వకీల్ సాబ్ సినిమా విడుదలకు కాస్త అటూ ఇటూ జనం ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వకీల్ సాబ్ ప్రశ్నిస్తున్నట్టుగా చెప్పుకున్నాడు! తనను తాను వకీల్ సాబ్ గా అభివర్ణించుకున్నాడు!
ఈ మధ్యనే కాకినాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతను ప్రశ్నిస్తూ తనను తాను భీమ్లా నాయక్ గా అభివర్ణించుకున్నాడు! వెనుకటికి ఎవరో నాయక్ సదరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతకు బుద్ధి చెప్పాడని, ఇప్పుడు తను భీమ్లా నాయక్ .. అంటూ పవన్ కల్యాణ్ చెప్పుకున్నాడు!
ఈ మాటలు వింటే.. ఎవరైనా నవ్వుకుంటారనే కనీస ఇంగితం పవన్ కల్యాణ్ కు లేకపోవడమే ఇక్కడ అసలైన విషయం. తను ఏ సినిమా చేస్తుంటే, ఆ వేషం వేసుకుని రాజకీయంలో జీవించేస్తానంటూ పవన్ కల్యాణ్ ప్రగల్భాలు కామెడీ గాక మరేంటి?
వకీల్ సాబ్ వచ్చినప్పుడేమో తనను తాను వకీల్ సాబ్ గా చెప్పుకున్నాడు. భీమ్లానాయక్ థియేటర్లలో ఉండగా భీమ్లా నాయక్ వచ్చాడని డప్పు కొట్టుకుంటున్నాడు. మరి త్వరలో పవన్ కల్యాణ్ సినిమాలు మరిన్ని రాబోలున్నాయి. హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్.. అంటూ ఏవేవో పవన్ సినిమా టైటిళ్లు వినిపిస్తున్నాయి. బహుశా మళ్లీ తిరిగి జనం మధ్యకు వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ ఆ సినిమాల్లో తను ధరించే పాత్రల పేర్లతో రాజకీయ ప్రసంగాలు చేస్తారేమో!
ఇదంతా చూస్తుంటే.. లీలామహల్ సెంటర్ అనే సినిమాలో ధర్మవరపు సుబ్రమణ్యం పాత్రతో చేయించిన కామెడీ గుర్తుకు రావొచ్చు. థియేటర్ మేనేజర్ అయిన ధర్మవరపు.. తన థియేటర్లో ఏ సినిమా ఆడుతుంటే ఆ పాత్ర గెటప్ లో, ఆ పాత్ర హావభావాలతో, ఆ పాత్ర తరహాలో వ్యవహరిస్తూ ఉంటాడు.
ఆ సినిమా ఫట్ అయినా, అందులో ధర్మవరపు కామెడీ బాగా హిట్ అయ్యింది. మరి థియేటర్ మేనేజర్ అలా చేస్తేనే అది కామెడీ అయ్యింది. మరి తను సినిమాల్లో ఏ పాత్ర చేస్తుంటే, బయట తను అదే పాత్రను అంటూ చెప్పుకునే నటుడిని ఏమనాలో!