జనసేన పార్టీ ఆవిర్భావసభలో ప్రసంగిస్తూ పవన్ కళ్యాణ్ తన భవిష్యత్ ప్రణాళిక ఏమిటో చెప్పేశారు. ఎమర్జన్సీలో నియంతృత్వ పోకడలు పోయిన ఇందిరా గాంధీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమైనట్లే, ఆంధ్రలో జగన్ దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావలసిందే అన్నారు. 2019లో టిడిపి, బిజెపి, కాంగ్రెసు, జనసేన-లెఫ్ట్-బియస్పీ కూటమి విడివిడిగా పోటీ చేసి జగన్‌కు అధికారం అప్పగించారు కాబట్టి మళ్లీ ఆ పొరపాటు చేయకూడదని నిశ్చయించుకున్నట్లు తోస్తోంది.
అందుకనే యీసారి వైసిపి వ్యతిరేక ఓటు చీల్చే ప్రశ్నే లేదు అని ప్రకటించారు. 2024లో వైసిపికి వ్యతిరేకంగా జట్టు కట్టవలసిన పార్టీల్లో బియస్పీ, కాంగ్రెసు, లెఫ్ట్ వుంటాయో లేదో స్పష్టత లేదు. అవి ఆటల్లో అరటిపండు లాటివి. పైగా బిజెపి ఉన్న ఫ్రంట్‌లో అవి వుండకపోవచ్చు. పవన్ మనసులో ఉన్న ఐక్యకూటమి జనసేన-బిజెపి-టిడిపి అనే అనుకోవాలి. ఎందుకంటే భావసారూప్యం ఉండి, యిప్పటికే సహకరించుకుంటున్న పార్టీలవి.
అయితే యీ కూటమిలో వచ్చిన యిబ్బంది ఏమిటంటే టిడిపి, జనసేన రెండూ బిజెపితో అంటకాగడానికి రెడీగా వున్నాయి కానీ బిజెపి జనసేనతో తప్ప టిడిపితో చేతులు కలపడానికి సిద్ధంగా లేదు. ఆ యిద్దరి మధ్య బంధం కుదర్చడానికి పవన్ నిశ్చయించుకున్నారు. తన అవసరం వుంది కాబట్టి బిజెపి తన మాట వింటుందనే నమ్మకం అతనికి వుంది. వైసిపిని గద్దె దింపే రోడ్డు మ్యాప్ మీరే యిస్తానన్నారు, యిచ్చాకనే రంగంలోకి దిగుతాం అంటూ యిప్పటిదాకా తమ అలసత్వానికి బాధ్యత బిజెపిదే అని చాటింపు వేయడంతో బాటు, నాయకత్వం వహించి అందర్నీ (టిడిపి అని అర్థం, లెఫ్ట్, కాంగ్రెసు అని కానే కాదు) కలుపుకోవలసిన పని మీదే అని బాధ్యత వాళ్ల మీదే నెట్టేశారు. రేపు వైసిపి అధికారంలోకి మళ్లీ వస్తే ఆ పాపం మీదే, టిడిపిని దూరం పెట్టిన మీ పొరపాటు కారణంగానే ఆంధ్ర ప్రజలకు కడగండ్లు తప్పలేదు అనగలరు.
పవన్ చేసిన యీ ప్రకటనతో టిడిపి వారి ఒన్‌సైడ్ లవ్, టూసైడ్ లవ్ అయిందని అందరికీ తెలిసింది. వాలెంటైన్స్ డే అయిన సరిగ్గా నెల్లాళ్లకు లవర్ స్పందించి, ఆమోదించి నట్లయింది. అంతేకాదు, తన పాత లవర్ బిజెపికి కొత్త లవర్‌ను కూడా కలుపుకుని త్రీసైడ్ లవ్ చేద్దామని ప్రతిపాదించినట్లయింది. ఇంతవరకు అందరికీ స్పష్టత ఉంది. అయితే ఇలాంటి పొత్తు అంటే టిడిపిని మళ్లీ అధికారంలోకి తేవడానికి జనసేన అంగీకరించి, సహకరిస్తోందని అని వైసిపి నాయకులు అనుకుంటున్నారు. ఎందుకంటే మళ్లీ అధికారం చేపట్టాలనే ఉధృతమైన కోరిక టిడిపికే వుంది. బిజెపికి యిప్పట్లో ఆ ఆశ, అవకాశం లేవని దాని నాయకులకు తెలుసు. 2024లో టిడిపి లుప్తమై పోతే 2029 నాటికి తాము ఆ స్థానాన్ని భర్తీ చేసి, వైసిపితో తలపడదామనే ప్లాను వారిది.
