ప్రజలంతా బాగుండాలని తను అనుకున్నట్టుగా అయితే అదే తప్పై పోయినట్టుగా వాపోతున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు! ఎన్నికలైపోయి దాదాపు రెండేళ్లు కావొస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు తన తప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే తను ఏ తప్పూ చేయలేదని, తను చేసినవి తప్పులే అయితే క్షమించాలని అంటూ.. అందరూ బాగుండాలనుకోవడమే తన తప్పై పోయిందంటూ ఓటర్లను నిష్టూరమాడుతున్నారు చంద్రబాబు నాయుడు.
అయితే ఈ నిష్టూరపు కామెడీల్లో కూడా ఆయన అమరావతిని వదలడం లేదు. పోలవరం, అమరావతిలు రాష్ట్రానికి రెండు కళ్లు అని.. వాటికి జగన్ ప్రభుత్వం తూట్లు పొడిచిందంటూ దుమ్మెత్తిపోశారు! పోలవరం సంగతి ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తూ ఉంది.
పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు చేసిన పాపాలు, కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును తన చేతుల్లోకి తీసుకుని.. ఐదేళ్ల పాటు దాన్ని దుంపనాశనం చేయడం.. ఈ ఘనతల గురించి ఎవరికీ తెలియనిది కాదు. తన హాయంలో ఆ పనులను సవ్యంగా చేసి ఉంటే.. ఇప్పుడు వాపోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు కచ్చితంగా వచ్చేది కాదు.
అధికారం ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును పూర్తి చేయక.. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దానికి తూట్లు పొడుస్తోందంటూ చంద్రబాబు నాయుడు కామెడీలు చేస్తున్నారు. పునరావసం ప్యాకేజీ విషయంలో అయితే చంద్రబాబు చేసింది మామూలు దారుణం కాదు. కేంద్రం ముందు నాడు సాగిలా పడటంలో భాగంగా పునరావాసం వ్యవహారాన్ని రాష్ట్రం నెత్తి మీదకు తెచ్చిన ఘనత చంద్రబాబుదే.
ఆ సంగతలా ఉంటే.. ఇంకా అమరావతి అంటూ చంద్రబాబు నాయుడు పాకులాడుతున్నారు. అమరావతి అందరిదీ అని ఆయన చెబుతున్నారు. ఆ ఫీలింగ్ రాష్ట్రంలోని ఏ మూల కూడా లేదు. అది సుస్పష్టమవుతున్న విషయం. ఏడాది కాలం గడిచినా అమరావతి ఆందోళనలు మూడు గ్రామాలను దాటలేదు!
స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రతి జిల్లాకూ వెళ్లి అక్కడ అమరావతి సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేశారు. జోలెపట్టి అడుక్కుతింటూ.. అమరావతి అంటూ మాట్లాడారు. అయితే వచ్చిన స్పందన శూన్యం!
ఆఖరికి ఆ మూడు గ్రామాల్లో కూడా ఆందోళనలు సద్దుమణిగిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇంకా చంద్రబాబు నాయుడు.. అమరావతి, అందరిదీ.. అంటూ మాట్లాడటం ఆయన భ్రమలను బాహాటపరుస్తూ ఉంది. అమరావతిని పట్టుకుని ఇంకో రానున్న మూడేళ్ల పాటు పోరాడినా.. ఆ మూడు గ్రామాల ఆవల అదెలాంటి ఫలితాన్నీ ఇవ్వదు.
అమరావతి గురించి మాట్లాడిన ప్రతిసారీ చంద్రబాబు నాయుడు కేవలం తన బ్యాచ్ రియలెస్టేట్ ప్రయోజనాలను గుర్తు చేస్తున్నారు తప్ప మరోటి కాదు. ఇక పోలవరం ప్రాజెక్టు లో చంద్రబాబు డొల్లతనం బయటపడుతూనే ఉంది. అయినా.. ఇంకా రెండు అంశాలను పట్టుకుని చంద్రబాబు నాయుడు అరివీర ప్రసంగాలు చేస్తూ ఉండటం, సానుభూతిని కోరుతూ ఉండం, తనేం తప్పులే చేయలేదన్నట్టుగా మాట్లాడుతూ ఉండటం గమనార్హం.