వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు ఖాయం. మధ్యలో టీడీపీతో కూడా వారితో చేరే అవకాశాలు నూటికి నూరుశాతం ఉన్నాయి. దీనికి నిదర్శనమే జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేది లేదని భీమ్లా నాయక్ మాటిచ్చాక ఇక పొత్తు లేకుండా పోతుందా.
కచ్చితంగా 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలసి పోటీచేస్తాయనేది బహిరంగ రహస్యం. అయితే టీడీపీతో తమకి పొత్తు లేదంటున్నారు సోము వీర్రాజు. పొత్తు ఉంటుందని మీకు చెప్పామా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలసి పోటీ చేస్తాయని, మిగతాదంతా మీడియా సృష్టేనని చెబుతున్నారు.
ఎందుకీ దాగుడు మూతలు, ఎన్నాళ్లీ కల్లబొల్లి మాటలు. కేవలం బాబు దగ్గర బీజేపీ టికెట్ల పంచాయితీ తెగే వరకే ఈ బెట్టు కనిపిస్తుంది. బాబు రెండు సీట్లు ఎక్కువ విదిల్చితే బీజేపీ సర్దుకుపోతుంది. జై పవన్ బాబు, జై పెదబాబు, జై చినబాబు అనేస్తుంది.
అప్పటి వరకు సోము గంభీరంగా చెప్పే డైలాగుల్ని కాషాయదళంతో పాటు, కామన్ మ్యాన్ కూడా చెవిలో కమలం పువ్వులు పెట్టుకుని వినాల్సిందే.
తెగని పంచాయితీ..
టీడీపీ సోలోగా 160 సీట్లు గెలుస్తుందని ఇటీవలే ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు సెలవిచ్చారు. అంటే ఆ లెక్కన టీడీపీ 175 సీట్లలో పోటీ చేయాలి, 160 సీట్లు గెలుచుకోవాలి. పోనీ జనసేన కలిస్తే వారికి గరిష్టంగా 15 సీట్లు ఇవ్వాల్సి వస్తుంది. పవన్ మరీ పట్టుబడితే ఓ 25 విదిల్చే అవకాశముంది. అక్కడ కూడా టీడీపీ నేతల్ని అటువైపు తరిమేసి గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేయించే చావు తెలివి తేటలు బాబుకి పుష్కలంగా ఉన్నాయి.
ఇక బీజేపీ విషయానికొస్తే, తమది జాతీయ పార్టీ అని గొప్పగా చెబుతుంటారు కాషాయ నేతలు. కానీ ఏపీలో వారికి వార్డు మెంబర్లుగా కూడా గెలిచే సత్తా లేదు. కానీ ఏపీ నుంచి వారికి రాజ్యసభ సభ్యులున్నారు. కేంద్రంలో అధికారం మాదే, రాష్ట్రంలో సోలోగా పోటీ చేస్తే మేమే వీరులం, ధీరులం అనేది వారి అంచనా.
కానీ సొంతంగా పోటీ చేసే దమ్ము, ధైర్యం వారికి లేదనే చెప్పాలి. చంద్రబాబు ఊపుమీదున్నప్పుడే 2014లో గెలిచే స్థానాల్లో టికెట్లు సాధించారు బీజేపీ నేతలు. ఇప్పుడు బాబు బాగా వీకయ్యారు. డిమాండ్ చేస్తే 50 సీట్లయినా ఇవ్వకపోతాడా అనేది బీజేపీ నేతల ఆలోచన. అందుకే పొత్తులేదంటూ బీరాలు పలుకుతున్నారు.
ఎంత బెట్టు చేస్తే అంత మంచిది..
పవన్ కల్యాణ్ అడిగిన రోడ్ మ్యాప్ ఇచ్చేస్తే వెంటనే పనైపోతుంది, కానీ బీజేపీ అలా ఇవ్వదు, టీడీపీతో పొత్తుకు సిద్ధం అని చెప్పదు. అవకాశం ఉన్నప్పుడల్లా ఇలా పొత్తు లేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు నేతలు. దీంతో బాబు మెట్టు దిగక తప్పదు. అడిగినన్ని సీట్లు ఇవ్వక తప్పదు. అందుకే బీజేపీ నేతలు బెట్టు చేస్తున్నారు, బయటపడటంలేదు.
చివరకు చంద్రబాబు విసిగివేసారి సీట్ల విషయంలో దిగివస్తే అప్పుడు మూడు పార్టీలు ఏకం అయినట్టు అధికారిక ప్రకటన ఇస్తారు. అప్పటి వరకు ఈ దోబూచులాటలు చూడాల్సిందే. ఈ మొత్తం వ్యవహారం పవన్ కల్యాణ్ కి చెలగాటంగా మారితే, చంద్రబాబుకు నరకప్రాయంగా తోస్తోంది.