ఏపీకి తెలంగాణ ఓ గుణపాఠం కావాలి

తెలంగాణలో ఇప్పుడున్న జిల్లాల సంఖ్య 33. అందులో 28 జిల్లాలకు జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వోలు) లేరు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. జిల్లాల సంఖ్యను పెంచడమే కాదు, దానికి తగ్గట్టు ప్రణాళికలు కూడా…

తెలంగాణలో ఇప్పుడున్న జిల్లాల సంఖ్య 33. అందులో 28 జిల్లాలకు జిల్లా రెవెన్యూ అధికారులు (డీఆర్వోలు) లేరు. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. జిల్లాల సంఖ్యను పెంచడమే కాదు, దానికి తగ్గట్టు ప్రణాళికలు కూడా ఉండాలి అని చెప్పడానికి. సిబ్బందిని నియమించే అవకాశం లేనప్పుడు జిల్లా సంఖ్య పెంచి ఉపయోగం ఏంటి?

పేరుకి 33 జిల్లాలు అయినా తెలంగాణలో అధికార వికేంద్రీకరణ పూర్తిస్థాయిలో జరగలేదనేది నిర్వివాదాంశం. జిల్లాల సంఖ్య పెంచినా, మండలాలను విభజించ లేదు, విభజించలేకపోయారు కూడా. 

మరి అలాంటప్పుడు కేవలం జిల్లాల విభజనతో ఒరిగేదేంటి..? వీఆర్వో వ్యవస్థను ఏకపక్షంగా రద్దు చేసిన కేసీఆర్ తిరిగి వారిని అధికారికంగా అవే పనులకు ఉపయోగించుకుంటున్నారంటే.. పాలనా వ్యవస్థలో ప్రణాళికలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఇక ఏపీ విషయానికొద్దాం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించాలనేది ప్రభుత్వ ఆలోచన. 25 పార్లమెంట్ నియోజవర్గాల ప్రకారం జిల్లాలను విభజించాలనుకున్న ప్రభుత్వం అరకు ఎంపీ నియోజకవర్గాన్ని మాత్రం రెండుగా విభజిస్తోంది. దీంతో ఏపీలో కూడా త్వరలోనే 26 జిల్లాలు ఏర్పాటవుతాయి. 

జిల్లాల విస్తీర్ణం తగ్గితే అధికార యంత్రాంగం ప్రజలకు దగ్గరవుతుందనేది ప్రభుత్వం ఆలోచన. అయితే పూర్తి స్థాయిలో అది విజయవంతమై, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందితేనే ప్రభుత్వ ప్రయత్నం సఫలమైనట్టు లెక్క.

ఇప్పుడున్నట్టుగానే అప్పుడు కూడా పాలన కొనసాగితే.. జిల్లాల విభజనతో ఉపయోగం లేనట్టే. కేవలం కొత్త కలెక్టరేట్లు పెట్టి, జిల్లా సరిహద్దులు, కేంద్రాన్ని మార్చినంత మాత్రాన పనైపోదు. దానికి తగ్గ కసరత్తు అంతా పూర్తయితేనే ఉపయోగం.

ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలతో ఏపీలో పాలన వికేంద్రీకరణ జరిగింది. ప్రజల వద్దకే ప్రభుత్వ శాఖలు రావడంతో ఇబ్బంది గ్రామాల్లో కూడా ఇబ్బంది లేకుండా పోయింది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకోసం ప్రజలు గ్రామం దాటి వెళ్లాల్సిన అవసరం లేదు. అర్జీలు పట్టుకుని కలెక్టరేట్ల చుట్టూ తిరిగేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది.

అంటే ఒక విధంగా జిల్లాల పునర్విభజన వల్ల కలిగే లాభాలన్నీ ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మరి రేపు జిల్లాలను పెంచితే ఇంతకంటే ఎక్కువ ఉపయోగం ఉంటుందా? కేవలం నెంబర్ లో మాత్రమే తేడా వస్తుందా..? ఈ అంశాలన్నీ బేరీజు వేసుకుని, ముఖ్యంగా తెలంగాణను ఉదాహరణగా తీసుకుని జిల్లాల పెంపుపై ఏపీ ప్రభుత్వం దృష్టిసారిస్తే బాగుంటుంది. హడావిడిగా ముక్కలు ముక్కలు చేస్తే మాత్రం అభాసుపాలు కాక తప్పదు. 

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

ఈ సంక్రాంతి అల్లుడు నేనే