Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: అమిత్-బాబు భేటీ

ఎమ్బీయస్‍: అమిత్-బాబు భేటీ

జూన్ 3న దిల్లీలో చంద్రబాబు, అమిత్ షా భేటీ జరిగి వారమైంది. కానీ దాని గురించి రావలసినంత బజ్ రావటం లేదు. రెండు రాష్ట్రాల బిజెపి, టిడిపిలు దీని గురించి హంగామా చేయడం లేదు. నిజానికి యిది ఒక చారిత్రాత్మకమైన మలుపుగా అభివర్ణించాలి. బిజెపి కటాక్ష వీక్షణాలకై టిడిపి ఎన్నాళ్ల నుంచో వేచి ఉందని అందరూ అనుకుంటూండగా, ఐదేళ్ల తర్వాత అమిత్ స్వయంగా పిలిచి బాబుతో ముప్పావుగంట మాట్లాడారంటే చిన్న విషయం కాదు. ఇది టిడిపికి మొరేల్ బూస్టర్. ఓ ఫంక్షన్‌లో మోదీ బాబును పలకరిస్తేనే ఇంకేముంది ఎన్‌డిఏలోకి టిడిపి చేరడమే తరవాయి అని హంగామా చేసిన తెలుగు మీడియా యిప్పుడు దీన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం వింతగా లేదా? తెలంగాణలో బిజెపికి టిడిపి ఓటు బ్యాంకు అవసరం, ఆంధ్రలో టిడిపికి బిజెపి (అనగా కేంద్ర ప్రభుత్వం) మద్దతు అవసరం కాబట్టి వీరిద్దరూ తప్పకుండా కలుస్తారు అని యిన్నాళ్లగా తెలుగు మీడియా చెప్తూ వచ్చినది నిజమైన వేళ వాళ్లు ఎన్ని కథనాలు వెలువరించాలి? కానీ సైలెంటుగా ఉన్నారెందుకో!

ఎప్పట్నుంచో వినవస్తున్న వాదన ఒకటుంది. ‘ఆంధ్రలో టిడిపి, వైసిపిలలో ఎవరో ఒకరు 2024లో బలహీనపడితేనే 2029 నాటికి తమకు లాభం అని చూస్తున్న బిజెపి టిడిపిని దగ్గరకు రానివ్వదు. రెండు ప్రధాన పక్షాలలో టిడిపియే బలహీనంగా ఉంది కాబట్టి, దాన్ని లుప్తం చేయడమే సులభం. దానితో పొత్తు పెట్టుకుని అనవసరంగా ప్రాణం ఎందుకు పోస్తుంది? 2029 నాటికి చంద్రబాబు ఎలాగూ నీరసిస్తారు. 2024 ఎన్నికలను ‘డూ ఆర్ డై’ పోరాటంగా చూస్తున్న టిడిపి ఆ ఎన్నికలలో కుప్పకూలడానికి తనూ ఒక చెయ్యి వేస్తే 2024-29 మధ్య ఆ స్థానంలో తను ఎదిగి, 2029లో వైసిపిని గద్దె దింపవచ్చు అని బిజెపి ప్రణాళిక. వ్యక్తిగతంగా కూడా మోదీ బాబుపై ఆగ్రహంగా ఉన్నారు. గోధ్రా తర్వాతి సంఘటనలే కాదు, 2019 ఎన్నికలకు ముందు బాబు మోదీపై వ్యక్తిగతంగా విరుచుకు పడడం దానికి కారణం.

అందువలన టిడిపి ఎంత పాకులాడినా, పవన్ ద్వారా రాయబారాలు పంపినా బిజెపి కరగటం లేదు. పైగా టిడిపితో వెళ్లకు, ఓపిక పట్టు అని పవన్‌ను సముదాయిస్తున్నారు. పవన్‌ది స్వల్పకాలిక వ్యూహం. ఈ సారి ఎలాగైనా అసెంబ్లీకి తనూ, తనతో పాటు కనీసం అరడజను మంది జనసేన ఎమ్మెల్యేలు వెళ్లాలి. బిజెపితో పెట్టుకుంటే అది సాధ్యపడక పోవచ్చు. టిడిపితో పొత్తు పెట్టుకుని ఓ 20 సీట్లయినా తెచ్చుకుంటే వాటిలో సగం తెచ్చుకున్నా పరువు దక్కుతుంది. బిజెపినే పట్టుకుని వేళ్లాడితే, తమకేమీ చేయలేదన్న కోపంతో ఆంధ్రులు బిజెపిని ఆదరించకపోతే, అది తనపై ప్రసరిస్తే, వైసిపి పగబట్టి తనను ఓడిస్తే, తను హేళనకు గురవుతాడు. తన నాయకత్వంపై జనసైనికులకు విశ్వాసం నశిస్తుంది. ఈసారి తను తప్పక గెలవాలంటే టిడిపి అండతోనే అది సాధ్యం.

