పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో నాటి ఏపీ సీఎం చంద్రబాబు పెగాసస్ సాఫ్ట్వేర్ కొన్నారనే ఆరోపణలు ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పెగాసస్‌పై ఇవాళ ఏపీ అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్‌పై పూర్తిస్థాయిలో విచారణ నిమిత్తం హౌస్ కమిటీ వేయాలని ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పెగాసస్‌పై ఇవాళ అసెంబ్లీలో స్వల్పకాల చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ గతంలో చంద్రబాబు హయాంలో తమ ఫోన్లు ట్యాఫ్ అవుతున్నాయని పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినట్టు గుర్తు చేశారు. కేవలం ప్రత్యర్థుల ఫోన్ల ట్యాపింగే కాకుండా ఇతరత్రా పౌరుల భద్రతకు సంబంధించి కూడా భంగం కలిగిందని ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరగాలని సభ్యులుగా తామంతా కోరుకుంటున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం దృష్టికి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారు. సభ్యులంతా ఏకగ్రీవంగా కోరిన మీదట… ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అనుమతితో హౌస్ కమిటీ వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో హౌస్ కమిటీ ఏర్పాటు వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ పెగాసస్ అనే తేనె తుట్టెను కదిలించడం, దానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధాలున్నాయనే ఆరోపణలు… చివరికి ఏపీ అసెంబ్లీలో హౌస్ కమిటీకి దారి తీసింది. ఈ హౌస్ కమిటీ ఏం చేస్తుందే చూడాలి మరి!