బహిరంగసభలు నిర్వహించడంలో నాయకులకు కొన్ని షార్ట్ కట్ మార్గాలుంటాయి. తమకు నిజంగా ప్రజాబలం ఉంది, జనం వెల్లువలా తమ సభలకు వస్తారని అనుకున్నప్పుడు.. పెద్దపెద్ద మైదానాల్లో సభను నిర్వహిస్తారు. అలాకాకుండా.. లేని బలాన్ని ఉన్నట్టుగా చూపించుకోవాలనే ఆత్రుత ఉన్నప్పుడు.. పట్టణాల మధ్యలో ఇరుకు రోడ్ల కూడళ్లలో సభలు నిర్వహించడం. దానివల్ల.. సభకు చాలా పరిమితంగా జనం వచ్చినా కూడా.. చాలా ఎక్కువ మంది వచ్చినట్టుగా కనిపిస్తుంది.
ఇలాంటి వక్రమైన తెలివితేటలు చంద్రబాబునాయుడు సభల్లో చాలా పుష్కలంగా కనిపిస్తుంటాయి. ఆయన ఇరుకు రోడ్లను, ఇరుకైన కూడళ్లను సభావేదికలుగా ఎంచుకుంటూ.. ఆ ఇరుకు రోడ్లలో కూడా సగం ఫ్లెక్సిలకు, కటౌట్ లకు పోగా.. మరింత ఇరుకుగా మారిపోయిన రోడ్లలో గుమికూడినంత మంది జనాన్నే.. డ్రోన్ షాట్ల ద్వారా.. బీభత్సమైన జనం రద్దీ వచ్చినట్టుగా ప్రొజెక్టు చేసుకుంటూ డ్రామాను పండించడం చంద్రబాబుకు చెల్లిన విద్య.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఇప్పుడు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహిస్తున్న సభ కూడా అలాగే అనిపిస్తోంది. జెపి నడ్డా.. చంద్రబాబునాయుడు తెలివితేటలను అచ్చంగా కాపీ కొడుతున్నట్టుగా కనిపిస్తోంది.
శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం అనే రోడ్డు కూడలి వద్ద జెపి నడ్డా సభను ఏర్పాటుచేశారు. ఏకకాలంలో రోడ్డు మీద రెండు వాహనాలు ఎదురెదురు వెళ్లడానికి కూడా ఇబ్బంది పడేంత ఇరుకైన రోడ్డు అది. పట్టణం పెరిగే కొద్దీ మరింత ఇరుకైపోతూ వచ్చింది. భారీ బహిరంగ సభ ఇక్కడ నిర్వహించడం అనేది కలలో మాట.
ఇది ఎంతటి పరిమితమైన వేదిక అంటే, స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఇదే రోడ్డులో భారీ వేదిక ఏర్పాటుచేసి ఇటీవలే తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. దాదాపు లక్షమందికి ఊరంతా విందుభోజనాలు ఏర్పాటు చేసి మరీ బర్త్ డే చేసుకున్నారు. ఒక ఎమ్మెల్యే బర్త్ డే చేసుకున్న వేదిక ప్రాంతంలోనే.. దేశాన్ని ఏలుతున్న అధికార పార్టీకి అధ్యక్షుడు బహిరంగ సభ నిర్వహిస్తూ.. దానిని భారీ సభగా అభివర్ణించుకోవడం కామెడీ ఉంది.
ఇరుకు రోడ్లలో సభలు నిర్వహించి, చాలా పెద్ద సభ జరిగినట్లుగా బిల్డప్ ఇచ్చుకోవడం అనే విద్యను జెపి నడ్డా చంద్రబాబునాయుడు నుంచి నేర్చుకున్నారేమో అని ప్రజలు అనుకుంటున్నారు. ఇటీవల ఆయన చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత.. ఏపీలో తెదేపా- జనసేన కూటమితో భాజపా కూడా కలిసే పోటీచేయవచ్చుననే ప్రచారం జరుగుతున్న వేళ.. చంద్రబాబు బుద్ధులు నడ్డాకు కూడా అంటుకున్నాయేమో అని జనం సెటైర్లు వేసుకుంటున్నారు
10వ తేదీన శ్రీకాళహస్తిలో నడ్డా, 11వ తేదీన విశాఖలో అమిత్ షా.. ఉత్తుత్తినే సభలు నిర్వహించడం కాదు, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని తమ కేంద్ర సర్కారు వంచించలేదని వారు ప్రజల ఎదుట నిరూపించుకోవాలి. ఈ రాష్ట్రానికి ప్రత్యేకంగా తాము ఏం మేలు చేశామో వారు ప్రజలకు చెప్పగలగాలి. లేకపోతే ఎప్పటికీ ఉపయోగం ఉండదు.