ఆంధ్ర సిఎమ్ వైఎస్ జగన్ ఎక్కడ మాట ఏమో కానీ అసెంబ్లీలో మాట్లాడినపుడు మాత్రం భలే ఇంట్రస్టింగ్ గా వుంటుంది.
వేసే సెటైర్లు, పంచ్ లు మామూలుగా వుండవు. చాలా ఆసక్తిగా నవ్వులు పూయించేలా వుంటాయి మాటలు. పైగా అవతలి వాళ్లు కూడా బాధపడకుండా ఎంజాయ్ చేసేలా వుంటుంది ప్రసంగం. అంతే తప్ప ఘాటైన వ్యాఖ్యలు చేయరు.
ఈ రోజు అసెంబ్లీలో జగన్ ఈ ఫీట్ మరోసారి చూపించారు. పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గించేస్తారు అంటూ ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రస్తావిస్తూ జగన్ భలే మాటల తూటాలు విసిరారు.
మోడీ బెడ్ రూమ్ లో దూరి అడిగారో..షెకావత్ బెడ్ రూమ్ లో దూరి అడిగారో…నా దగ్గరకు అయితే ఎలాగూ రారు కదా అంటూ ముక్తాయించినపుడు అసెంబ్లీలో నవ్వుల పువ్వులు విరిసాయి.
పోలవరం డ్యామ్ ఎత్తు తగ్గిస్తున్నారని ఎవరు చెప్పారో..వీళ్లంతట వీళ్లే అనేసుకున్నారా? వాళ్లంతట వాళ్లే మన మీద బురద జల్లడం…'రామోజీ రావ్..రామోజీరావ్ నేను పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నా అని మోడీ చెప్పినట్లు…లేదా రాధా కృష్ణా..రాధా కృష్ణా పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నా అని షెకావత్ చెప్పానట్లుగా అని జగన్ తన స్టయిల్ లో అనే సరికి సభ్యుల నవ్వులే నవ్వులు.
మొత్తం మీద ఇదే సమయంలో పోలవరం ఎత్తు వన్ ఇంచ్ కూడా తగ్గదని అసెంబ్లీ వేదికపై జగన్ స్పష్టం చేసారు.