ఈలోపున టిడిపి బలపడడమే దాని కిష్టం లేనప్పుడు, దానికి దోహదపడే పని వాళ్లెందుకు చేస్తారు? అందుకే రాష్ట్రానికి యివ్వవలసినవి కూడా యివ్వకుండా, వివక్షత చూపిస్తున్నారనే నింద మోస్తూ కూడా కాలక్షేపం చేస్తున్నారు. ఇవ్వవలసినదేదో 2029కి ఓ రెండేళ్ల ముందు నుంచి యిస్తూ ‘మమ్మల్ని రాష్ట్రంలో కూడా గెలిపిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది’ అనే నినాదంతో వెళదామని వాళ్ల యోచన. మరి యిప్పటికిప్పుడు జగన్‌ను కూలదోసేసి, అధికారంలోకి వచ్చేద్దామని ఉవ్విళ్లూరుతున్నదీ, వైసిపి పని అయిపోయిందని తనకు అనుకూల వర్గాల ద్వారా అహరహం బాకా ఊదిస్తున్నదీ టిడిపియే కాబట్టి, వైసిపికి ప్రత్యామ్నాయం అనగానే జనాలకు టిడిపియే తడుతోంది. బిజెపి, జనసేన, టిడిపిల్లో అంగబలం, అర్థబలం, మీడియా మద్దతు, రెండంకెల సంఖ్యలో ఎమ్మెల్యేలు, కాసిన్నిమంది ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఉన్నది టిడిపికే! తక్కినవాటికి ఆ ముచ్చటా లేదు. (జనసేన ఎమ్మెల్యే యింకా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నాడని మీరు వాదిస్తే నేనేం చేయలేను)
అందువలన వైసిపికి బదులుగా ప్రతిపక్ష కూటమిని తెస్తాం అని పవన్ అంటే టిడిపి సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వమే అని జనాలు అనుకోవడంలో తప్పేమీ లేదు. టిడిపి అనగానే చంద్రబాబే ముఖ్యమంత్రి. ఆ మేరకు ఆయన అసెంబ్లీలో భీష్మప్రతిజ్ఞ కూడా చేసి వున్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే నా లక్ష్యం అని పవన్ ప్రకటించారు అని అందరూ అనుకోవడానికి ఆస్కారం యిలా ఏర్పడింది. దాన్నే అంబటి రాంబాబు ‘జనసైనికులారా, టిడిపి పల్లకీ మోయడానికి సిద్ధంగా వుండండి’ అని పవన్ సందేశం యిచ్చారని వ్యాఖ్యానించారు. స్థూలంగా చూస్తే అది నిజమే అనిపిస్తుంది. కానీ చట్టాలను అన్వయించేటప్పుడు ‘.. టు బి రెడ్ విత్’ అని వాడినట్లు, పవన్ యితర ప్రకటనలను కూడా జోడించి అప్పుడు వ్యాఖ్యానించాలి.
ఆయన ఏవన్నాడు? ‘పార్టీలు త్యాగాలకు సిద్ధపడాలి, వ్యక్తిగత లాభాలు, స్వార్థాలు మరిచి రావాలి’ అన్నారు. ‘రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుంది’ అన్నారు. ‘రేపు పొద్దున్న ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి ఎదగబోతున్నాం’ అన్నారు. ఆ తర్వాత జనసేన ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకు ఏయే పథకాలు రూపొందించిందో వివరించారు. ఇవన్నీ క్రోడీకరించి చూస్తే వచ్చే సందేశమేమిటి? ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది జనసేనే! ఆ దారికి అడ్డు రాకుండా, పదవుల కోసం పట్టుబట్టకుండా త్యాగాలు చేయవలసినది కూటమిలోని యితర పార్టీలు. ‘మేం త్యాగం చేసి తక్కినవాళ్లని పదవిలో కూర్చోబెడతాం. వాళ్లు తప్పులు చేస్తే ప్రశ్నిస్తాం.’ అనే లైను పార్టీ పెట్టిననాటిది. 2019 నాటికే అది మారింది. వేరెవ్వరికీ మా మద్దతు లేదు, మేమే సొంతంగా పోటీ చేసి గెలుస్తాం అనే లైను తీసుకున్నారు.