ఇది పవన్ వ్యూహం కాగా, దీర్ఘకాలిక ప్రణాళిక వేస్తున్న బిజెపి తొందర పడటం లేదు. వాళ్లిచ్చే రోడ్ మ్యాప్ పవన్‌కు నప్పటం లేదు. అలా అని తెంచుకుంటే ఏ ముప్పు వచ్చిపడుతుందో తెలియదు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసినా యీ జంజాటం తెమలక కాలయాపన జరుగుతోంది. ఈలోగా టిడిపి ఎంత మొత్తుకున్నా కేంద్ర బిజెపి వైసిపి ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు యిస్తోంది, అప్పులపై నిలదీయటం లేదు. పాత బాకీలు కూడా తీర్చి నిధులు సమకూరుస్తోంది. జగన్‌ కేసుల విచారణ నత్తనడక సాగేట్లు చూస్తోంది. ఈ వైఖరి టిడిపితో పొత్తు పట్ల బిజెపి నిరాసక్తతను సూచిస్తోంది.’ ఇదీ యిన్నాళ్లూ నడిచిన వాదన.  

కానీ యీ వాదనను తాజా భేటీ పూర్వపక్షం చేసింది. పవన్ రాయబారమో, సుజనా టీము రాయబారమో ఫలించి, అమిత్ బాబును పిలిపించి మాట్లాడి, రాజకీయాల్లో ఏదీ అనూహ్యం కాదని నిరూపించారు. ఆంధ్రలో పెద్దగా స్టేక్ లేదు కాబట్టి యిన్నాళ్లూ బిజెపి నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. కానీ తెలంగాణలో అర్జంటుగా ఏదో చేయకపోతే కుదరదనే పరిస్థితి వచ్చేసరికి బిజెపి వ్యూహంలో మార్పు వచ్చింది. కర్ణాటక ఫలితం తర్వాత దక్షిణాదిన తిరిగి కాలూనడానికి బిజెపికి తెలంగాణ కావాలి. ఈ సారికి అధికారం దక్కకపోయినా, కనీసం కాంగ్రెసు స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగానైనా  అవతరించాలి. కర్ణాటక గెలుపుతో సమరోత్సాహంతో ఉన్న కాంగ్రెసుకు తెలంగాణలో ద్వితీయ స్థానం దక్కినా ఆ జోష్ తక్కిన రాష్ట్రాలలోనూ ప్రదర్శించవచ్చు. దేశవ్యాప్తంగా చూస్తే బిజెపికి ప్రధాన శత్రువు కాంగ్రెస్సే. ప్రతి రాష్ట్రంలోనూ దాని ఉనికి ఎంతోకొంత ఉంటోంది. ఎంతమంది కాంగ్రెసు వాళ్లపై కాషాయ కండువాలు కప్పినా, యింకా కొంతమంది అక్కడే ఉన్నారు.

