రాష్ట్రవ్యాప్తంగా 2019లో వైసీపీ విజయ దుందుభి మోగించింది. కానీ కొన్ని జిల్లాల్లో మాత్రం టీడీపీ గట్టి పోటీనిచ్చింది. విశాఖ నాలుగు దిక్కులు టీడీపీ కైవసం చేసుకోవడం విశేషమేనని చెప్పాలి. కానీ ఇప్పటికే ఆ దిక్కుల్లో ఒకటి వైసీపీ వైపు వచ్చేసింది. ఇక శ్రీకాకుళం విషయానికొస్తే.. జిల్లాలో రెండు ఎమ్మెల్యే సీట్లు టీడీపీకి దక్కాయి. ఇచ్చాపురం, టెక్కలి నియోజకవర్గాలతోపాటు.. ఎంపీ నియోజకవర్గం కూడా టీడీపీ ఖాతాలోనే ఉంది.
ఇలాంటి చోట వైసీపీ గట్టి వ్యూహాలతో మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ ఎన్నికలైన మూడేళ్ల తర్వాత కూడా వైసీపీ ఇంకా శ్రీకాకుళంలో ఇబ్బంది పడుతూనే ఉంది. ముఖ్యంగా వైరి వర్గం బలంగా ఉన్న స్థానాలతోపాటు.. వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల్లో కూడా అంతర్గత కుమ్ములాటలు పార్టీని కలవరపెడుతున్నాయి.
మూడు నియోజక వర్గాల్లో గ్రూపులు
శ్రీకాకులం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో వైసీపీలో గ్రూపుల గోల పెరిగిపోయిందని తెలుస్తోంది. మిగతా చోట్ల కూడా నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉన్నా ముఖ్యంగా మూడు నియోజకవర్గాల్లో ఆ గొడవ మరింత ముదిరింది.
అధినాయకత్వానికి విధేయులుగా ఉంటామని చెబుతూనే.. ఎమ్మెల్యేల తీరుపై మండిపడుతున్నారు అసంతృప్త నేతలు. తమ వర్గాన్ని తాము కాపాడుకుంటున్నారు.
ఎచ్చెర్లలో ఇలా..
ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పై కేడర్ లో అసంతృప్తి ఉంది. ఎచ్చెర్ల, లావేరు, జి.సిగడం, రణస్థలం మండలాలకు చెందిన నేతలు కిరణ్ కు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. వీరంతా ఇప్పటికే పలుమార్లు రహస్యంగా సమావేశమయ్యారు.
జగన్ కి జై.. అంటూనే కిరణ్ కి నై అంటున్నారు వీరంతా. వచ్చే దఫా కిరణ్ కి టికెట్ ఇస్తే తామంతా సహాయ నిరాకరణ చేస్తామని ఇప్పట్నుంచే అదిష్టానానికి హెచ్చరికలు పంపిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడినవారిని కాదని, అవకాశవాదులను కిరణ్ దగ్గరకు తీస్తున్నారనేది వారి వాదన. కిరణ్ వ్యవహార శైలితో కార్యకర్తలు దూరమవుతున్నారని అంటున్నారు.
తమ్మినేనిపై రుసరుసలు..
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో అసంతృప్తుల గోల మరీ ఎక్కువైంది. ఆయన మంత్రి పదవి కోసం ప్రయత్నించారు కానీ అది సాధ్యమయ్యేలా లేదు. ఈసారి స్పీకర్ పదవి ఉంటుందో లేదో కూడా డౌటే. ఆముదాలవలసలో స్పీకర్ తమ్మినేనికి వ్యతిరేకంగా కోట గోవిందరావు బ్రదర్స్ ధిక్కార స్వరం వినిపిస్తున్నారు.
తమ్మినేని పాల్గొనే కార్యక్రమాలకు వారు దూరం. తమ సొంత కార్యక్రమాలలో తమ్మినేని ఫొటో లేకుండా వారు జాగ్రత్తపడుతున్నారు. ఆముదాలవలస, పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి మండలాల్లో కూడా ద్వితీయ శ్రేణి నేతలు తమ్మినేని వ్యవహారంపై గుర్రుగా ఉన్నారట. వచ్చే దఫా ఆయనకు టికెట్ దక్కకుండా ఉండేందుకు వీరంతా వ్యూహాలు పన్నుతున్నారట.
టెక్కలిలో అచ్చెన్నకు లాభం చేకూర్చేలా..
టెక్కలిలో అచ్చెన్నాయుడికి చెక్ పెట్టేలా వ్యూహాలు రచించాల్సిన వైసీపీ నేతలు, తమలో తాము కుమ్ములాడుకుంటున్నారు. పేరాడ తిలక్, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ మంత్రి కిల్లి కృపారాణి మధ్య అక్కడ గొడవ ముదురుతోంది. ఆధిపత్యం కోసం వేరు వేస్తున్న ఎత్తులు, పై ఎత్తుల్లో కేడర్ చిత్తవుతున్నారు. టెక్కలిలో వైసీపీ కేడర్ కి దిక్సూచి లేకుండా పోయింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికిస్తారో తెలియకపోవడంతో మూడు వర్గాలు అక్కడ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి.
మొత్తమ్మీద శ్రీకాకుళం జిల్లాలో మూడు నియోజకవర్గాలు వైసీపీకి బరువుగా మారాయి. నెల్లూరు జిల్లాలో లుకలుకలు, ప్రకాశం జిల్లాలో అలకలు, నగరిలో పంచాయతీలు హైలెట్ అయినంతగా రాష్ట్రం చివర్న ఉన్న శ్రీకాకుళం గోల హైలెట్ అవ్వడం లేదు. అంతే తేడా.