ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో కొత్త కేబినెట్ కొలువుతీరనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటే చెప్పినట్టు రెండున్నరేళ్లకు మంత్రి వర్గాన్ని మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే గడువు కూడా దాటిపోయింది. ఇటీవల ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో జగన్ రాబోవు ఎన్నికలకు దిశానిర్దేశం చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేయాలని ఆదేశించారు.
జగన్ కొత్త కేబినెట్‌లో ఎవరెవరికి పదవులు దక్కనున్నాయనే విషయమై విస్తృత చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా ముగ్గురు మహిళా ఎమ్మెల్యేల పేర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్, గుంటూరు జిల్లా చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
వీరి సామాజిక నేపథ్యాలు కూడా మంత్రి పదవులు దక్కడానికి ఎక్కువ అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జొన్నలగడ్డ పద్మావతి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఈమె భర్త ఆలూరు సాంబశివారెడ్డి. ఈయన రెడ్డి సామాజికవర్గ నేత. ప్రస్తుతం రాష్ట్ర విద్యా సంస్కరణల కమిటీ సభ్యుడు. ఈమెకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గాలను సంతృప్తరచొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉషశ్రీ చరణ్ విషయానికి వస్తే …ఆమె బీసీ, భర్త రెడ్డి సామాజిక వర్గం. రానున్న ఎన్నికల్లో బీసీల ఓట్లపై జగన్ మరింత ఎక్కువ దృష్టి పెట్టాలని అనుకుంటున్నారు. ఈమెకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఇటు బీసీ, అటు రెడ్డి సామాజిక వర్గాలను ఆకట్టుకోవచ్చనే వాదన వినిపిస్తోంది. అయితే వీరిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉంది.
ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ విషయానికి వస్తే… జగన్ అభిమానించే చెల్లిగా తోటి ఎమ్మెల్యేలు అంటుంటారు. ఈమె బీసీ , భర్త కుమారస్వామి కాపు సామాజిక వర్గం. విడదల రజనీకి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా ఒక దెబ్బకు రెండు పిట్టలనే చందంగా ఇటు కాపులు, అటు బీసీ సామాజికవర్గాలను పూర్తిస్థాయిలో తమ వైపు తిప్పుకోవచ్చని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. మహిళా ఎమ్మెల్యేల్లో విడదల రజనీకి ప్రత్యేక ఆకర్షణ ఉంది. కట్టు, బొట్టు, నాయకత్వ ఠీవి, మాటతీరు,
హోదాతో సంబంధం లేకుండా అందరితో కలుపుగోలు తనంతో వ్యవహరించడం రజనీకి కలిసొచ్చే అవకాశాలుగా చెబుతున్నారు. ఈమెకు మంత్రి పదవి ఇవ్వడం రానున్న ఎన్నికల్లో వైసీపీకి బీసీల్లో మరింత అభిమానం పెరుగుతుందనే అభిప్రాయం ఆ సామాజిక వర్గం నుంచి వినిపిస్తోంది.
జొన్నలగడ్డ పద్మావతి, ఉషశ్రీచరణ్, విడదల రజనీలలో ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా రెండు సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని, జగన్ కీలక నిర్ణయం తీసుకుంటారనడంలో రెండు మాటకు స్థానం లేదు.