స్మార్ట్ సిటీల చైర్మన్లు ఒక్కొక్కరుగా రాజీనామా బాట పట్టారు. ఏపీ సర్కార్ ఆదేశాల మేరకు పదవుల నుంచి వైదొలగక తప్పలేదు. స్మార్ట్ సిటీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా చైర్మన్లు, డైరెక్టర్లను నియమించడం సాంకేతికంగా చెల్లదని, న్యాయపరంగా నిలబడదని తెలియడంతో ప్రభుత్వం తప్పును సరిదిద్దుకునే పనిలో పడింది.
దేశ వ్యాప్తంగా కొన్ని ముఖ్య నగరాలు, పట్టణాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి స్మార్ట్ సిటీల పేరుతో అభివృద్ధి చేసేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. వీటికి నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూర్చుతోంది. స్మార్ట్ సిటీలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో కేంద్ర ప్రభుత్వమే ప్రణాళికలు రచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర స్థాయిలో చైర్మన్‌గా వ్యవహరిస్తారు. అలాగే మున్సిపల్, కార్పొరేషన్లలో కమిషనర్లు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారు. ఓవరాల్ గా స్మార్ట్ సిటీలపై పురపాలికశాఖ అధికారుల పర్యవేక్షణ ఉంటుంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏపీలో తిరుపతి, విశాఖపట్నం, అమరావతి, కాకినాడలను స్మార్ట్ సిటీలుగా ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం మరో 33 స్మార్ట్ సిటీలను ప్రకటించింది. వీటికి అనధికారిక పోస్టులను నియమించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు తెలిసో లేక తెలియక చేశారో …కానీ వాటన్నింటికి చైర్మన్లను నియమించారు. ఇందులో కూడా సామాజిక న్యాయాన్ని పాటించినట్టు వైసీపీ ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది.
ఈ చైర్మన్ల నియామకంలో ట్విస్ట్ ఏంటంటే… వీరికి కనీస గౌరవ వేతనమూ లేదు. అంతేకాదు, ఏదైనా నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా లేదు. ఈ నేపథ్యంలో సాంకేతికంగా వీరి నియామకమే చెల్లిదని ఆలస్యంగా గుర్తించిన ప్రభుత్వం… చైర్మన్ పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో మొట్టమొదటగా ఏలూరు స్మార్ట్‌సిటీ చైర్పర్సన్ బొద్దాని అఖిలప్రియ సోమవారం రాజీనామా చేశారు.
తాజాగా విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీ చైర్పర్సన్లు కూడా రాజీనామా చేసినట్టు సమాచారం. స్మార్ట్ సిటీ పదవులు మూణ్నాళ్ల ముచ్చటైందని సదరు తాజా మాజీలు, వారి అనుచరులు వాపోతున్నారని సమాచారం.