ఏపీలో రాజకీయాలు మద్యం బాటిళ్లు, బ్రాండ్ల చుట్టూ తిరుగుతున్నయి. జె-బ్రాండ్ అంటూ టీడీపీ రచ్చ చేస్తుంటే.. దానికి కౌంటర్ గా వైసీపీ నేతలు బి-బ్రాండ్ (బాబు బ్రాండ్) అని సాక్ష్యాధారాలు చూపిస్తున్నారు. బూమ్ బూమ్ బీరు, ప్రెసిడెంట్ మెడల్ వంటి పేర్లన్నీ బాబు హయాంలో పురుడు పోసుకొన్నాయని విమర్శిస్తున్నారు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. చంద్రబాబుకి మద్యమహా చక్రవర్తి.. మద్య మహా సామ్రాట్.. అనే బిరుదులిచ్చేశారు.
అనుమతులన్నీ అప్పుడే..
స్పెషల్ స్టేటస్ తీసుకురాలేని వైసీపీ ప్రభుత్వం ఆ పేరుతో మందుబాటిళ్లు తీసుకొచ్చిందని, ప్రెసిడెంట్ మెడల్ అనే పేరుతో కూడా మందు పంపిణీ చేస్తోందనేది టీడీపీ వాదన. కానీ వైసీపీ నేతలు సాక్ష్యాధారాలతో సహా ఆ ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. 2019 తర్వాత కొత్తగా ఒక్క డిస్టిలరీకి గానీ, బ్రూవరీకి గానీ వైసీపీ ప్రభుత్వం అనుమతివ్వలేదని అంటున్నారు కొలుసు పార్థసారథి.
ప్రెసిడెంట్ మెడల్ అనే బ్రాండ్ కి 2018 ఫిబ్రవరి-6న అనుమతి వచ్చిందట. గవర్నర్స్ రిజర్వ్ అనే బ్రాండ్ కి 2018 నవంబర్ 5న అనుమతిచ్చారట. బూమ్ బూమ్ బీరు కి 2019 మే 14న అనుమతిచ్చారట. కానీ ఇవన్నీ వైసీపీ హయాంలో వచ్చినట్టు టీడీపీ ప్రచారం చేస్తోంది. ఇవన్నీ చంద్రబాబు హయాంలోనే వచ్చాయని అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.
జంగారెడ్డిగూడెం ఇష్యూ తర్వాత ఈ బ్రాండ్ల రాజకీయం మరింత ఎక్కువైంది. చీప్ లిక్కర్ తో జనాల్ని చంపేస్తున్నారంటూ టీడీపీ రాజకీయం మొదలు పెట్టింది. కానీ ఆ చీప్ వ్యవహారమంతా టీడీపీ హయాంలోనే మొదలైందనే విషయాన్ని మాత్రం దాచిపెడుతోంది. ఇక ఆ ఉత్పత్తులను తయారు చేస్తున్న కంపెనీలు కూడా టీడీపీకి చెందినవారివే కావడం విశేషం.
విశాఖ డిస్టిలరీస్ అయ్యన్నపాత్రుడిది, పీఎంకే డిస్టిలరీస్ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడిది, శ్రీ కృష్ణా డిస్టిలరీస్ ఆదికేశవుల నాయుడిది. ఎస్పీవై డిస్టిలరీస్ ఎస్పీవై రెడ్డికి చెందినది. మరి వీరంతా టీడీపీవారైనప్పుడు.. ఆ బ్రాండ్లకు వైసీపీతో సంబంధం ఏముంటుంది.
వీటిని తయారు చేస్తోంది ఇడుపులపాయలోనా.. లేక చంద్రబాబు ముడుపులపాయలోనా అంటూ సూటిగా ప్రశ్నించారు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి. మద్యం బ్రాండ్లతో మరీ దిగజారుడు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారాయన. గోబెల్స్ ప్రచారాన్ని తిప్పికొడతామని చెప్పారు.