ఆయ‌న‌లానే ప‌వార్ ను చంపుతాం.. బీజేపీ కార్య‌క‌ర్త!

ఒక‌వైపు మోడీ స‌ర్కారు శ‌ర‌ద్ ప‌వార్ కు అత్యున్న‌త పుర‌స్కారాల‌ను ఇచ్చి గౌర‌విస్తూ ఉంటుంది. అయితే మ‌రాఠా బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌వార్ అంటే ప‌డ‌దు. ఈ క్ర‌మంలో ప‌వార్ ను చంపుతామంటూ భార‌తీయ జ‌న‌తా…

ఒక‌వైపు మోడీ స‌ర్కారు శ‌ర‌ద్ ప‌వార్ కు అత్యున్న‌త పుర‌స్కారాల‌ను ఇచ్చి గౌర‌విస్తూ ఉంటుంది. అయితే మ‌రాఠా బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌వార్ అంటే ప‌డ‌దు. ఈ క్ర‌మంలో ప‌వార్ ను చంపుతామంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త ఒక‌రు ట్వీట్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అంతే కాదు.. ప‌దేళ్ల కింద‌ట మ‌హారాష్ట్ర‌లో ఒక రేష‌న‌లిస్టును కాల్చి చంపిన వైనాన్ని కూడా స‌ద‌రు కార్య‌క‌ర్త ప్ర‌స్తావించాడు. 

మ‌త‌తత్వ విధానాల‌ను వ్య‌తిరేకించే నరేంద్ర ద‌బోల్క‌ర్ ను 2013లో ఇద్ద‌రు కాల్చి చంపారు. అదే గ‌తే శ‌ర‌ద్ ప‌వార్ కు ప‌డుతుందంటూ సౌర‌భ్ పింపాల్క‌ర్ అనే బీజేపీ కార్య‌క‌ర్త హెచ్చ‌రిక జారీ చేశాడు. ఈ మేర‌కు అత‌డి సోషల్ మీడియా ఖాతా ద్వారా అత‌డిని గుర్తించారు. దీనిపై ఎన్సీపీ నేత‌లు పోలిసుల‌కు ఫిర్యాదు చేశారు.

మహారాష్ట్రలో ఇటీవ‌లే మ‌త‌ఘ‌ర్ష‌ణ‌లకు తెర‌లేచింది. ఇందుకు సంబంధించి ఒక జిల్లాలో బంద్ లు జ‌రుగుతున్నాయి. హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఈ హింస‌ను ప‌వార్ ఖండించారు. దీనిపై ఒక బీజేపీ కార్య‌క‌ర్త స్పంద‌న ఇలా ఉంది. అత‌డు కేవ‌లం కార్య‌క‌ర్తే కాద‌ని, గ‌తంలో పేప‌ర్ లీక్ వ్య‌వ‌హారంలో నిందితుడు అని, అయితే బీజేపీ పెద్ద‌లు అత‌డిని కాపాడ‌నే పేరు కూడా ఉంది. మ‌రి పేప‌ర్ లీకుల‌కు పాల్ప‌డే ఈ ముఠా స‌భ్యులు ఐ హేట్ సెక్యుల‌రిజం అంటూ త‌న‌ను తాను బీజేపీ కార్య‌క‌ర్త‌గా చెప్పుకోవ‌డం గ‌మ‌నార్హం!

ప‌వార్ కు ఇప్ప‌టికే జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీ ఉంది. కొంత‌కాలం కింద‌ట ఆయ‌న‌కు మోడీ స‌ర్కారు ప‌ద్మ‌విభూష‌ణ్ స‌త్కారాన్ని ఇచ్చింది. ప‌వార్ కు ఏమైనా జ‌రిగితే దానికి మ‌హారాష్ట్ర హోం మంత్రి, కేంద్ర హోం మంత్రి బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుందంటూ ఎన్సీపీ హెచ్చ‌రించింది. అయితే ప‌వార్ సెక్యూరిటీకి ప్రాధాన్య‌త‌ను ఇస్తామంటూ ముఖ్య‌మంత్రి షిండే ప్ర‌క‌టించారు.

ఎవ‌రో అనామ‌కుడు జెడ్ ప్ల‌స్ సెక్యూరిటీలో ఉండే ప‌వార్ ను చంపగ‌ల‌డ‌నేది కాదు కానీ, ఈ తీవ్ర‌వాదపు మాట‌లే స‌బ‌బు కాదు. ప‌వార్ ను కాబ‌ట్టి ఇలాంటి హెచ్చ‌రిక‌ల‌తో వ‌దిలేయ‌గ‌ల‌రు. క‌ర్ణాట‌క‌లో ర‌చ‌యిత‌లు, హేతువాదుల‌ను మాత్రం కాల్చి చంప‌గ‌లిగారు. స‌ద‌రు బీజేపీ కార్య‌క‌ర్తే మ‌హారాష్ట్ర‌లో ఒక హేతువాదిని కాల్చి చంప‌డాన్ని ఉదాహ‌రించిన విష‌యం కూడా తేలిక‌గా తీసుకునేదేమీ కాదు! త‌మ‌కు న‌చ్చ‌ని రీతిన స్పందిస్తే.. కాల్చి చంపేస్తారా! ఈ హెచ్చ‌రిక‌లు తాలిబ‌న్ల రీతికి ఏం త‌క్కువ‌?