తెలంగాణ ఎన్నికలతో పాటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి. 2018 ఎన్నికలలో వీటిలో వేటిలోనూ బిజెపి గెలవలేదు. 2020లో మధ్యప్రదేశ్‌లో ఫిరాయింపులతో కాంగ్రెసు ప్రభుత్వాన్ని కూలదోసి బిజెపి అధికారంలోకి వచ్చింది. ఈసారి ఏమౌతుందో తెలియదు. ఒక వేళ తక్కిన మూడు రాష్ట్రాలలోనూ కాంగ్రెసు ఊపులో ఉంటే, అది తెలంగాణ కాంగ్రెసు నాయకులకు కూడా సోకుతుంది. తెలంగాణలో తెరాస (భారాస అని సందర్భం వచ్చినప్పుడే అంటాను, తెరాసకే మనం బాగా అలవాటు పడ్డాం) తర్వాత కాంగ్రెసే బలంగా ఉండేది.  కానీ ఫిరాయింపులతో కెసియార్ దాన్ని బలహీన పరిస్తే బిజెపి ఆ స్థానంలో చేరి ప్రధాన ప్రతిపక్షం అయిపోయింది. కానీ అది ఒక స్థాయికి మించి ముందుకు వెళ్లలేక పోతోంది. బండి సంజయ్ చేసే హడావుడి బిజెపి అభిమానులను కదిలిస్తోందేమో కానీ ప్రజాక్షేత్రంలో ఎప్పణ్నుంచో ఉన్న నాయకులను కదిలించటం లేదు. అందుకే చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఈటలకు పని పడటం లేదు.

బిజెపి తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో తప్ప ఎన్నడూ బలంగా లేదు. ఆ భావజాలానికి యిక్కడ డిమాండు లేదు. కెసియార్‌పై వ్యక్తిగత కోపంతో ఈటల, రేవంత్ పై కోపంతో రాజగోపాల రెడ్డి వచ్చి చేరారు తప్ప వాళ్లకు బిజెపి సిద్ధాంతాలతో ముఖపరిచయం కూడా లేదు. బండి సంజయ్ మార్క్ హిందూత్వతో వాళ్లు మమేకం కావటం లేదు. అమిత్ షా వచ్చి ఎంత హుషారు చేసినా తెలంగాణలో బిజెపి విస్తరించటం లేదు. ఇదిలా ఉండగా కర్ణాటక ఫలితం ఒకటి అందర్నీ ఆలోచనలో పడేసింది. హిందూత్వ ఉత్తరాదిని పని చేసినట్లు దక్షిణాదిన పని చేయదనే భావం బలపడింది. నిజానికి దక్షిణాది రాష్ట్రాలన్నిటిలో కర్ణాటకలోనే గత 20 ఏళ్లగా హిందూత్వకు ఆదరణ ఉంది. అయోధ్య ఉద్యమానికి అక్కడే ఎక్కువ స్పందన వచ్చింది. రాముడి కటౌట్లు బెంగుళూరు నగరంలో దర్శనమిచ్చేవి.

అలాటిది కర్ణాటకలోనే నాలుగేళ్ల పాలన తర్వాత బిజెపి అధికారం పోగొట్టుకుంటే తెలంగాణ మాటేమిటి? అనే ప్రశ్న రగిలింది. కర్ణాటకలో బిజెపి ప్రత్యర్థి నిత్య అంతఃకలహాలతో కొట్టుమిట్టులాడే కాంగ్రెసు. తెలంగాణలో ప్రత్యర్థి తెరాస! కలిసికట్టుగా ఉండే ఒక కుటుంబం ఆధ్వర్యంలో ఉన్న పార్టీ. అధికారంలో ఉంది. కేంద్రంలో ఉన్న బిజెపి రాష్ట్రానికి ఏమీ చేయటం లేదని ప్రజలను ఒప్పించగల వాగ్ధాటి ఉన్న కుటుంబసభ్యులతో, నాయకులతో కిక్కిరిసిన పార్టీ. పైగా రాష్ట్రప్రగతి అనేక బిజెపి పాలిత రాష్ట్రాల కంటె చాలా మెరుగ్గా ఉంది. ఇలాటప్పుడు బిజెపి తెరాసను ఓడించగలదా అనే సందేహం రావడంలో ఆశ్చర్యం లేదు. కర్ణాటకలో ముస్లిములు సామూహికంగా తమకు వ్యతిరేకంగా ఓటు చేయడం వలననే తాము ఓడిపోయామని బిజెపి చెప్పుకుంటోంది. అక్కడి జనాభాలో 13శాతం ముస్లిములుంటే యిక్కడా అంతే. ఆ ప్రమాదం యిక్కడా ఉందనుకోవాలి.

