‘భయో’ డేటా: ‘పంచాయత్‌’ కల్యాణ్‌!

నా పేరు:  పవన్‌ కల్యాణ్‌ Advertisement దరఖాస్తు చేయు ఉద్యోగం: 'వోటర్ల సేనాని' ( డౌటొస్తుంది. రావాలనే అంటున్నాను. 'జనసేనాని'గానే 2019 ఎన్నికలకు వెళ్ళాను. జనం పోటెత్తారు, కానీ 'వోటె'త్తలేదు. దాంతో నే పోటీ…

నా పేరు:  పవన్‌ కల్యాణ్‌

దరఖాస్తు చేయు ఉద్యోగం: 'వోటర్ల సేనాని' ( డౌటొస్తుంది. రావాలనే అంటున్నాను. 'జనసేనాని'గానే 2019 ఎన్నికలకు వెళ్ళాను. జనం పోటెత్తారు, కానీ 'వోటె'త్తలేదు. దాంతో నే పోటీ చేసిన రెండు సీట్లూ పోయాయి. అందుకే ఈ సారి నన్ను 'వోటర్ల సేనాని'గా చూడమంటున్నాను. 

వయసు: సినిమాకా.. రాజకీయానికా.. ? మొదటి దానికి ఎక్కువ. రెండవ దానికి తక్కువ.. అంటే 'భీమ్లా'కి ఎక్కువ, 'నాయక్‌'కు తక్కువ.  నేను పొత్తు పెట్టుకున్న పార్టీల నేతలతో పోల్చుకుని మాట్లాడుతున్నాను. 

ముద్దు పేర్లు: 'పంచాయత్‌' కల్యాణ్‌. ( అంటే అసెంబ్లీ కల్యాణ్‌ కాదని కాదు కానీ, అసెంబ్లీలో గెలిచింది ఒక్కసీటే లెండి. మరి? పంచాయితీ ఎన్నికలు చూడండి. 1,209 సర్పంచ్‌ లు గెలిచాం. పంచాయితీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద గెలవవు కదా, అని అడక్కండి. ఆ విషయం మాకూ తెలుసు. 

విద్యార్హతలు:  స్మ ృతీ ఇరానీ మేడమ్‌ నీ, మోడీజీనీ, నన్నూ ఈ ప్రశ్న అడుగుతారేమిటి? మేం ప్రపంచాన్ని చదువుతాం. మా దగ్గరకొచ్చి కాలేజీ, యూనివర్శిటీల గురించి అడుగుతారా? 

విలాసం: అదేగా నా ప్రోబ్లెమ్‌? చాలా దూరం వచ్చేశాను. పార్టీ పెట్టి తొమ్మిదేళ్ళయిపోయింది. నేనెక్కడున్నాను? ఎటు పోవాలి? ఎవరినెక్కడ కొట్టాలి?  నాకు మ్యాప్‌ కావాలి.. రోడ్‌ మ్యాప్‌ కావాలి..  అని బీజేపీనడిగాను.. ఇంకా రాలేదు.. అదే 'గూగుల్‌' ని అడిగి వుంటే… ఈ పాటికి వచ్చేది..!

గుర్తింపు చిహ్నాలు: ఒకటి: పొత్తులు. ఇవి లేకుండా ఇంతవరకూ లేను. ముందు 'బీఎస్‌పీ' తో, ఇప్పుడు 'బీ జే పీ'తో.. 'ఎస్‌'పోయి, 'జె' వచ్చింది. ఎక్కడ వున్నా 'బీపీ' మాత్రం కామన్‌. అది నాకు మిగులుతోంది. 

రెండు: అన్ని మతాలూ సమానమే.. కాకుంటే బీజేపీతో పొత్తులో వున్నాను. ఎన్నికలప్పుడు మాత్రం ఒక మతం ఎక్కువ సమానంగా కనిపిస్తుంది. తప్పదు. 

సిధ్ధాంతం: ఓటమిలో గెలుపును చూడటం. ఎన్నికల్లో ఒక్క సీటుతో పోవటం వేరు, ఒక్క సీటే రావటం వేరు. ఒక్క సారి కూడా ముఖ్యమంత్రి చెయ్యని నా పార్టీకి ఒక్క వోటే వచ్చింది. నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన బెహన్‌జీ పార్టీకీ యూపీలో ఒక్క సీటే వచ్చింది. ధైర్యం వచ్చేసింది. ఇక ఆగేది లేదు. 

వృత్తి: మార్పు. మార్పు అంటే మార్చటం అనుకుంటారు. కాదు. మారటం. టైమిస్తాం. వ్యాపారంలోనైనా, జీవితంలోనైనా, రాజకీయాల్లోనైనా.. పార్టనర్‌ మారకపోతే.. మనమే మారిపోతాం.

హాబీలు: 1. మాట్లాడటం. ఈలలు వేస్తారని కొందరు మాట్లాడతారు. మాట్లాడి ఈలలు వేయించుకుంటారు. మనమలాక్కాదు.. ఈలలు వేశాకే మాట్లాడతారు.. వచ్చేది ఫ్యాన్స్‌ అక్కడ..

2. ప్రేక్షకుల్ని కార్యకర్తలుగా, కార్యకర్తల్ని ప్రేక్షకులుగా మార్చుకోవటం. ఇప్పుడు చూడండి. జనసేన కార్యకర్తలు అయుదు లక్షలు దాటారు. మన సినిమాలు ఫ్లాప్‌ అయ్యే ముచ్చలే లేదు. 

అనుభవం: ఎంత రాజకీయ వేదిక ఎక్కినా సినిమాయే నన్ను వెంటాడుతుంది.. లేక పోతే రాజకీయోపన్యాసం మధ్యలో 'బంతీ.. చామంతీ..' ఎందుకు గుర్తొస్తుంది? రేపు నా మీద కౌంటర్‌ వెయ్యటానికి 'మే నాయక్‌ నహీ…' రేపెవరన్నా అని అంతే పాత సినిమా పాట పాడతరేమో. చూడాలి. 

మిత్రులు: ఉండేది వాళ్ళే. థియేటర్ల ముందయితే 'అభిమానులు' అంటాం. వెలుపల అయితే 'కార్యకర్తలు' అంటాం.

శత్రువులు: నా స్పీచెస్‌ వినలేదా.. ప్రతీ పార్టీ నేతకూ నమస్కారంతో మొదలు పెడతాను. అయినా నన్ను శత్రువుగా చూసేవాళ్ళుండాలి కదా? 

మిత్రశత్రువులు: 'మూడు లడ్డూలంటే' కొందరు నొచ్చుకుని శత్రువులయ్యారు. ఇప్పుడు రోడ్‌ మ్యాప్‌ అడిగినందుకు నొచ్చుకున్నారనుకోండి. చేసేది లేదు.

జీవిత ధ్యేయం: 'లెఫ్ట్‌'. 'రైట్‌'.. మార్చింగ్‌ అని కాదు. పార్టీల్లో 'కుడీ' 'ఎడమ' వుంటాయి. వాటిని పాటించకుండా ముందుకు సాగిపోవటం.

సర్‌