కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ లను నిషేధించాకా.. మరోసారి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల దృష్టిలో పడింది. కొన్నేళ్ల కిందట కార్ల అద్దాలకు నల్లటి ఫిల్మ్ లను నిషేధించారు. అప్పటి వరకూ చాలా మంది సెలబ్రిటీలు, సామాన్యులు కూడా తమ కార్ల లోపలి వైపు బయటకు కనిపించకుండా బ్లాక్ ఫిల్మ్ లను అద్దాలకు అతికించుకునే వారు.
దీని వల్ల వ్యక్తిగత స్వతంత్రం పోతుందని పలువురు అందోళన వ్యక్తం చేసినా, కోర్టులు ఈ నల్లటి ఫిల్మ్ లకు వ్యతిరేకంగానే నిలిచాయి. సామాన్యులు ఈ విషయంలో పెద్దగా ఇబ్బంది పడరు కానీ, సెలబ్రిటీలు మాత్రం కొన్నాళ్ల పాటు ఆ ఫిల్మ్ లను తొలగించకుండా అలాగే తమ వాహనాలను నడిపారు.
దీనిపై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించారు. ఆ మేరకు కొన్నేళ్ల కిందట జూనియర్ ఎన్టీఆర్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిల్మ్ లను తీసేయించిన వార్తలు వచ్చాయి. విశేషం ఏమిటంటే.. మరోసారి జూనియర్ కారు అలాగే పోలీసుల దృష్టిలో పడింది. కార్లకు బ్లాక్ ఫిల్మ్ ల గురించి జూబ్లీహిల్స్ పోలీసులు నిర్వహించిన డ్రైవ్ లో.. జూనియర్ కారు చిక్కింది.
ఆ సమయంలో కారులో తారక్ తనయుడు, డ్రైవర్ ఉన్నారట. కారు అద్దాలకు నిషేధిత బ్లాక్ స్టిక్కర్ ఉన్న నేపథ్యంలో.. దాన్ని దగ్గరుండి తొలగించారట పోలీసులు. దీంతో పాటు మరి కొన్ని కార్లు కూడా ఈ తరహాలో దొరికగా, వాటికీ ఆ బ్లాక్ ఫిల్మ్ లను తీసేయించారట జూబ్లీహిల్స్ పోలీసులు.