వివాదంలో జీయర్ దే పైచేయి..? కేసీఆర్ తగ్గారా..?

చినజీయర్ తో వివాదం ఉందా అనే ప్రశ్నకు అదంతా హంబక్.. అలాంటి గ్యాపేమీ లేదని సింపుల్ గా తేల్చేశారు కేసీఆర్. అదే ప్రశ్న చినజీయర్ కి వేస్తే మాత్రం మరోలా సమాధానం వచ్చింది. తాను…

చినజీయర్ తో వివాదం ఉందా అనే ప్రశ్నకు అదంతా హంబక్.. అలాంటి గ్యాపేమీ లేదని సింపుల్ గా తేల్చేశారు కేసీఆర్. అదే ప్రశ్న చినజీయర్ కి వేస్తే మాత్రం మరోలా సమాధానం వచ్చింది. తాను ఎవర్నీ రాసుకు పూసుకు తిరగనని, తనకు ఆహ్వానం లేకపోతే వెళ్లనని, తనని ఆహ్వానిస్తే ఆ పని పూర్తి చేస్తానని.. యాదాద్రి సంప్రోక్షణ కార్యక్రమంపై మాట్లాడారు. 

ఒక రకంగా అక్కడ చినజీయర్ తన వ్యక్తిత్వాన్ని, ప్రత్యేక అస్తిత్వాన్ని ప్రముఖంగా చెప్పుకున్నారు. ఇక్కడ కేసీఆర్ మాత్రం అదేంలేదంటూ తేల్చిపారేశారు. మొత్తమ్మీద ఇద్దరూ రెండు రకాలుగా స్పందించారు కాబట్టి.. ఏదో ఉంది. అందులోనూ జీయర్ దే పైచేయి అనుకోవాల్సిందేనేమో.

గ్యాప్ ఎక్కడ, ఎందుకు..?

నిప్పులేనిదే పొగరాదు.. అందులోనూ సమతా మూర్తి విగ్రహావిష్కరణ విషయంలో చాలాసార్లు ఆ నిప్పు రాజుకుంది. పొగేంటి ఏకంగా మంటలు మొదలయ్యాయి. ప్రారంభోత్సవానికి వెళ్లిన కేసీఆర్ ముగింపు ఉత్సవానికి మొహం చాటేశారు. 

పోనీ మధ్యలో పీఎం వచ్చినప్పుడు ఆరోగ్యం బాలేదన్నారు, రాష్ట్రపతి వచ్చినప్పుడు ఆయన్ని కలిశారు కానీ, కలిసి సమతా మూర్తి దగ్గరకు వెళ్లలేదు. ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి, చివర్లో కార్యక్రమాన్ని కేసీఆర్ కోసం వాయిదా వేసి మరోసారి ఆహ్వానం పంపినా ఆయన మనసు కరగలేదు. దీంతో ఆ అనుమానాలు అందరిలో బలపడ్డాయి. 

మోదీని చినజీయర్ పొగడ్తల్లో ముంచెత్తడం, శిలా ఫలకంపై కేసీఆర్ పేరు లేకపోవడం ఈ రెండే ప్రధాన కారణాలు, అంతకు మించి ఇంకేమీ లేవు.

జీయర్ సర్దుకుపోయే టైప్ కాదు..

సమ్మక్క, సారక్కలపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో.. సహజంగా ఎవరైనా క్షమాపణలు చెప్పి సైడైపోతారు. కానీ చినజీయర్ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నారు. సమాజానికి మంచి చెప్పాలనుకునేవారు, అలా కాకుండా ఇంకెలా చెబుతారు, నేను కాకపోతే ఇంకెవరు మీకు చెబుతారంటూ కాస్త గట్టిగానే మాట్లాడారు. పాత వీడియోల్ని తెరపైకి తెచ్చి ఓ బ్యాచ్ కావాలనే ఇదంతా చేస్తుందని కూడా మాట్లాడారు.

అదే టైమ్ లో కేసీఆర్ వివాదాలు, రాజకీయాలపై నిక్కచ్చిగా మాట్లాడారు. తనని ఎవరైనా పిలిస్తే వెళ్లాను కానీ, రాసుకుపూసుకు తిరగాల్సిన అవసరం తనది కాదన్నారు. యాదాద్రి సంప్రోక్షణ కార్యక్రమానికి ఆహ్వానం లేకపోవడాన్ని కూడా ఆయన తేలిగ్గా తీసిపారేశారు.

అదే ప్రశ్నకు కేసీఆర్ మాత్రం అంత సీరియస్ గా జవాబు చెప్పలేదు. గ్యాప్ లేదన్నారు, అదంతా మీడియా హంబక్ అంటూ కొట్టిపారేశారు. ఇప్పుడు కాకపోయినా.. తర్వాతయినా జీయర్ తో సర్దుకుపోక తప్పదు అనే అర్థం వచ్చేలా మాట్లాడారు కేసీఆర్. లేకపోతే తనదైన శైలిలో.. ఎవరాయన అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరేవారు.

మొత్తమ్మీద చినజీయర్, కేసీఆర్ మధ్య వివాదం ఉంది అనే విషయాన్ని జీయర్ మాటలు స్పష్టం చేస్తే.. అది ఎక్కువ రోజులు ఉండదు అనే విషయాన్ని కేసీఆర్ సమాధానం ధృవీకరించింది.