2024 నాటికి ‘మేం మీతో కలుస్తాం కానీ అప్పుడు మేం త్యాగం చేశాం కాబట్టి యీసారి త్యాగం చేయవలసిన వంతు మీది’ అనే లైను తీసుకుంటున్నారు. న్యాయంగా ఆలోచిస్తే యీ వాదనలో అసంబద్ధత ఎంతమాత్రం లేదు. ఎప్పుడూ యీయనే యింకోళ్ల కోసం పదవులు వదిలేసుకోవాలా? పవన్‌కైతే వేరే వ్యాపకం ఉంది. సినిమా హీరోగా ఏం చేసుకోవాలో తెలియనంత గ్లామర్ ఉంది, పలుకుబడి వుంది. మరి జనసేనలో తక్కిన నాయకుల సంగతేమిటి? పార్టీని పోషిస్తూ, జనాల్లో నిలుపుతూ, సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రభుత్వ ఏర్పాటు దగ్గరకు వచ్చేసరికి అన్నీ పక్కవాళ్లకు అప్పగించి తాము త్యాగరాజులుగా మిగిలిపోయి విషాదకీర్తనలు పాడుకుంటూ కూర్చోవాలా? అలా అయితే పార్టీలో ఎవరైనా మిగులుతారా? ధనార్జనకు కాకపోయినా ప్రజాసేవ చేయడానికైనా పదవులు ఉండాలి కదా!
పవన్ యిన్నాళ్లకు ఒక స్టాండ్ తీసుకున్నారు. త్యాగాల పర్వం అయిపోయింది. అధికారాల అంకం ప్రారంభం కావాలి అని. అందుకే కూటమి సభ్యులకు మెసేజి పంపారు. కలిసి పని చేసి, వైసిపిని మట్టి కరిపించి, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, కానీ అది జనసేన ప్రభుత్వంగానే వుంటుంది. ముఖ్యమంత్రి పదవి జనసేనదే! అనగా నాదే! (ఆయన తప్ప మరో ముఖ్యనాయకుడే కాదు, నాయకుడే లేడు) దీనికి గాను తక్కిన పార్టీలు ఒప్పుకోవాలి, అది త్యాగం అనుకోండి, స్వార్థరాహిత్యం అనుకోండి, ఏమైనా అనుకోండి అని స్పష్టంగా చెప్పారు.
నిజానికి రెండు పార్టీలను ఉద్దేశించి అన్నా గురి పెట్టినది టిడిపిపైనే! ఎందుకంటే బిజెపి తరఫున ముఖ్యమంత్రి కాండిడేటు ఎవరూ లేరు. వాళ్లు ఊహూ గెలిచేసే స్థానాలూ ఉండవు. టిడిపి-జనసేన ఉమ్మడి ప్రభుత్వం నడిచినపుడు ఏవో రెండు మంత్రి పదవులు యిస్తే అదే పదివేలనుకున్నారు. సంబంధిత మంత్రిని అడక్కుండానే ముఖ్యమంత్రి ముఖ్యనిర్ణయాలు తీసుకున్నారని బిజెపి వాళ్లే తర్వాత చెప్పుకున్నారు. అందువలన బిజెపి వారి త్యాగం గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం చందం.
అసలు చిక్కంతా టిడిపితోనే వుంది. అక్కడ ముఖ్యమంత్రి కాండిడేటే కాదు, ఉపముఖ్యమంత్రి కాండిడేటు కూడా ఉన్నారు. కాకలు తీరిన మాజీ మంత్రులతో పార్టీ కిటకిట లాడుతోంది. ప్రస్తుతానికి అసెంబ్లీ బయట వుండి పూజాపునస్కారం లేక బూజు పట్టి వున్నారు కానీ యీ కూటమి గెలిచి, వాళ్లు ఎమ్మెల్యేలైతే ‘నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తా’ అనేవారు డజన్ల సంఖ్యలో ఉన్నారు. వీళ్లందరిని ఎకామడేట్ చేయడం ఎలా? ఎన్నికలు యింకా రెండేళ్లున్నాయి. ముందస్తు ఎన్నికల వార్తలు వస్తూనే వుంటాయి. మెటీరియలైజ్ అయ్యేదాకా నమ్మడానికి లేదు. పరిస్థితులు ఏ మలుపైనా తీసుకోవచ్చు. ఇప్పణ్నుంచి అంచనాలు వేయడం అవివేకం. అయినా ఈ కూటమి గెలుస్తుంది అనుకుని ఉరామరిగా లెక్కలు వేసి, సినారియో ఎలా వుంటుందో ప్రొజెక్షన్ వేసుకుని చూసుకోవడంలో తప్పేమీ లేదు.
వైసిపి బలం ఎంత క్షీణించినా అచ్చెన్నాయుడు చెప్పినట్లు టిడిపి ఒక్కదానికే 160 వచ్చేయడం దివోస్వప్నమే! గెలిచే పక్షంలో యీ కూటమికి 90 వస్తాయనుకోవడం సమంజసంగా వుంటుంది. దానిలో 10 బిజెపికి పోగా 50 టిడిపికి, 30 జనసేనకు అనుకుందాం. జనసేన తరఫున పవన్ ముఖ్యమంత్రి అవుతారు. టిడిపి తరఫున లోకేశ్ ఉపముఖ్యమంత్రి అవుతారు. కాబినెట్లో 60శాతం పదవులు టిడిపికి, 30శాతం జనసేనకు, 10శాతం బిజెపికి. మరి చంద్రబాబు? మెంటార్‌గా వుంటారు. సలహాదారుగా వుంటారు. సెక్రటేరియట్లో దాదాపు ముఖ్యమంత్రి కాబినంత కాబిన్ ఉంటుంది. కూటమి కన్వీనరుగా అన్ని పార్టీల వ్యవహారాలూ చక్కబెడుతూంటారు. ముఖ్యమంత్రి కావడానికి లోకేశ్‌కు తర్ఫీదు యిస్తూంటారు. అసెంబ్లీలో రావడానికి భీష్మప్రతిజ్ఞ అడ్డువస్తుంది కాబట్టి, గ్యాలరీలో కూర్చుని ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలో దిశానిర్దేశం చేస్తూ వుంటారు.
ఈ సీను పవన్‌కు చెప్పగానే ‘బాగానే వుందే, అలాగే కానీయండి, డిటైల్స్ వర్కవుట్ చేసి చెప్పండి’ అనవచ్చు. కానీ చంద్రబాబు తల అడ్డంగా ఊపుతారు. ‘అలా ఊపకూడదు, స్వార్థం వీడండి, త్యాగాలకు సిద్ధపడండి. మీకు నిద్ర పట్టకుండా చేస్తున్న జగన్‌ను దింపాలంటే యిది తప్ప వేరే మార్గం లేదు. నిదానంగా ఆలోచించి, ఔననండి’ అని పవన్ సభాముఖంగా పరోక్ష సందేశం యిచ్చారు. నేనిలా అనగానే మీరు కయ్మంటారు. ‘పవన్ అలా అంటారని మీరెలా అనుకుంటారు? ఆయనకు మాత్రం క్షేత్రవాస్తవాలు తెలియవా? మూడేళ్ల క్రితమే జరిగిన ఎన్నకలలో టిడిపికి 23 స్థానాలు వస్తే జనసేనకు 1, అదీ అభ్యర్థి సొంతబలం మీద వచ్చింది.
నాయకుడు రెండు చోట్లా ఓడిపోయాడు. డిపాజిట్లు వచ్చినవాళ్లను వేళ్ల మీద లెక్కించవచ్చు. పోనీ 2019 తర్వాతైనా జనసేనకు ఓ మీడియా మోతుబరి కానీ, ఓ యిండస్ట్రియలిస్టు కానీ, ఓ పేద్ద నాయకుడు కానీ మద్దతుగా నిలిచాడా? సంస్థాగతంగా పార్టీ బలపడుతోందా? స్థానిక ఎన్నికలలో గెలిచిందా? ఒక్క మునిసిపాలిటీ ఐనా దాని ఖాతాలో ఉందా? ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే 175 స్థానాల్లో నిలబడడానికి అభ్యర్థులున్నారా? టీవీ చర్చల్లోకి వచ్చేందుకు పుంజీడు ప్రతినిథులున్నారా?
అవతల చూస్తే టిడిపికి అన్నీ ఉన్నాయి. 30-35శాతం ఓటు బ్యాంకు ఉంది. టిడిపి గెలవడానికై సొంత డబ్బు కోట్లు కుమ్మరించే వీరాభిమానులున్నారు. దాని గెలుపు తమ ప్రతిష్ఠకు సంబంధించిన వ్యవహారంగా భావించే వర్గాలున్నాయి. కూటమి గెలవాలే కానీ, గెలిస్తే సహజనాయకత్వం టిడిపిదే అవుతుంది, ముఖ్యమంత్రి పదవి అనుభవజ్ఞుడు, కాకలు తీరిన యోధుడు, అపర చాణక్యుడు, దీర్ఘదర్శి, ద్రష్ట, ప్రతిపక్షంలో ఉన్నా జూమ్ మీటింగుల ద్వారా రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ వ్యవహారాలకు దిశానిర్దేశం చేస్తున్న చంద్రబాబునే ముఖ్యమంత్రి పదవి వరిస్తుంది తప్ప అన్యులను కాదు. ఆయన తప్ప ఆంధ్రులలో ఎవరికీ ఆ గద్దెపై కూర్చునే అర్హతే లేదు.’ అని మీరు గట్టిగా నాతో, కుదిరితే పవన్‌తో కూడా బల్లగుద్ది చెపితే పవన్ చిరునవ్వుతో అన్నీ విని ‘అన్నీ వున్నా, మరి టిడిపి యిలా అఘోరిస్తోందేం? స్థానిక ఎన్నికలలో, ఉపయెన్నికలలో చిత్తయిందేం? మాది ఒన్‌సైడ్ లవ్ అంటూ నాకు ప్రేమపావురాలను పంపుతోందేం? బిజెపి నాయకులు తీసిపారేస్తూన్నా, కేంద్రం రాష్ట్రానికి న్యాయం చేయటం లేదని తెలిసినా పన్నెత్తి ఒక్కమాట బిజెపిని అనకుండా ఉందేం?’ అని అడుగుతారు.
మీకు సమాధానం తట్టక తల గోక్కుంటూ వుంటే ఆయనే సమాధానమిస్తారు – ‘అన్నీ ఉన్నా, టిడిపి దగ్గర అసలైన ముక్క లేదు. పేకాటలో చేతిలో ఎన్ని ముక్కలున్నాయన్నది క్వశ్చన్ కాదు, లైఫ్ కార్డ్ వుందా లేదా అన్నదే పాయింటు. అది లేదు కాబట్టే టిడిపి ఫుల్ కౌంట్ యిచ్చి, క్రుంగుతోంది. నా దగ్గర ఎమ్మెల్యేలు లేరు, పార్టీ నిధులు లేవు, కానీ ‘మేరే పాస్ మాఁ హై’ అన్నట్లు గెలిపించే తురఫు ముక్క నా దగ్గరుంది. 2014లో దాన్ని టిడిపి-బిజెపికై వాడాను. ఇప్పుడు నాకోసం వాడదా మనుకుంటున్నాను. ఆ ముక్క లేనిదే టిడిపి-బిజెపికి లైఫ్ లేదు.
సత్యభామ ఎన్ని నగలేసి తూచినా ప్రయోజనం కలిగిందా? రుక్మిణీదేవి వచ్చి తులసిదళం వేస్తేనే తారుమారు, తక్కెడమారు అయింది. నేను తులసిదళం చేతిలో పట్టుకుని కూర్చున్నాను. నా సినిమాలు హిట్టవుతున్న కొద్దీ తులసిదళం మరింత బరువెక్కుతుంది. అది కావాలంటే టిడిపియే నాకు అభ్యర్థులను వెతికి పెట్టాలి. వాళ్లను నెగ్గించడానికి తన కార్యకర్తలను నియోగించాలి, నిధులు సమకూర్చాలి. అన్నీ అమర్చిపెడితే నేను వచ్చి అత్తగారిలా వేలు మోపుతాను. నా స్టాంప్ కొడతాను.’ అంటారు.
ఇవన్నీ మీ చెవిలో చెప్పాడా? అని అడగవద్దు. సభాముఖంగా ఆయన చెప్పిన వాక్యాల మధ్య ఉన్న అర్థం యిది కాదని, మరోటని అనుకోవడానికి అవకాశం ఉంటే చెప్పండి. ఆంతరంగిక సంభాషణల్లో యితర పార్టీల నాయకులతో కూడా ఆయన చెప్పే డైలాగులు యిలాగే వుండవు. ఆయన డైలాగు రైటర్స్ వేరే వుంటారు. మంచి పంచ్‌తో చెప్తారు. కానీ భావం మాత్రం యించుమించు యిలాగే వుంటుంది. ఇందులో పావు చెప్పినా, టిడిపి నాయకుడికి భావం బోధపడుతుంది. ‘అకల్మంద్కో ఇశారా కాఫీ హై’ అన్నారు. పవన్ ఉద్దేశమేమిటో బాబుకి అర్థమైంది. అందుకే ఆయన వెంటనే స్పందించటం లేదు. లేకపోతే వైసిపిని గద్దె దించడానికి అందరూ కలిసి రావాలి, త్యాగాలకు సిద్ధపడాలి అని పవన్ అనగానే టిడిపి నుంచి అఫీషియల్ స్టేటుమెంటు ఒకటి యీపాటికే వచ్చేయాలి – ఈ ఎప్రోచ్ను మేం స్వాగతిస్తున్నాం, త్వరలోనే కలిసి ఉద్యమాలు చేస్తాం అని. కానీ రాలేదు. ఎందుకంటే పవన్ గొంతు దిగడానికి వీల్లేని షరతొకటి ముందు పెట్టారు.
నిజానికి పవన్ చెప్పిన ప్రకారం జరుగుతుందా? బిజెపి టిడిపితో మళ్లీ చేతులు కలుపుతుందా? 2019కి ముందు బిజెపితో విడిపోయి తప్పు చేశాం అని టిడిపి నాలిక కరుచుకుంటోంది తప్ప, బిజెపి అలా కరుచుకుంటున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా బాబు పడగనీడలోంచి బయటకు వచ్చి, ఎదగడానికి అవకాశం వచ్చింది అనుకుంటున్నారు స్థానిక నాయకులు. ఇప్పటికిప్పుడు ఆంధ్రలో జగన్‌ను దింపవలసిన అవసరం వాళ్లకు కనబడటం లేదు. మమతా బెనర్జీలాగానో, ప్రస్తుత దశలో కెసియార్ లాగానో కేంద్రంతో కయ్యం పెట్టుకుని వుంటే కనబడేదేమో! జీహుజూర్ అంటున్న కాండిడేట్‌ను తీసేయడం దేనికి? జాతీయ స్థాయిలో ఉన్న మరో పార్టీ కాంగ్రెసులో జగన్ చేరే ఛాన్సే లేదు, నేతృత్వం నుంచి సోనియా కుటుంబం తప్పుకుంటే తప్ప! తప్పుకునే సమస్యే లేదు అనేశారుగా సోనియా! ఇక యితర ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరే ఉబలాటమూ జగన్‌కు లేదు. వాళ్లతో పరిచయాలూ లేవు, ఆ యా రాష్ట్రాలకు వెళ్లి ప్రచారమూ చేయడం లేదు.
బాబుతో అయితే యీ రిస్కు ఉంది. ఆయన తలచుకుంటే కూటమికి గుడ్‌బై చెప్పి కాంగ్రెసుతో వెళ్లగలరు. లెఫ్ట్‌తో వెళ్లగలరు. ప్రాంతీయ పార్టీల కూటమి అయితే నల్లేరు మీద బండి నడకే. ఆ నాయకులందరూ యీయనింట్లో చేయి కడిగినవారే. పవన్‌తో అయితే బిజెపికి ఏ యిబ్బందీ లేదు. ఆయనకు కాంగ్రెసూ తెలియదు, తృణమూలూ తెలియదు, అప్పుడెప్పుడో వెళ్లి మాయావతిని కలిసి వచ్చారంటే, యిప్పుడు మాయావతియే రాజకీయాల్లోంచి మాయమయ్యేట్లున్నారు. అందుకని బిజెపి పవన్‌తో పొత్తు పెట్టుకుంది. ఇప్పుడాయన టిడిపితో కూడా పొత్తు పెట్టుకోమని ఒత్తిడి పెడితే లొంగుతుందా? అనేది పెద్ద ప్రశ్న. ఒకవేళ ఒప్పుకుని, జనసేన-బిజెపి-టిడిపి కూటమి ఎన్నికలలో మెజారిటీ సీట్లు గెలిస్తే, అప్పుడైనా పవన్ ముఖ్యమంత్రి అవుతారని కచ్చితంగా చెప్పగలమా? ఇది కొంచెం డౌటే. ఎందుకంటే బాబు తన మనుష్యులనే జనసేన మనుషులుగా ఫిరాయించి, ఎమ్మేల్యేలుగా ఎన్నికయ్యాక సగం మంది చేత ‘స్వల్ప మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని కాపాడుకోవాలంటే బాబుకే సాధ్యం, ఆయనే ముఖ్యమంత్రిగా వుండాలి’ అనిపిస్తే పవన్‌కు యిబ్బందే!
