ఇప్పటికే పాదయాత్రతో రాయలసీమను దాటేస్తున్నాడు నారా లోకేష్. ఇప్పటికే లోకేష్ పాదయాత్ర ప్రారంభమై వంద రోజులు కూడా గడిచిపోయినట్టుగా ఉన్నాయి. భారీ ఎత్తున కాకపోయినా.. తెలుగుదేశం కార్యకర్తల వరకూ లోకేష్ పాదయాత్ర పట్ల కొంత వరకూ స్పందన కనిపిస్తూ ఉంది. అయితే లోకేష్ పాదయాత్ర కు అనంతపురం వంటి చోట వచ్చిన స్పందన అంతంత మాత్రం కావడం టీడీపీ శ్రేణులను కూడా ఖిన్నులను చేస్తోంది. జనస్పందన సంగతలా ఉంటే.. ఎందుకో లోకేష్ పాదయాత్రను ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు పెద్దగా పట్టించుకుంటున్నట్టుగా లేదు!
లోకేష్ పాదయాత్ర కోసం పవన్ కల్యాణ్ ను ఇన్నాళ్ల పాటు ఆపడం అయితే చంద్రబాబు చేతిలో పనే కావొచ్చు. ఒకేసారి సొంత పుత్రుడు, దత్తపుత్రుడు యాత్రలకు వెళితే ప్రచారం తగ్గిపోతుందనే లెక్కలు చంద్రబాబువి కావొచ్చు. ఎవడ్రా మనల్ని ఆపేది అని ప్రశ్నించిన పవన్ కల్యాణ్ కు చంద్రబాబు ఆదేశాల రూపంలో సమాధానం కూడా దొరికీ ఉండవచ్చు!
అయితే.. లోకేష్ కష్టాన్ని చంద్రబాబు గుర్తించడం మాత్రం జరగడం లేదు. లోకేష్ పాదయాత్ర కు చంద్రబాబు వద్దన్నాడంటూ ఆదిలోనే ప్రచారం జరిగింది. జనం మధ్యకు వెళితే లోకేష్ మరింతగా అబాసుపాలవుతాడనేది చంద్రబాబు ఆలోచన కావొచ్చు. మరి ఆ వ్యతిరేకత అలాగే కొనసాగుతున్నట్టుగా ఉంది చంద్రబాబులో!
పాదయాత్ర విషయంలో లోకేష్ ను చంద్రబాబు ఇప్పటి మనస్ఫూర్తిగా మెచ్చుకున్నది కానీ, పుత్రోత్సాహాన్ని చాటుకున్నది కానీ లేదు! లోకేష్ తన పాట్లేవో తను పడుతున్నాడు. కడప జిల్లాలో ఆయన ప్రసంగాలు కూడా అంతే పేలవంగా సాగుతున్నాయి. త్రివేణి సంగమం అని కూడా పలకలేక లోకేష్ ఏదో నోటికొచ్చినట్టుగా చెప్పుకుపోయారు.
ఇంకోసారైతే జగనన్న పథకం అంటూ చెప్పాడు! చంద్రన్న పథకం అంటూ తెలుగుదేశం మెనిఫెస్టో హామీని జగనన్న పథకం అంటూ లోకేష్ చెప్పాడు! ఇంత తిరిగి, ఇన్ని ప్రసంగాలు ఇచ్చిన తర్వాత కూడా లోకేష్ .. జగనన్న అంటూ వివరించడం పరాకాష్ట! మరి ఈ మాత్రం దానికి తానెందుకు తనయుడిని మెచ్చుకోవాలనుకున్నాడో ఏమో కానీ చంద్రబాబు ఈ పాదయాత్రను పెద్దగా పట్టించుకోవడం లేనట్టుగా ఉంది.
ఒకవైపు లోకేష్ పాదయాత్ర కొనసాగుతుండగానే అడపాదడపా చంద్రబాబు కూడా కార్యకర్తల మధ్యకు వెళ్తున్నాడు! ఆ సందర్భాల్లో లోకేష్ గురించి చంద్రబాబు ప్రస్తావించడం లేదు కూడా! ఈ గ్యాప్ అయితే స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. మరి అసలు సంగతటేమిటో!