తొమ్మిదేళ్ల పాలన తర్వాత ప్రభుత్వవ్యతిరేకత సహజంగా ఉన్నా, దాన్ని సొమ్ము చేసుకోవడానికి బలమైన ప్రత్యామ్నాయం కాంగ్రెసు ఉంది. దానిపై ఉత్తరాది ముద్ర లేదు. స్థానిక నాయకులు దశాబ్దాలుగా ప్రజల్లో ఉన్నవారు. వాళ్లతో పోలిస్తే స్థానిక బిజెపి నాయకులకు అంత స్టేచర్ లేదు. మోదీ పేరు మీదనే కొట్టుకు రావాలి. కానీ ఆ సమయానికి మోదీ నాలుగు రాష్ట్రాల ఎన్నికలలో ప్రచారం చేయాలి. ఇక్కడి కంటె నార్త్‌లో చేస్తేనే కష్టానికి ఫలితం దక్కవచ్చు. బండి సంజయ్ మార్క్ హిందూత్వ కర్ణాటకలో దెబ్బ కొట్టింది కాబట్టి యిక్కడా కొడుతుందేమోనన్న ఊహతో అతన్ని రాష్ట్ర నాయకత్వం నుంచి తప్పిస్తారేమోనన్న అంచనాలూ ప్రారంభమయ్యాయి. మరి అతని స్థానంలో వేరెవరైనా వచ్చినా యింత విగరస్‌గా పని చేస్తారా అనేది సందేహమే. బిజెపిలో చేరదామా వద్దా అని ఆలోచిస్తూ యిన్నాళ్లూ తటస్థంగా ఉన్న నాయకులు యిప్పుడిలాటి ఆలోచనల్లో పడి వెనకడుగు వేసి కాంగ్రెసువైపుకి అడుగులు వేస్తున్నారు. నిన్ననే తాజాగా ఒక తెరాస నాయకుడు కూడా కాంగ్రెసులో చేరారు.

ఈ పరిస్థితుల్లో ఏదో ఒకటి అర్జంటుగా చేయాలని బిజెపి అధిష్టానం అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలోని టిడిపిలో మిగిలిన అడుగూబొడుగూను అండగా తెచ్చుకుంటే ఎలా ఉంటుందాన్న ఆలోచన వచ్చి ఉంటుంది. మిగిలినది అడుగూబొడుగూ కాదు, మాకింకా గట్టి ఓటు బ్యాంకే మిగిలి ఉంది అని బిజెపిని నమ్మించడానికి యీ మధ్యే చంద్రబాబు టిడిపికి కొత్త అధ్యక్షుడి నియామకాన్ని వేడుకగా చేసి ఖమ్మంలో బ్రహ్మాండమైన సభ పెట్టారు. ఇంకేముంది, టిడిపి తెలంగాణలో మళ్లీ పుంజుకుంటోంది అని తెలుగు మీడియాలో కథనాలు వెలువడేట్లు చేశారు. అప్పుడు నేను అనే వ్యాసం రాశాను.

నా వాదన సింపుల్‌గా చెప్పాలంటే, 2014లో టిడిపికి నగరంలో ఆంధ్రమూలాల వారి ఓట్లు వచ్చాయి కదాని, యిప్పుడూ అలాగే ఉన్నాయనుకోవడం పొరపాటు. ఆ తర్వాత బాబు వాళ్ల కర్మానికి వాళ్లను వదిలేసి వెళ్లిపోయారు. పార్టీ తెలంగాణ యూనిట్‌ను పట్టించుకోలేదు. ఒకప్పటి టిడిపి నాయకులు యీనాడు తెరాసలో సకల భోగాలు అనుభవిస్తున్నారు. వెనక్కి తిరిగి వచ్చి రిస్కు తీసుకుంటారా? ఇక కెసియార్ ఆంధ్రులకు ఏ యిబ్బందీ కలిగించటం లేదు. ఆంధ్రులు ఎప్పటిలాగానే ఉద్యోగాలు, కాంట్రాక్టులుల చేసుకుంటున్నారు ఇక పాత కథ ఎవరికి కావాలి? వైయస్సార్ సెంటిమెంటు, ఓటు బ్యాంకు యింకా ఉందనుకుని రంగంలోకి దిగిన శర్మిలకు వస్తున్న స్పందన చూస్తున్నాం కదా. బ్యాంకు వాళ్లని ఎవర్నడిగినా చెప్తారు, బ్రాంచే కాదు, కౌంటర్ మారినా, పాత కౌంటర్ కస్టమర్ పలకరించనైనా పలకరించడు. ఇక ఓటర్లంటారా? గతం గతః! ఇప్పుడు మనకెవరు పనికొస్తారో చూస్తారు.

