రామతీర్థం ఘటనతో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిద్దామనుకున్న ప్రతిపక్షాలు.. పోలీసు విచారణ తర్వాత సైలెంట్ అయ్యాయి. చంద్రబాబు పూర్తిగా రామతీర్థం మాట మరచిపోయినట్టే ప్రవర్తిస్తున్నారు. రామనామం మానేసి ఆయన మళ్లీ రైతు రాగం ఎత్తుకున్నారు. క్రిస్టియన్ సీఎం అని టార్గెట్ చేయబోయిన బీజేపీ కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉండటంతో కిక్కురుమనకుండా ఉంది.
పవన్ కల్యాణ్ మాత్రం ఎందుకో ఇంకా రామతీర్థం ఘటనపై రాజకీయాలు చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందులో భాగంగానే పార్టీ తరపున పోరాడేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేశారు పవన్. పార్టీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో మరో ముగ్గురు సభ్యులతో కలసి ఏర్పాటైన ఈ కమిటీ.. బీజేపీతో సమన్వయం చేసుకుంటూ పనిచేస్తుందట.
రోజులు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి లేదని అంటున్న జనసేనాని.. రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఆమధ్య దివీస్ పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించి వచ్చిన పవన్ కు.. రామతీర్థం ఘటనపైనే ఎందుకో ఇంకా ఆశ మిగిలి ఉంది. అందుకే ఇప్పుడు అయిపోయిన పెళ్లికి బాజాలు మోగించేందుకు సిద్ధమయ్యారు.
రామతీర్థం ఆలయంలో ప్రతిష్టించేందుకు కొత్త విగ్రహాలు కూడా సిద్ధమవుతున్న వేళ, పవన్ మాత్రం ఆ దారుణం సంగతేంటని ప్రశ్నిస్తూనే ఉన్నారు.
తొలి జ్ఞానోదయం బాబుకే..
రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి లాభపడదామనుకున్న చంద్రబాబు రామతీర్థం ఘటన తర్వాత బాగా రెచ్చిపోయారు. గతంలో అంతర్వేది రథం విషయంలో కూడా చంద్రబాబు హడావిడి చేసినా, రామతీర్థం దక్కరికి వచ్చేసరికి.. ఏకంగా విజయనగరం వెళ్లి మరీ పెద్ద సీన్ క్రియేట్ చేశారు. అయితే చంద్రబాబు హిందూయిజాన్ని మరీ ఎక్కువగా భుజానికెత్తుకోవడంతో మిగతా వర్గాల్లో ఆందోళన మొదలైంది.
పదే పదే తాను హిందువుని అని చెప్పుకుంటూ ఇతరులకు దూరంగా జరిగారు బాబు. అంతలోనే తప్పు తెలుసుకుని, మతరాజకీయాల వికృత క్రీడలో తనకు తానే బలిఅవుతాననే విషయాన్ని గ్రహించి సైలెంట్ అయ్యారు.
దత్త పుత్రుడికి జ్ఞానోదయం ఎప్పుడో..?
పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా రామతీర్థం ఘటన విషయంలో రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. ఓవైపు పోలీసులు తమ పని తాము చేస్తున్నామని చెబుతున్నా కూడా జనసేన లాంటి పార్టీలకు అది చెవికెక్కడంలేదు. వరుస ఘటనల మధ్య సంబందం లేకపోయినా.. హిందువులపై దాడి అంటూ అన్నిటినీ ఒకే గాటన కట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలో తమని తాము హిందువులుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ స్వతహాగా మనుషులమనే భావనకు దూరమవుతున్నారు. కమిటీల పేరుతో హడావిడి చేసి అసలు పవన్ కల్యాణ్ ఏం సాధించాలనుకుంటున్నారో ఆయనకే తెలియాలి.