సమీక్ష: రెడ్
రేటింగ్: 2.5/5
బ్యానర్: శ్రీ స్రవంతి మూవీస్
తారాగణం: రామ్ పోతినేని, నివేదా పేతురాజ్, మాళ్వికా శర్మ, అమృత ఐయ్యర్, సంపత్ రాజ్, సత్య, వెన్నెల కిషోర్, పోసాని, సోనియా అగర్వాల్, పవిత్ర లోకేష్ తదితరులు
సంగీతం: మణిశర్మ
కూర్పు: జునైద్ సిద్ధికీ
ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి
నిర్మాత: ‘స్రవంతి’ రవి కిషోర్
కథనం, మాటలు, దర్శకత్వం: కిషోర్ తిరుమల
విడుదల తేదీ: జనవరి 14, 2021
పరభాషలో సక్సెస్ అయిన సినిమాను రీమేక్ చేయాలనుకున్నపుడు కేవలం కథ, కథనాలు మాత్రమే కాకుండా ఆ భాషలో ఎవరు నటించారు, వాళ్లకున్న ఇమేజ్ ఏంటి అనేది కూడా పరిగణనలోకి తీసుకుని అందుకు అనుగుణంగా కాస్టింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఎలాంటి ఇమేజ్ లేని ఒక చిన్న హీరోపై బాగుందనిపించిన కథ పేరున్న హీరో చేసేసరికి చిన్నదైపోతుంది. ‘రెడ్’ విషయంలో అదే జరిగింది.
తమిళంలో అరుణ్ విజయ్ నటించిన ‘తడమ్’ మంచి థ్రిల్లర్‍గా అక్కడి ప్రేక్షకులను, విమర్శకులను కూడా మెప్పించింది. కానీ అదే సినిమాలో ‘ఉస్తాద్’ రామ్ పోతినేని హీరో అయ్యేసరికి, అందులోను ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత అతను చేస్తోన్న సినిమా అనేసరికి దర్శకుడు కిషోర్ తిరుమలపై కేవలం అక్కడి సన్నివేశాలను తెలుగీకరించడం మాత్రమే కాకుండా హీరోకు అనుగుణమైన మార్పు చేర్పులు చేసే బాధ్యత కూడా పడింది.
థ్రిల్లర్ జోనర్‍లో ఏది ఎంత వుండాలో అంతే వుండి పూర్తిగా కథపైనే ఫోకస్ వుంటుంది. ఆ జోనర్‍కి మసాలా ఎలిమెంట్స్ అవసరం వుండదు. కిషోర్ తిరుమల ఆ సంగతి గుర్తు పెట్టుకున్నాడు కానీ రామ్ కోసమని ఫస్ట్ యాక్ట్ని సాగదీసాడు. పాటలకు, రొమాన్స్ కు, కామెడీకి కూడా అక్కడే స్కోప్ ఇవ్వగలడు కనుక అసలు కథను మొదలు పెట్టడం ఆలస్యం చేసి వాటిని చొప్పించాడు. అయితే ఒక కమర్షియల్ సినిమా కోసం అవన్నీ చేసినంత ఫ్రీడమ్‍తో చేయడానికి వుండదు కాబట్టి ఆ స్పేస్‍లో కావాల్సినంత మసాలా దట్టించడం వీలు పడలేదు.
అలాగే ఈ కథానుసారం ఒకసారి కథలోకి వెళ్లిన తర్వాత హీరో యాక్టివ్ రోల్ ప్లే చేసేదేమీ వుండదు. మర్డర్ సస్పెక్ట్గా అరెస్ట్ అయిన ఇద్దరు హీరోలలో ఎవరు అది చేసారనేది పోలీసులు కనిపెట్టాలి. వాళ్లు ఆ పనిలో వుంటే హీరో సెల్‍లో కూర్చుంటాడు. అక్కడే వుండి బుద్ధి బలంతో బురిడీ కొట్టించడం తప్ప బయటకు రావడానికి వుండదు. ఇక్కడే రామ్‍కి ఈ కథ సెట్ కాలేదు.
ఎనర్జిటిక్ స్టార్‍గా పేరు పడ్డ రామ్ ద్వితియార్ధంలో కనిపించినంత సేపు కూర్చుని ‘కథలు’ చెబుతూనే వుంటాడు. లేదా అసలు చాలా సేపు తెరపై కనిపించను కూడా కనిపించడు. ఇక ఆ ఇన్వెస్టిగేషన్ కార్యక్రమాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల గ్రిప్పింగ్‍గా తీయలేకపోవడంతో థ్రిల్లర్ సినిమా కాస్తా నీరసమయమవుతుంది.
