రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. కండోమ్స్ కు డిమాండ్

ఈ ఆధునిక యుగంలో, ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన నేపథ్యంలో.. యుద్ధం జరిగితే ఆ ప్రభావం ఎటువైపు నుంచి ఎటు పడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కూడా అలాంటి ప్రభావాల్నే…

ఈ ఆధునిక యుగంలో, ప్రపంచమే కుగ్రామంగా మారిపోయిన నేపథ్యంలో.. యుద్ధం జరిగితే ఆ ప్రభావం ఎటువైపు నుంచి ఎటు పడుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కూడా అలాంటి ప్రభావాల్నే చూపిస్తోంది. వంటనూనెల ధరలు పెరగడం, షేర్ మార్కెట్ పతనం లాంటివి కళ్లకు కనిపిస్తున్నాయి. అయితే కంటికి కనిపించని మరో కొరత పొంచి ఉందంటోంది రష్యా. అదే కండోమ్స్.

అవును.. ఉక్రెయిన్ తో యుద్ధం వల్ల రష్యాలో కండోమ్స్ కు డిమాండ్ పెరిగిపోయింది. గతేడాది ఇదే టైమ్ తో పోలిస్తే, ఈ ఏడాది కండోమ్స్ అమ్మకాలు 170శాతం పెరిగినట్టు రష్యా అధికారిక ఏజెన్సీలే చెబుతున్నాయి. మరి దీనికి రీజన్ ఏంటి?

దిగుమతులపై ప్రభావం

రష్యా దిగుమతి చేసుకుంటున్న ఎన్నో వస్తువుల్లో కండోమ్స్ కూడా ఒకటి. ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా అమెరికాతో సహా, చాలా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో కండోమ్స్ రేట్లు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలున్నాయి. అందుకే చాలామంది ముందుజాగ్రత్త చర్యగా ఎగబడి మరీ అవసరానికి మించి కండోమ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా గతేడాదితో పోలిస్తే 170శాతం ఎక్కువగా రష్యాలో కండోమ్స్ అమ్మకాలు జరిగాయి.

ఈ విషయాన్ని రష్యన్ ట్రేడ్ ఏజెన్సీలు కూడా కొట్టిపారేయడం లేదు. పరిస్థితులు మరింత దిగజారితే కండోమ్ దిగుమతులు కూడా పడిపోవడం లేదా ధరలు అమాంతం 3 రెట్లు పెరగడం లాంటిది జరగొచ్చని అంచనా వేస్తున్నాయి. భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కండోమ్స్ కొనుగోలు చేయడంలో తప్పులేదంటున్నాయి.

ప్రస్తుతం రష్యాలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. డాలర్, యూరోతో పోలిస్తే రష్యా కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఇప్పటికే రష్యాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. అటు పుతిన్ సర్కారు కూడా ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. యుద్ధాన్ని ఎలా ముగించాలో అర్థం కాక దిక్కులు చూస్తోంది.