దేశంలో పెట్రోలియం ఉత్పత్తులను రేషన్ పద్ధతిలో ప్రజలకు పంపిణీ చేసేందుకు నరేంద్రమోడీ సర్కారు ఆలోచన చేస్తున్నదా? రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న పెట్రోలు డీజిలు ధరల తాకిడిని తట్టుకోడానికి, అంతర్జాతీయ మార్కెట్ లో పెరుగుతున్న తరహాలోనే దేశంలో కూడా పెంచితే.. ప్రజల్లో రాగల వ్యతిరేకతను తగ్గించడానికి ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తున్నదా అనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. వినియోగదార్లకు పెట్రోలు, డీజిలులను రేషన్ పద్ధతిలో పంపిణీ చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి కలుగుతోందా అని పలువురు విశ్లేషిస్తున్నారు.
దీనికి ఒక సహేతుకమైన కారణం ఉంది. బల్క్ గా పెద్దమొత్తాలు డీజిలు కొనే వారికి కేంద్రప్రభుత్వం ఆల్రెడీ వడ్డింపు ప్రారంభించింది. ఆర్టీసీ వంటి సంస్థలు, జెనరేటర్లకు వాడేవారు, డీజిలుద్వారా నడిచే యంత్రాలను నిర్వహించే ఫ్యాక్టరీల వారు బల్క్‌గా డీజిలు కొంటుంటారు. వీరందరికీ లీటరుకు రూ.25 వంతున ఇప్పటికే ధరలు పెంచేశారు.
ఆర్టీసీకి సంబంధించి ఇదివరలోనే కొంత పెంపు అమల్లోకి రాగా.. తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్సులు పూర్తిగా బయటి బంకుల్లో డీజిలు కొట్టించుకుంటూ నష్టనివారణకు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇప్పటిదాకా సాధారణ పౌరులకు పెట్రోలు ధరల వడ్డన జరగలేదు.
నవంబరు తర్వాత.. కేంద్రం పెట్రోలు ధరలు పెంచలేదు. అయిదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరలు పెంచలేదని అంతా అన్నారు. చివరి విడత పోలింగ్ ముగియగానే వడ్డిస్తారని కూడా అన్నారు. తర్వాత ఫలితాలు రాగానే వడ్డిస్తారని అన్నారు. అది కూడా జరగలేదు. బల్క్ వినియోగదారులకు మాత్రమే ధర పెంచారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెట్రోలియం ధరలను నియంత్రించడానికి, ప్రజల్లో చెడ్డపేరు మూటగట్టుకోకుండా ఉండడానికి ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నదా అనే అభిప్రాయం కలుగుతోంది.
రేషన్ ద్వారా పెట్రోలు, డీజిలు విక్రయించేట్లయితే గనుక.. భారీపరిమాణాల్లో కొనే వారికి మాత్రమే భారం పడుతుంది. సామాన్యులకు భారం పడదు. పరిమితమైన వినియోగానికి పరిమితమైన ధరల్లోనే వారు కొనుక్కుంటారు. దీనివల్ల కామన్ మేన్ లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాదు. పైగా ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక విప్లవాన్ని జోడించినట్లయితే.. బండి నెంబర్ల వారీగా టూవీలర్లకు, ఫోర్ వీలర్లకు రేషన్ మోతాదు నిర్ణయిస్తే ఆ ప్రకారమే విక్రయించడం, రేషను దాటిన తర్వాత.. ఎక్కువ ధరకు విక్రయించడం సాధ్యమవుతుంది. డబ్బాల్లో పెట్రోలు, డీజిలు పట్టుకునేట్లయితే గరిష్టమైన ధరకే విక్రయించరే పద్ధతి పెట్టవచ్చు.
విద్యుత్తు వినియోగాన్ని నియంత్రించడానికి శ్లాబ్ సిస్టమ్ ఉన్నట్టే పెట్రోలు డీజిలు వినియోగంలో కూడా శ్లాబ్ సిస్టమ్ తెచ్చినట్లయితే బాగుంటుందనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివలన సాధారణ వినియోగం మాత్రమే చేసే ఎవ్వరికీ భారం పడదు. పెట్రోలు సంస్థలు నష్టపోకుండా, ప్రభుత్వం చెడ్డపేరు తెచ్చుకోకుండా ఉంటుంది.