ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు ఉద్దేశించిన వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి సొరంగం పనులు రికార్డు స్థాయి వేగంతో పూర్తయ్యాయి. ఇది తమకు ప్రాధాన్యతతో కూడిన ప్రాజెక్టు అని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తొలి దశ పనులను పూర్తి చేయిస్తున్నారు.
వచ్చే సీజన్ లో కృష్ణా జలాలను తరలిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఈ పనులను పూర్తి చేయించడంపై ప్రభుత్వం శ్రద్ధ వహించింది. అందుకు తగ్గట్టుగా వెలిగొండ ప్రాజెక్టు సొరంగం-1 పనులు శరవేగంగా పూర్తయ్యాయి. నిన్నటితో ఈ పనులు పూర్తయ్యాయి.
మొత్తం 3.6 కిలోమీటర్ల పొడవుంటే ఈ సొరంగం పనులను రోజుకు సగటున 9.23 మీటర్ల చొప్పున పూర్తి చేశారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే..టీడీపీ హయాంలో ఈ పనులు సాగినప్పుడు సగటును రోజుకు ఒక్క అడుగు పొడవున పనులు సాగాయి.
టీడీపీ హయాంలో ఈ సొరంగం పనులను 2016కే పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. అలాగే అంచనా వ్యయాన్ని కూడా పెంచుకుంటూ పోయారు. 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు తవ్విన దూరం 600 మీటర్లు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
2019 నవంబర్ నుంచి పనులు పునఃప్రారంభం అయ్యాయి. జనవరి 13, 2021 వరకూ మొదటి సొరంగంలో 3.6 కి.మీ. తవ్వి పనులను పూర్తి చేశారు. లాక్ డౌన్, భారీ వర్షాల వల్ల కలిగిన ఆటంకాలను దాటుకుని ఈ వ్యవధిలో పని పూర్తి కావడం గమనార్హం.
టీడీపీ హయాంలో టన్నెల్ నిర్మాణానికి పని చేసిన బోర్ల రిపేర్లకు అంటూ 66 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు దోచి పెట్టారు. అయితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా రివర్స్ టెండరింగ్ ప్రక్రియలో వ్యయాన్ని 61 కోట్ల రూపాయల వరకూ తగ్గించారు. వ్యయం తగ్గడంతో పాటు, వేగంగా కూడా పనులు పూర్తి చేసి జగన్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంటూ ఉంది.
ఇక ఈ ప్రాజెక్టులో రెండో సొరంగంప నులు కూడా వేగంతంగా సాగుతున్నాయి. పునరావాస సంబంధించిన నిధులను కూడా విడుదల చేశారు. వచ్చే సీజన్ కు తొలి దశ పనులన్నింటినీ పూర్తి చేసి, నిర్వాసితులకు పునరావాస కల్పన కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం పని చేస్తోంది.