బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, పాకిస్తానీ మాజీ మిలటరీ నియంత ముషారఫ్ లు ఒక ఫొటోలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై నెటిజన్లు తలా ఒక తీర్పు ఇస్తున్నారు. సోషల్ మీడియా విస్తృతం అయ్యాకా పెద్ద విషాదం ఏమిటంటే.. ఏ పుర్రెలో పుట్టిన బుద్ధి కూడా అందరి మనసుల్లోకీ చొప్పించబడటం!
ముషారఫ్, దత్ ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో .. ఆ హీరోని దేశద్రోహిగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వరదలా వచ్చి పడుతున్నాయి! ప్రత్యేకించి ఇది దేశభక్తి సీజన్. ఎందుకు, ఏమిటి, ఎలా.. అనే అంశాలు ఎవరికీ అవసరం లేదు. ఎవడికివాడు జడ్జిమెంట్ ఇచ్చి పడేస్తాడు. ఈ విషయంలో భక్తుల సంగతి సరేసరి!
ఎక్కడో యూఏఈలో సంజయ్ దత్ కు ముషారఫ్ తారసపడ్డాడు. అది కూడా సదరు పాక్ మాజీ పాలకుడు వీల్ చైర్ కు పరిమితం అయ్యాడు. వీరిద్దరూ ఎదురుపడగా.. బహుశా పలకరించుకుని ఉండవచ్చు. వాస్తవానికి ముషారఫ్ ఎప్పుడో పాక్ వదిలి పరార్ అయ్యాడు. ఇండియాపై ఎన్నో కుట్రలు చేసినవాడే కానీ, పాక్ సైన్యం ముషారఫ్ ను తరిమేసింది. పాక్ లో ఇతడిపై బోలెడన్ని శిక్షలు కూడా ప్రకటించబడిఉన్నట్టున్నాయి. వీల్ చైర్ కు పరిమితం అయ్యాయడంటే.. అతడి ఆరోగ్య పరిస్థితీ స్పష్టం అవుతోంది.
అలాంటి ముషారఫ్ ఎదురుపడితే దత్ పలకరించాడో, దత్ ను చూసి ముషారఫ్ పలకరించాడో ఎవరికీ తెలియదు. ఒక ఫొటోలో కనిపించారు కాబట్టి.. దేశద్రోహి అంతే! సోషల్ మీడియాకు అంతకు మించి వేరే అవసరం లేదు!
అయినా ఇదే ముషారఫ్ కార్గిల్ యుద్ధం తర్వాత ఇండియాకు వస్తే.. ఆగ్రా శిఖరాగ్ర చర్చలు అంటూ.. రెడ్ కార్పెట్ వేసింది నాడు దేశాన్ని ఏలుతున్న బీజేపీ ప్రభుత్వమే, అంటే భారత ప్రభుత్వమే! ఆ మధ్య పాక్ అధ్యక్షుడిగానో, ప్రధానిగా ఉండిన నవాజ్ షరీఫ్ ఇంటికి మన ప్రధాని డైరెక్టుగా విమానం వేసుకు వెళ్లారు! అలాంటివి జరిగితే.. స్నేహపూర్వకం. సామరస్యం! అదే ఎవరో ఒక బాలీవుడ్ హీరో, పరారీలో ఉన్న పాక్ పాలకుడు ఎదురుపడితే.. అది దేశద్రోహం! ఈ తీర్పే నయా దేశభక్తి!