2018 అసెంబ్లీ ఎన్నికలలో టిడిపితో కలిసి కాంగ్రెసు ఎలా మునిగిందో అందరికీ తెలుసు. తెరాస భారాస ఐనా, బాబు తెలంగాణలో యాక్టివ్ అయితే ఆంధ్ర పెత్తనం కార్డు బయటకు తీయడానికి కెసియార్ అనుయాయులు వెనకాడరు. మొహమాటానికి పోయి తెలంగాణ పోగొట్టుకుంటే భారాస ఉండదు. ఇప్పుడు బిజెపి అదే ప్రయోగం చేస్తానంటే స్థానిక బిజెపి నాయకులు వారించరా? ఉమ్మడి రాష్ట్రం ఉండగానే తెలంగాణ బిజెపి వాళ్లకు ఆంధ్ర బిజెపి నాయకులు, ముఖ్యంగా వెంకయ్య నాయుడంటే గుర్రుగా ఉండేది, బాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా! అలాటిది సాక్షాత్తూ బాబుని వాటేసుకోవాలంటే ఎంత యిరకాటం! వాళ్ల మనోభావాలు గమనించే కాబోలు పొత్తు మాటేమి లేదంటూ బండి సంజయ్ అర్జంటుగా ప్రకటన చేశారు. పొత్తుల విషయంలో బాబు విశ్వసనీయత అంతంత మాత్రం. 2019లో ఆంధ్రకు వచ్చేసరికి కాంగ్రెసుతో పొత్తును బాబు తెంపుకున్నారు. ఇప్పుడు బిజెపితో అలా చేయరనుకోండి. కానీ అతని కంటె ఘనుడు ఆచంట మల్లన అన్నట్లు బిజెపి ఆ పని చేయవచ్చు. తెలంగాణ ఎన్నికల తర్వాత బైబై అనవచ్చనే భయం టిడిపికి ఉండవచ్చు.

బిజెపి, టిడిపిల లక్ష్యాలలో వైరుధ్యం ఉంది. బిజెపికి తెలంగాణలో గెలుపు లేదా ద్వితీయస్థానం ప్రధానం. దానికోసం తెగించి పోరాడుతుంది. కానీ టిడిపికి తెలంగాణ ముఖ్యం కాదు. అక్కడ నెగ్గాలనే కిల్లర్ యిన్‌స్టింక్ట్ బాబుకి లేదు. ఎందుకంటే ఆయన ఫోకసంతా ఆంధ్రా! మరీ ముఖ్యమంగా అమరావతి! రాజకీయాల్లోంచి విరమించుకునే ముందు అమరావతిని ఏదోలా ముందుకు తీసుకుని వెళ్లి (పూర్తి చేసి అనలేం) తనపై నమ్మకంతో అక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్లను ఊరడించడమే ఆయన ధ్యేయం. మానిఫెస్టోలో రాయకపోయినా, ఆయన చేసే ప్రయత్నం అదే, తక్కిన పథకాల నుంచి నిధులు మళ్లించైనా అక్కడ ఏదో ఒకటి కట్టడం మొదలెట్టాలి. కానీ బిజెపికి అక్కడ అర్జన్సీ లేదు. లక్ష్యాలలో వైరుధ్యం వలన పొత్తు కుదరటం సులభం. అవతలివాళ్లు ఎన్ని సీట్లు కావాలన్నా యిచ్చేయవచ్చు. కానీ రెండు చోట్లా గెలిచే తీరాలనే పట్టుదల యిద్దరికీ లేకపోవడం ఒక మైనస్ పాయింటవుతుంది.