హీరో తల్లిగా సోనియా అగర్వాల్ సీన్స్ సుదీర్ఘంగా సాగడంతో ఎమోషన్ పండకపోగా విసుగు రెట్టింపవుతుంది. అసలు కథలో వున్న లొసుగులను అలాగే వదిలేసి, అదే విధంగా చివర్లో కూలంకషంగా చెప్పాల్సిన విషయాలను అలా పైపైన చెప్పేసి ముగించడంతో ‘రెడ్’లో క్లిక్ అవ్వాల్సిన క్లయిమాక్స్ కూడా తుస్ అనేసింది.
ఇస్మార్ట్ శంకర్ కాన్ఫిడెన్స్తో రామ్ మరోసారి మాస్ షేడ్‍ని చాలా బాగా చూపించాడు. నటుడిగా రెండు పాత్రలకు న్యాయం చేసాడు కానీ ముందే చెప్పినట్టు ఇది తన ఇమేజ్‍కి, ఎనర్జీకి తగ్గ కథ కాదు. హీరోయిన్లలో అమృత ఐయ్యర్ నటన ఫర్వాలేదనిపిస్తుంది. అందరికంటే ఎక్కువ స్క్రీన్ టైమ్ దక్కినా కానీ తన పాత్రను నివేద పండించలేకపోయింది.
సత్య ఇంగ్లీష్‍ను ఖూనీ చేస్తూ చేసే కామెడీ అక్కడక్కడా బాగానే పేలింది. పవిత్ర లోకేష్ రొటీన్‍కి భిన్నమైన పాత్రలో కనిపించినా గుర్తుంచుకునే లెవల్‍కి ఆ పాత్రకు ప్రాధాన్యత లేకపోయింది. మణిశర్మ సంగీతం సోసోగా వుంది. కిషోర్ తిరుమల సంభాషణలు మాత్రం బాగున్నాయి. సమీర్‍రెడ్డి ఛాయాగ్రహణం సినిమా మూడ్‍కి తగ్గట్టే వుంది.
ప్రేమకథలపై పట్టు చూపిస్తోన్న కిషోర్ తిరుమల తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన ప్రయత్నంలో కంఫర్ట్ మిస్ అయ్యాడనే సంగతి తెలుస్తూనే వుంటుంది. ఒరిజినల్ కథ అయితే తనకు నచ్చినట్టు డీల్ చేసుకోవచ్చు కానీ రీమేక్ కావడం వల్ల ఆ లిమిటేషన్స్ కూడా అతడి చేతులు కట్టేసినట్టున్నాయి. చేసిన మార్పులు ఫిట్ అవకపోవడం అటుంచితే, థ్రిల్లర్ పార్ట్ని కూడా పట్టుతో హ్యాండిల్ చేయలేకపోవడం మాత్రం మైనస్ అనే చెప్పాలి.
ఎక్సయిటింగ్ స్టోరీ వున్నా కానీ అసలు కథను డైల్యూట్ చేసిన అంశాల కారణంగా ‘రెడ్’ ఫేడ్ అయిపోయింది. రామ్ ఎంతగా కృషి చేసి ఈ చిత్రానికి తన ఎనర్జీ జోడించాలని చూసినా కానీ అతని ఎఫర్ట్ వేస్ట్ అయింది. కిషోర్ తిరుమల తన సంభాషణలతో ఈ థ్రిల్లర్‍కి రీచ్ పెంచాలని చూసినా కానీ డైలాగ్స్ మినహా మిగిలిన మార్పుచేర్పులు కథాబలాన్ని తగ్గించేసాయి.
ఒరిజినల్ చూడని వారిని సయితం నిరాశ పరిచేలా సెకండ్ హాఫ్‍ని నడిపించడం, ట్విస్ట్ కూడా ఎఫెక్టివ్‍గా ప్రెజెంట్ చేయలేకపోవడంతో కదలకుండా కూర్చోబెట్టాల్సిన చోట కూడా రెడ్ బోర్ కొట్టిస్తుంది. ఇక ఒరిజినల్ చూసేసిన ఆడియన్స్ అయితే సస్పెన్స్ కూడా లేక మరింత నిరాశ పడాల్సి వస్తుంది. గత సమ్మర్‍లో రావాల్సిన రెడ్ ఈ సంక్రాంతికి వచ్చింది కానీ కనీసం పండుగ మూడ్‍కి తగ్గ సినిమా కూడా కాదిది. కాబట్టి ‘ఉస్తాద్’ రామ్ ఆకర్షణ శక్తిపైనే డిపెండ్ అయి గట్టెక్కాలి.
బాటమ్ లైన్: రెడ్ సిగ్నల్!