అనర్హత వేటు పడితే.. ఆ ఇద్దరికీ దబిడిదిబిడే!

ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయి.. తెలుగుదేశానికి దగ్గరగా మెలగుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు కూడా పడనుందా? నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి…

ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయి.. తెలుగుదేశానికి దగ్గరగా మెలగుతున్న నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు కూడా పడనుందా? నెల్లూరు జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. వీరిలో కనీసం ఇద్దరి మీద ఇప్పుడు అనర్హత వేటు పడే పరిస్థితి కనిపిస్తోంది. అదే జరిగితే, పరిణామాలు ఎలా ఉంటాయి. వారిని అసలు పట్టించుకోకుండా వదిలేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనర్హత వేటు వేయించేలా చర్యలు తీసుకుంటారా? లాంటి రకరకాల ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నాయి.

నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముగ్గురూ శాసనసభ ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశానికి అనుకూలంగా ఓటు వేశారనే ఆరోపణలపై సస్పెన్షన్ కు గురయ్యారు. మేకపాటిని మినహాయిస్తే మిగిలిన ఇద్దరూ తెలుగుదేశానికి సన్నిహితంగా మెలగుతున్నారు. మేకపాటి మాత్రం రాబోయే ఎన్నికల్లో అసలు పోటీచేసే ఉద్దేశమే లేదని వైరాగ్యం ప్రకటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లతో తెలుగుదేశం నాయకులు మాజీ మంత్రులు శనివారం నాడు నెల్లూరులో భేటీ కావడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ఇద్దరు నాయకులూ ఇప్పటిదాకా అనర్హత వేటు భయంతో.. తెలుగుదేశం కండువా పైన వేసుకోకుండా అంతా తెరవెనుక రాజకీయం నడిపిస్తున్నారు. శ్రీధర్ రెడ్డి తమ్ముడు తెలుగుదేశంలో చేరారు గానీ, ఆయన అధికారికంగా కండువా కప్పుకోలేదు. తాజాగా ఆనం తెలుగుదేశం కార్యాలయానికి కూడా వెళ్లి సీనియర్ నాయకులతో భేటీ కావడం అనేది ప్రాధాన్యం సంతరించుకుంటోంది.

యువగళం పేరుతో నారా లోకేష్ సాగిస్తున్న పాదయాత్ర 12వ తేదీన నెల్లూరుజిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఆ సమయానికి ఆనం, కోటంరెడ్డి ఇద్దరూ పార్టీలోకి వచ్చేలా టీడీపీ ప్లాన్ చేస్తోంది. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. అప్పటినుంచి ఇప్పటిదాకా వారు పెంచుకున్న బలం కూడా ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు కూడా పాదయాత్రలో పాల్గొనేలా చూస్తే.. కాస్త జనసమీకరణ సులువు అవుతుందనేది టీడీపీ ఆశ. 

అయితే పార్టీలో చేరినట్టుగా సభ్యత్వ నమోదులు జరగకపోయినప్పటికీ.. వారు పాదయాత్రలో లోకేష్ వెంట పాల్గొనే అవకాశం ఉంది. పార్టీ కండువా కప్పుకున్నా, పార్టీ జెండా పట్టుకున్నా, పాదయాత్రలో పాల్గొన్నా కూడా కొత్త ఇబ్బంది వచ్చే ప్రమాదమూ ఉంది. ఆ ఫోటలతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారి మీద చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ పార్టీ శాసనసభ స్పీకరుకు ఫిర్యాదు చేయవచ్చు. అదే జరిగితే వారు ఎమ్మెల్యే హోదా కొన్ని వారాల వ్యవధిలోనే కోల్పోయే అవకాశం ఉంది.

అలాంటప్పుడు ఆ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయా? లేదా? అనేది కొత్త చర్చ. ఉప ఎన్నిక వస్తే ఆ ఇద్దరు నాయకులకూ ప్రమాదమే. ఆనం విషయంలో ఆయన వెంకటగిరి నుంచి మళ్లీ పోటీచేసే అవకాశమే ఉండదు. ఆయన 2024 ఎన్నికల్లో ఉదయగిరి నుంచి పోటీచేయడానికి సిద్ధం అవుతున్నారు. 

కోటంరెడ్డి ఉప ఎన్నికను ఎదుర్కొని, మళ్లీ 2024 ఎన్నికలకు సిద్ధం కావడం అనేది ఆయనకు భారం అవుతుంది. ఆ ఇద్దరి మీద అనర్హత వేటు వేసినా సరే.. సార్వత్రిక ఎన్నికలు సమీపంలోనే ఉన్నాయి గనుక ఉపఎన్నికలు రావు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే.. ఆ సీట్ల ఖాళీలను ఏపీ అసెంబ్లీ స్పీకరు నోటిఫై చేస్తే గనుక.. ఈసీ ఆరునెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. బహుశా తెలంగాణలో జరిగే ఎన్నికల సమయానికి అదే తేదీలకు ఉప ఎన్నికలు రావొచ్చు.

అన్ని ఇబ్బందులు ముంచుకు రాకుండా.. ఈ ఇద్దరు నాయకులు స్వయంగా పాదయాత్రలో పాల్గొనకుండా తమ అనుచరులను పంపే మార్గం ఒకటి ఉంటుంది. కానీ అది వారిలోని పిరికి తనానికి నిదర్శనంగా విమర్శలు వస్తాయి. మరి రంజుగా సాగుతున్న నెల్లూరు రాజకీయాల్లో పరిణామాలు ఎలా ఉంటాయో వేచిచూడాలి.