బోయనపల్లి కిడ్నాప్ వ్యవహారంలో మరికొందరి ప్రమేయాన్ని పోలీసులు గుర్తించారు. కేసు లోతుల్లోకి వెళ్లేకొద్ది సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒక సినిమా ప్రేరణతో కిడ్నాప్‌నకు పాల్పడినట్టు నిన్న వెలుగు చూసింది.
కాగా ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొందరిని కూడా నిందితులుగా చేర్చారు. ఇందులో భాగంగా మాజీ మంత్రి అఖిలప్రియ తమ్ముడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డితో పాటు అత్తమామలు, మరిది పేర్లను కూడా కేసులో నిందితులుగా చేర్చారు.
కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి అఖిలప్రియ ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. పరారీలో ఉన్న ఆమె భర్త భార్గవ్‌రామ్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. కిడ్నాపర్లు పారిపోయేందుకు భార్గవ్ కుటుంబ సభ్యులు సహకరించినట్టు పోలీసుల విచారణలో తేలింది.
అలాగే కిడ్నాప్ సమయంలో తన బావ భార్గవ్‌రామ్‌తో పాటు జగత్‌విఖ్యాత్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. జగత్ ప్రమేయంపై పోలీసుల అనుమానమే నిజమైంది.
జగత్ కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆయన ప్రమేయం ఉన్నట్టు నిర్ధారించుకుని కేసు పెట్టారు. అలాగే సీసీ పుటేజీ, కాల్ డేటా ఆధారంగా కిడ్నాప్ వ్యవహారంలో జగత్ కీలకంగా వ్యవహరించారనేందుకు ఆధారాలను సేకరించారు.