ఇవన్నీ తెలిసి కూడా బిజెపి అధిష్టానం బాబును పిలిచి ఎందుకు మాట్లాడినట్లు? హైదరాబాదు కార్పోరేషన్ ఎన్నికలలో బిజెపికి తెలంగాణ జిల్లాల వారి ఓట్లు వచ్చాయి తప్ప ఆంధ్రమూలాల వారి ఓట్లు రాలేదు. ఆ లోటు పూడ్చుకోవడానికి వాళ్లు యిప్పుడు టిడిపిని ఆశ్రయిస్తున్నారని అంటున్నారు. కానీ ఆంధ్ర మూలాల వారు, టిడిపి ఓటర్లు సమానార్థకాలు కాదని కూకట్‌పల్లిలో సుహాసిని ఓటమి నిరూపించింది. వారికి ప్రస్తుతం కెసియార్‌తో చిక్కులు లేవు. ఒకవేళ వచ్చినా టిటిడిపి నాయకులు, టిబిజెపి నాయకులు వారి పక్షాన మాట్లాడతారా? ఉద్యమసమయంలో మాట్లాడారా? అందరూ మూకుమ్మడిగా ఆంధ్రులను దోపిడీదారులని అన్నవాళ్లే కదా! ఆంధ్రమూలాల వారి ఓట్ల కోసమే బిజెపి టిడిపితో పొత్తు గురించి ఆలోచిస్తోందని అనే వాదన నాకు బలహీనంగా తోస్తోంది. నా మెదడులో యింకో ఆలోచన వచ్చింది. అది చివర్లో, రెండో వ్యాసంలో చెప్తాను.

తెలంగాణ ఎన్నికల తర్వాత బిజెపి బాబును వదుల్చుకుందామన్నా, ఆయన వదలరు. ఇప్పుడే క్విడ్ ప్రో కో గురించి మాట్లాడారని అంటున్నారు. ఆంధ్రలో పొత్తు ఉంటేనే తెలంగాణలో పొత్తు ఉంటుందని స్పష్టంగా చెప్పారట. బిజెపికి ఆంధ్రలో ఓట్లు లేకపోయినా, సఖ్యత లేకపోతే ఎన్నికల టైములో కేంద్ర ప్రభుత్వం చికాకు పెట్టగలదు. 2019లో టిడిపి నిధుల సరఫరా జరగకుండా చేసిందని, ఇన్‌కమ్ టాక్స్ సోదాలు చేసిందని ప్రతీతి. అది జరగడంతోనే బాబు బెదిరి, బిజెపిని పన్నెత్తి మాట అనడం మానేశారని అందరికీ తెలుసు. రాష్ట్ర బిజెపి నాయకులు ఎన్ని మాటలన్నా, టిడిపి వాళ్లు బదులు చెప్పరు. కేంద్రం చేయనివాటికి కూడా జగన్నే తప్పు పడతారు. 2014లో మోదీ ఫీవర్ ఊపేసినప్పుడు టిడిపి లాభపడింది. 2019 నాటికి ఆ ఫీవర్ తగ్గకపోగా పెరిగింది. 2024కి యింకా పెరగకపోయినా, అలాగే ఉన్నా, కాస్త తక్కువగా 2014 స్థాయిలోనే ఉన్నా తనకు లాభమే కదా అని బాబు ఆలోచన.

2019 పార్లమెంటు ఎన్నికలు, ఆంధ్రలో అసెంబ్లీ ఎన్నికలు కలిసే జరిగినా బిజెపి మ్యాజిక్ ఆంధ్రలో పని చేయలేదు. ఎందుకంటే జగన్ ఫీవర్ జోరు అలా ఉంది. ఐదేళ్ల పాలన తర్వాత ప్రభుత్వ వ్యతిరేకత వలన కొంత, 22 మంది ఎంపీల నిచ్చినా జగన్ ప్రత్యేక హోదా తేలేక పోయాడన్న నిరాశ చేత కొంతా, ఆంధ్ర ఓటరు అసెంబ్లీకై ఎవరికి వేసినా, పార్లమెంటుకి మాత్రం మోదీకి వేసే అవకాశం లేకపోలేదు. పొత్తు పెట్టుకుంటే అది తనకు కొంతైనా లాభిస్తుందని బాబు ఆశ. 2014లో యీ పొత్తు బాగా పని చేసింది. కానీ దాని తర్వాత ఆంధ్రుల ఆశలను బిజెపి వమ్ము చేయడంతో వ్యవహారం బెడిసింది. మరి యీసారి లాభిస్తుందా? బిజెపి-టిడిపి పొత్తా? అవగాహనా? వ్యాసంలో చర్చిద్దాం. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (జూన్ 2023) 

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా