లాక్ డౌన్ ఎఫెక్ట్ తో పాటు, అంతకంటే ముందు రానా అనారోగ్యం బారిన పడ్డంతో.. అతడి సినిమాల షెడ్యూల్స్ అన్నీ చెల్లాచెదురయ్యాయి. ఈ క్రమంలో రానా నటించిన 2 సినిమాలు జస్ట్ 2 నెలల గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి.
అరణ్య అనే సినిమా చేశాడు రానా. సంక్రాంతికి విడుదల చేద్దామనుకున్న ఈ సినిమాను మరోసారి వాయిదావేసి, మార్చి 26కు వాయిదా వేశారు. అయితే అప్పటికి రానా నటించిన మరో సినిమా విరాటపర్వం రెడీ అయిపోతోంది.
అరణ్య కోసం విరాటపర్వం సినిమాను మరికొంత కాలం ల్యాబ్ లోనే ఉంచే పరిస్థితి లేదు. ఎందుకంటే, ఈ సినిమా కూడా చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. పైగా సింగిల్ నిర్మాత చేస్తున్న ప్రాజెక్టు కూడా కాదు. కాబట్టి ఈ సినిమాను కూడా సమ్మర్ లోనే విడుదల చేస్తామంటూ తాజాగా ప్రకటించారు.
దర్శకుడు వేణు ఊడుగుల చెబుతున్న సమాచారం మేరకు.. విరాటపర్వం సినిమాను మే నెలాఖరుకు ప్లాన్ చేస్తున్నారు. అలా చూసుకుంటే.. అరణ్య-విరాటపర్వం సినిమాల మధ్య గ్యాప్ అటుఇటుగా 60 రోజులు మాత్రమే ఉండబోతోంది.
ఇది కేవలం రానాకు మాత్రమే ఎదురవుతున్న సమస్య కాదు. శ్రీవిష్ణు, సుమంత్, సత్యదేవ్ లాంటి హీరోల సినిమాలు కూడా రాబోయే రోజుల్లో ఇలానే మినిమం గ్యాప్స్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి.