ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నుంచి పోటీ చేయాలని తహతహలాడుతున్న తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితకు మళ్లీ కష్టకాలం మొదలైంది. 2014లో అక్కడి నుంచి గెలుపొందిన అనిత ఓ జీవిత కాలానికి గుర్తుండి పోయేలా టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు చేదు జ్ఞాపకాల్ని మిగిల్చారు. ఇప్పుడవే ఆమెను నీడలా వెంటాడుతున్నాయి. అనితకు టికెట్ ఇవ్వొద్దని ఇప్పటికే టీడీపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు అనిత వ్యతిరేకులకు జనసేన తోడైంది. ముఖ్యంగా పాయకరావుపేటలో బలమైన ఓటు బ్యాంక్‌గా ఉన్న కాపులు ఆమెపై రగిలిపోతున్నారు. కాపుల వ్యతిరేకిగా ఆమెను చూస్తున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పెళ్లాడిన అనిత, ఆ తర్వాత కాలంలో వేధించి వెళ్లగొట్టారని కాపుల మనసులో నాటుకుంది. అనితకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని తాజాగా జనసేన నేతల హెచ్చరిక హాట్ టాపిక్‌గా మారింది.
వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో జనసేన నాయకుడు గెడ్డం బుజ్జి మాట్లాడుతూ అనితపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పొత్తులో భాగంగా పాయకరావుపేట టికెట్‌ను జనసేనకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ టీడీపీనే పోటీ చేయాలని భావిస్తే, అనిత అభ్యర్థిత్వాన్ని మార్చాలని ఆయన కోరారు. అనితకే టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని ఆయన హెచ్చరించారు.
అనితను ఓడింంచాలనే కసి వెనుక కారణాలను కూడా ఆయన వివరించారు. 2014 ఎన్నికల్లో అనితను గెలిపించుకునేందుకు జనసేన కృషి చేసిందన్నారు. అనిత గెలిచిన నెలలోపే తనపై అత్యాచా, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించి అరెస్ట్ చేయించాలని విశ్వ ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే పాయకరావుపేట మండలానికి చెందిన కాపు వ్యక్తిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టారని గుర్తు చేశారు. కాపుల వ్యతిరేకి అయిన అనితను ఓడించి తీరుతామనే హెచ్చరికతో అనితకు రానున్న రోజుల్లో అన్ని పార్టీల వారు సినిమా చూపిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పాయకరావుపేటలో అందరినీ మంచి చేసుకోవడం మానేసి, సీఎం జగన్‌పై ఇష్టానుసారం నోరు పారేసుకోవడం ద్వారా, టీడీపీ పెద్దల మనసు చూరగొని రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనిత ఎత్తుగడ వేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో పాయకరావుపేటకు బదులు కొవ్వూరు టికెట్ ఇచ్చారు. ఈ దఫా మరెక్కడ ఆమెకు టికెట్ ఇస్తారో తెలియని పరిస్థితి. ఒకవేళ అనితకు టికెట్ ఇస్తే… వైసీపీ విజయం నల్లేరు మీద నడకే అని అక్కడి పరిస్థితులే చెబుతున్నాయి.