ఆ మాజీ మంత్రి స్వతంత్రుడు !

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓకే వెలుగు వెలిగి రాజకీయంగా వైభవంగా బతికిన నాయకుల్లో కొందరు గులాబీ పార్టీలో కావొచ్చు, ఇతర పార్టీల్లో కావొచ్చు కష్టకాలంలో ఉన్నారు. వారిప్పుడు పూజకు పనికిరాని…

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓకే వెలుగు వెలిగి రాజకీయంగా వైభవంగా బతికిన నాయకుల్లో కొందరు గులాబీ పార్టీలో కావొచ్చు, ఇతర పార్టీల్లో కావొచ్చు కష్టకాలంలో ఉన్నారు. వారిప్పుడు పూజకు పనికిరాని పువ్వులుగా మారిపోయారు.

రాష్ట్రం విడిపోయి టీడీపీ తెలంగాణలో కనుమరుగైనప్పుడు కొందరు టీడీపీ నాయకులు గులాబీ పార్టీలో చేరిపోయారు. వారిలోనూ కొందరికే పదవులు దక్కాయి. మళ్ళీ వైభవం వచ్చింది. కొందరు కాంగ్రెస్ పార్టీలో, కొందరు బీజేపీలో చేరారు. ఆ రెండు పార్టీలు అసలు అధికారంలోకి రాలేదనుకోండి.

అలాంటివారికి అసలు అదృష్టం దక్కే  అవకాశంలేదు. వైభవం దక్కే ఛాన్స్ లేదు. జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ విషయానికొస్తే గులాబీ పార్టీలో టిక్కెట్ దక్కనివారికి కాంగ్రెస్ లో టిక్కెట్ దక్కింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మోస్ట్ సీనియర్ నాయకులకు టిక్కెట్ దక్కలేదు. ఏ పార్టీలోనైనా టిక్కెట్ దక్కడానికి, దక్కకపోవడానికి అనేక సమీకరణాలు, కారణాలు ఉంటాయి.

కాంగ్రెస్ పార్టీలో అలా టిక్కెట్ దక్కనివారిలో సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి ఉన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నాగం వైభవం అనుభవించారు. అప్పట్లో తిరుగులేని నాయకుడిగా ఉండేవారు. 

తెలుగుదేశం పార్టీలో చేరి 1983లో అసెంబ్లీ ఎన్నికలకు పోటీ  చేశారు. 52 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్ళీ 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. 1989లో తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పొటీ చేసి  ఓడిపోయారు. మళ్ళీ 1994 లో మళ్ళీ తెలుగుదేశంలో చేరి టికెట్ సంపాదించి విజయం సాధించారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా వరుసగా నాలుగు సార్లు మొత్తంపై 5 సార్లు నాగర్ కర్నూలు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 

తెలుగుదేశం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేయడం, పార్టీ అధ్యక్షుడినే విమర్శించడం ద్వారా పార్టీ నుంచి 2011లో బహిష్కరణకు గురయ్యారు. 2013 జూన్ 3న  భారతీయ జనతా పార్టీలో చేరారు. అక్కడ గుర్తింపు దక్కక పోవడంతో  కాంగ్రెస్ లో చేరారు. తనకు టికెట్ దక్కకపోవడంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నాగర్ కర్నూల్ నుంచి పోటీ చేయాలని, తనకే టికెట్ వస్తుందని ఆశించిన నాగం జనార్ధర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షాకిచ్చింది. ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో నాగం తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

అవకాశవాది జూపల్లి కృష్ణారావు గెలిచిన తర్వాత పార్టీ మారరా? అని నాగం ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాతే వచ్చారని, కోవర్ట్ రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి జరిగిన అన్యాయానికి రేవంత్ రెడ్డిదే బాధ్యత అని స్పష్టం చేశారు.

పార్టీలో అన్యాయం జరిగిన నాయకులకు అండగా నిలిచి, కలిసి పోరాడుతామన్నారు. సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య, బీసీలను రేవంత్ రెడ్డి అవమానించారని నాగం జనార్ధన్ రెడ్డి మండిపడ్డారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని నాగం జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీలో ఇమడలేకపోయిన నాగం ఏడాది క్రితం మూడు దశాబ్దాలుగా ఏ పార్టీనైతే వ్యతిరేకించారో అదే పార్టీలో చేరిపోయారు.

అయినా, ఆయన అంతకుముందులా యాక్టీవ్ గా లేరు. ఇక గత ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూల్ లో పోటీ చేసి ఎవరూ ఊహించని విధంగా ఓటమిపాలయ్యారు. సుమారు 50 వేలకు పైగా ఓట్లతో ఆయన ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డి సాధించిన ఓట్లలో సగం మార్కును కూడా నాగం చేరలేకపోయారు.

గత ఎన్నికల్లో జనార్ధన్ రెడ్డి నియోజకవర్గానికి దూరమై ఎంపీగా పోటీ చేయడమే ఆయనకు చేటు చేసింది. నాగం లేకపోవడంతో మర్రి జనార్ధన్ రెడ్డి 2014లో సులువుగా గెలిచారు. గెలిచాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, జిల్లా కేంద్రం కావడం వంటి కారణాలతో మర్రి జనార్ధన్ రెడ్డి అక్కడ పాతుకుపోయారు.

దీంతో నాగం జనార్ధన్ రెడ్డికి తీవ్ర పరాభవం ఎదురైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి మాత్రం ఇప్పుడు కష్టకాలంలోనే ఉన్నారు. పైగా తన రాజకీయ వారసుడికి కూడా పూలబాట ఏమీ లేదు. మొత్తానికి నాగం జనార్ధన్ రెడ్డి ఇటీవలి ఎన్నికల ఫలితాలతో రాజకీయాల్లో నుంచి ఇంచుమించు రిటైర్డ్ అయినట్లే కనిపిస్తోంది. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలవడం కష్టమే.