన్టీయార్ ఎలా నష్టపోయారో క్షుణ్ణంగా తెలిసిన బాబు, మరెవ్వరికీ ఏ పనీ డెలిగేట్ చేయలేదు. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎదగనీయలేదు. ఎంత వయసు వచ్చినా తనే పార్టీ భారం, అప్పుడప్పుడు ప్రభుత్వభారం మోస్తూ వచ్చారు. ప్రభుత్వంలో ఉన్నపుడు మంత్రులను డమ్మీ చేసి అన్ని నిర్ణయాలూ తనే తీసుకునే అలవాటాయనది. ఆ కారణంగా పార్టీపై దృష్టి తక్కువై ఓడిపోతూంటారు. ఎంత వయసు వచ్చినా కరుణానిధి పార్టీ నడపలేదా అంటే ఆయన పార్టీని ప్రాంతాలవారీగా పిల్లల మధ్య, అనుచరుల మధ్య పంచాడు. తను వ్యూహరచనకు పరిమితమయ్యాడు. ఇక్కడ పాదయాత్రలకూ బాబే (యీ మధ్యే లోకేశ్ మొదలుపెట్టాడు), ప్రెస్ మీట్లకూ బాబే, ర్యాలీలకూ బాబే! మహానాడు బ్రోషర్ డిజైన్, క్యాంపెయిన్ స్లోగన్స్ కూడా ఆయన ఫైనలైజ్ చేయాల్సిందే.
70 ఏళ్లు దాటిన ఒక వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యంపై పార్టీ మొత్తం ఆధారపడినప్పుడు దాని భవిష్యత్తు గురించి పార్టీ అభిమానుల్లో ఆందోళన కలగడం సహజం. 25, 30 ఏళ్ల పాటు రాజకీయాలు నెరుపుదామనుకున్న యువనాయకులు పార్టీలో రావడానికి జంకుతున్నారు. ఇలా వల్నరబుల్‌గా ఉన్న టిడిపిని క్షీణింపచేసి, దాని స్థానంలోకి వద్దామని బిజెపి అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. 2024-29 మధ్య మేం ఎదిగి, 2029 నాటికి అధికారానికి దగ్గరగా వస్తాం అని బిజెపి అంటోందంటే దాని అర్థం యిదే. ఎదగాలంటే ఎవరిదో ఒకరి ఓటు తను గుంజుకోవాలి. కాంగ్రెసును కబళించి, వైసిపి స్థిరపడినట్లే, టిడిపిని హరాయించుకుని తను స్థిరపడాలని బిజెపి అనుకోవడం సహజం. 2019 తర్వాతనే బిజెపి యిది మొదలుపెట్టి కమ్మలను తన వైపు ఆకర్షిస్తుందనుకున్నా. కానీ వాళ్లు కాపులను ముందు పెట్టుకుని పార్టీ నడుపుతూ వచ్చారు, అదీ మందగమనమే! దాని గురి దేశంలోని వేరే ప్రాంతాలపై ఉంది.
ఇప్పుడు టిడిపికి చేరువ కావాలని చూస్తున్నది యీ ప్రణాళికతోనే నేమో తెలియదు. యండమూరి ఓ నవలలో రాస్తారు. ‘అతను వ్యాపారం అంటూ ఓ స్నేహితుడితో చేతులు కలిపాడు, వాడి భార్యతో కాళ్లు కలిపాడు. కొద్దికాలానికే ఆ కంపెనీ అతనిదై పోయింది…’ అంటూ. లవ్, వార్‌లలో మాత్రమే కాదు, బిజినెస్, పాలిటిక్స్‌లో కూడా ఎవిరిథింగ్ యీజ్ ఫెయిర్. ఉద్ధవ్‌తో బిజెపి ఎంతోకాలం స్నేహం నెరపింది. ఇప్పుడు అతని పార్టీని అతని దగ్గర్నుంచి లాక్కుని ఉత్సవ విగ్రహాన్ని చేసింది. బాబు ఎన్టీయార్ బతికుండగానే ఆయన్నుంచి పార్టీ లాక్కున్నారు. ఇప్పుడు బాబు నుంచి క్యాడర్‌ను, ఓటు బ్యాంకును బిజెపి లాక్కుని ఆంధ్రలో కాంగ్రెసులా నామమాత్రం చేయవచ్చు. జగనంటే పడని వర్గాలు చాలా ఉన్నాయి. బాబు గుఱ్ఱం ముసలిదై పోయింది, బిజెపి గుఱ్ఱం చురుగ్గా ఉందనుకుంటే వాళ్లంతా దాన్నే దువ్వుతారు, దాని మీదే పందాలు కాస్తారు.
ఇలాటి దీర్ఘకాలిక ప్రణాళికతో అమిత్ బాబుని కలిసి, ‘బహిరంగ పొత్తు యిప్పుడే వద్దు, తెలంగాణలో మా వాళ్లు అంత సుముఖంగా లేరు, మీ వాళ్లూ ఆంధ్రలో సుముఖంగా లేరు. మన పొత్తు వలన యిక్కడ కెసియార్, అక్కడ జగన్ బలపడితే అసలుకే మోసం. ప్రస్తుతానికి ఒక అవగాహనకు వచ్చి, పరస్పర విమర్శలు మానుకుని, లోపాయికారీగా పని చేద్దాం’ అని ప్రతిపాదించారేమో. ఇది కేవలం నా ఊహ మాత్రమే. ఇది తప్పనుకుంటే పొత్తుల గురించి ఏ ప్రకటన చేయకుండా స్తబ్ధంగా ఎందుకు ఉన్నారో అర్థం చేసుకోవడం కష్టం. రాబోయే రోజుల్లో జివిఎల్ వంటి ఆంధ్ర బిజెపి నాయకులు టిడిపి పట్ల పరుషమైన భాష ఉపయోగించకుండా ఉంటే యీ థియరీకి బలం వస్తుంది. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2023)