రాష్ట్రమంతా విషాదంలో ఉంది. రైతన్నలతో సహా అంతా సంక్రాంతి కాంతులను ఏనాడో మరచిపోయారు. ఎక్కడ చూసినా దైన్యం దారిద్ర్యం తాండవిస్తోంది అంటూ తెలుగు తమ్ముళ్ళు వరసపెట్టి మరీ భారీ డైలాగులనే కొడుతున్నారు.
ముచ్చటగా మూడు పండుగలతో తెలుగు లోగిళ్ళు సందడి చేస్తున్న వేళ కూడా భోగీ మంటలలో కూడా రాజకీయ మంట పెట్టే నైపుణ్యం కచ్చితంగా పసుపు తమ్ముళ్ళదే.
ఏపీలో ఎవరూ ఆనందంగా లేరని జనాలందరి తరఫున శోకాలు తీస్తున్నారు. చంద్రబాబు నుంచి అచ్చెన్న మొదలు పెడితే తమ్ముళ్లంతా కూడా పెద్ద పండుగను సైతం పక్కన పెట్టి పాడు రాజకీయాలకు తెర తీశారని వైసీపీ నేతలు గుస్సా అవుతున్నారు.
ఏపీలో ప్రజలు సుఖ శాంతులతో ఉన్నారంటే దానికి జగన్ తీసుకుంటున్న అద్భుతమైన ప్రజా నిర్ణయాలే కారణమని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారామ్ అంటున్నారు. ఏ వర్గం ఇబ్బంది పడకుండా చూసుకుంటూ అందరికీ మేలు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది అని ఆయన అంటున్నారు.
ఓ వైపు ఏపీ కష్టాలలో ఉందని టీడీపీ నేతలు గోడు పెడుతూంటే వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం పచ్చ కళ్ళకు అంతే కనిపిస్తుందని సెటైర్లు వేస్తున్నారు.
ఏది ఏమైనా గతం కంటే కూడా ఏపీలో ఇపుడే రైతులతో సహా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది అన్నది తటస్థ వర్గం మాట. దీన్ని గమనంలోకి తీసుకుంటే ఎవరికీ బొల్లి ఏడుపులు ఉండవుగా.