ఇలాటి విషయాల్లో బాబు చాకచక్యం 1995లో చూశాం. ఎన్టీయార్ బొమ్మ పెట్టుకుని గెల్చిన వారు, పార్టీని రక్షించుకోవాలంటే బాబే గతి అన్నారు. టిడిపిని పడతిట్టి వైసిపి టిక్కెట్టుపై ఎన్నికైన 23 మంది ఎమ్మెల్యేలు, మా నియోజకవర్గ ప్రయోజనాల కోసం టిడిపిలో చేరుతున్నామన్నారు. పవన్ ప్రజలను యింప్రెస్ చేయగలరు. కానీ బాబు ఎమ్మెల్యేలను యింప్రెస్ చేయగలరు. ఇలాటి రిస్కు రాకూడదంటే జనసేనకు సొంతంగా సింపుల్ మెజారిటీ వచ్చేటన్ని, అనగా 88 సీట్లు రావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమని జనసేన వీరాభిమాని కూడా అనుకోలేడు. మరి జనసేనాధిపతి ఏమనుకుంటున్నారో తెలియదు. తన బలం మాట ఎలా ఉన్నా, తన షరతులకు టిడిపి గత్యంతరం లేక తలొగ్గుతుందని ఆయన అనుకుంటున్నారని మాత్రం అర్థమౌతోంది.
ఇది టిడిపి దుస్థితికి అద్దం పడుతోంది. అన్నీ ఉన్నా, కటింగ్ ఎడ్జ్ లేక గెలుపు గీతకు యివతలగా ఆగిపోతోందని అందరికీ తెలిసిపోయింది. తన గురించి ప్రత్యర్థులకు ఉండే తేలికభావాన్ని భరించవచ్చు. కానీ భాగస్వాములకు కూడా అలాటి భావమే ఉందని తెలిస్తే సహించడం కష్టం. ఇప్పటికే టిడిపి కార్యకర్తల నుంచి ఒత్తిడి వస్తోంది, లోకేశ్‌తో లాభం లేదు, జూనియర్‌ను ఎలాగైనా ఒప్పించి పార్టీలోకి తీసుకురండి అని నాయకులే పబ్లిగ్గా అన్నారు. కనీసం పవన్‌తో చేతులు కలపండి అని క్యాడర్ బహిరంగంగా నాయకుడికి సూచించారు. అప్పుడే బాబు ‘నాకు ఓకేయే కానీ, అతను ఔననటం లేదు ఏం చేయం’ అనే అర్థంలో మాట్లాడారు.
ఇప్పుడు పవన్ ఔనన్నాడు కానీ, పల్లకి తనెక్కుతానంటున్నాడు. ‘ఎక్కినా తప్పేముంది? వైసిపి పీడ వదుల్చుకోవాలంటే, పార్టీ బతకాలంటే మీరు కాస్త వెనక్కి తగ్గాలి. కావాలంటే రొటేషన్ అడగండి’ అని క్యాడర్ చెప్పే ఆస్కారం లేకపోలేదు. ఇది బాబుకి సంకట పరిస్థితే. సంస్థాగతంగా కొన్ని మార్పులు చేసి, ఆయన తన పార్టీ యిమేజిని ఎట్లీస్ట్ క్యాడర్‌లోనైనా పెంచుకోవలసిన అవసరం స్పష్టంగా తెలుస్తోంది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)