అర్థరాత్రి పరుగులు…ప్రతి ఒక్కర్ని కదిలిస్తున్న వీడియో

దేశ రాజధాని ఢిల్లీ… సమయం రాత్రి 11 గంటలు. నడిరోడ్డుపై ఓ టీనేజ్ కుర్రాడు పరుగులు పెడుతున్నాడు. వెనక బ్యాగ్ తగిలించుకొని రాకెట్ లా దూసుకుపోతున్నాడు. ఆ టైమ్ లో ఆ కుర్రాడికి ఎందుకంత…

దేశ రాజధాని ఢిల్లీ… సమయం రాత్రి 11 గంటలు. నడిరోడ్డుపై ఓ టీనేజ్ కుర్రాడు పరుగులు పెడుతున్నాడు. వెనక బ్యాగ్ తగిలించుకొని రాకెట్ లా దూసుకుపోతున్నాడు. ఆ టైమ్ లో ఆ కుర్రాడికి ఎందుకంత కష్టం. అసలెందుకు పరుగెడుతున్నాడు. దేశవ్యాప్తంగా వైరల్ గా మారిన ఆ వీడియో వెనక కథ మీకోసం..

19 ఏళ్ల ఈ కుర్రాడి పేరు ప్రదీప్ మెహ్రా. పుట్టింది ఉత్తరాఖండ్ లో. బతుకుబండి లాగించడం కోసం కుటుంబంతో పాటు ఢిల్లీకి వచ్చాడు. తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. హాస్పిటల్ లో ఉంది. అన్నయ్యతో కలిసి ఉంటున్నాడు ప్రదీప్. మెక్ డొనాల్డ్ ఔట్ లెట్ లో చిన్న జాబులో చేరాడు ప్రదీప్. తను ఉంటున్న ప్రాంతం నుంచి మెక్ డొనాల్డ్ కు 10 కిలోమీటర్లు.

ఉదయాన్నే లేచి, తనే వంట చేసి రెస్టారెంట్ కు చేరుకుంటాడు. రాత్రి 10 గంటల వరకు అక్కడే డ్యూటీ. ఆ డ్యూటీ పూర్తయిన తర్వాతే ప్రదీప్ అసలు డ్యూటీ మొదలవుతుంది. నొయిడా నుంచి తన ఇంటికి 10 కిలోమీటర్లు పరుగెత్తుకుంటూ వెళ్తాడు ప్రదీప్. ఆర్మీలో చేరాలనేది అతడి ఆశయం. ప్రాక్టీస్ కు టైమ్ లేకపోవడంతో ఇలా రాత్రిళ్లు పరుగెడుతూ ఇంటికి చేరుకుంటాడు.

ఇంటికి వెళ్లిన తర్వాత తిరిగి తన భోజనం తానే వండుకోవాలి. అన్నయ్యకు నైట్ డ్యూటీకి క్యారేజీ కట్టాలి. ఇదీ అతడి దినచర్య. మొన్న ఇలానే పరిగెడుతూ దర్శకుడు వినోద్ కాప్రి దృష్టిలో పడ్డాడు ప్రదీప్. లిఫ్ట్ ఇస్తానంటే వద్దన్నాడు. ఆర్మీ రిక్రూట్ మెంట్ కు ట్రయినింగ్ ఇదేనని చెప్పాడు. కనీసం భోజనం చేద్దామంటే సున్నితంగా తిరస్కరించాడు. ఇంటికెళ్లి వండుకుంటానన్నాడు.

తను షూట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పెడతానని చెప్పాడు దర్శకుడు వినోద్. దానికి ప్రదీప్ ఇచ్చిన సమాధానం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. “పెడితే పెట్టుకోండి..నేనేం తప్పు చేయడం లేదు” అనేది అతడి ఆన్సర్.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం 12 గంటల్లోనే 4 లక్షల మంది ఈ వీడియో చూశారు. ప్రదీప్ పట్టుదల, అతడు జీవితాన్ని ఫేస్ చేస్తున్న విధానం చూసి అంతా వావ్ అంటున్నారు.