పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకున్నారంటూ చంద్రబాబుపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వయంగా వ్యాఖ్యానించారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం బాధ్యతల్లో ఉండిన పోలవరం ప్రాజెక్టును తన స్వార్థం కోసం రాష్ట్రం చేతుల్లోకి తీసుకుని చంద్రబాబు నాయుడు పెద్ద పాపానికే ఒడిగట్టారు. అక్కడ నుంచి పోలవరం అయిపోయిందనిపించడానికి, ఆఖరికి ఈ ప్రాజెక్టు విషయంలో కూడా కేవలం ప్రచారం కోసమే ఆరాటపడ్డారు. పోలవరం చూడటానికి అని ప్రభుత్వ సొమ్ములతో బస్సులను తిప్పి అక్కడా దొంగ బిల్లులతో కోట్లు దోచేసుకునే మార్గాలను ఎంచుకున్నారు! ఒక భజన బ్యాచ్ తో జయము జయము చంద్రన్న పాటలు అదనం!
ఇవన్నీ ఒక ఎత్తు అయితే డయాఫ్రమ్ వాల్ విషయంలో చంద్రబాబు హయాంలో నవయుగ చేసిన ఘోర తప్పిదం వల్ల పోలవరం పరిస్థితే తలకిందులయ్యింది. ఇంజనీరింగ్ వైఫల్యం.. పోలవరం పూర్తయ్యిందనిపించేసుకోవడానికి చంద్రబాబు పడ్డ ఆరాటం ఫలితంగా.. ఆ తర్వాత వచ్చిన వరదతో డయాఫ్రమ్ వాల్ దెబ్బతిని, ప్రధాన డ్యామ్ నిర్మాణం మొత్తం దెబ్బతింది. నాడు పోలవరం విషయంలో చేసిందంతా రైటు అని ఏ తెలుగుదేశం నేతా చిన్న ప్రెస్ మీట్ పెట్టి సమర్థించుకోలేడు!
అసెంబ్లీ సాక్షిగా రాసుకో.. రాసుకో జగన్ అన్న నేతలు ఇప్పుడు ఎక్కడనున్నారో తెలియదు. పోలవరం పాలిట అప్పటికే ఉన్న సవాళ్లు, ఆ పై చంద్రబాబు హయాంలో జరిగిన పాపాల అనంతరం.. ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని జగన్ సర్కారు అనేక బాలారిష్టాలను ఎదుర్కొంటూ కొనసాగిస్తోంది. ఇటీవలే పోలవరానికి కేంద్రం నుంచి ఎంతో కొంత ఇంధనం అందింది. ఇలాంటి నేపథ్యంలో..ఏదోలా ఆ విషయంలో బురదజల్లడమే పనిగా పెట్టుకుని పచ్చమీడియా గంగవెర్రెలెత్తుతుండటం గమనార్హం.
గైడ్ బండ్ కొంత మేర జారిన నేపథ్యంలో.. దీన్ని సరిదిద్దేందుకు ఇంజనీరింగ్ సిబ్బంది శ్రమపడుతున్న నేపథ్యంలో.. ఇది పెద్ద విషయం కాదని, సరిదిద్దుకోవచ్చని ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో కూడా.. పచ్చమీడియా మాత్రం ఘోరం జరిగిపోయినట్టుగా వెర్రెత్తిపోతూ తన అక్కసునంతా చాటుకుంటూ ఉంది.
చిన్నచిన్న అంశాలను బూతద్దంలో చూపిస్తూ పచ్చ ఏడుపులు కొనసాగుతూ ఉన్నాయి. పోలవరం నిధుల సాధనలో జగన్ ప్రగతి సాధించిన నేపథ్యంలో.. ఏదో ఒక విషప్రచారం సాగించేస్తే తమ పని పూర్తవుతుందన్నట్టుగా పచ్చమీడియా పన్నాగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలి పరిణామాలు జీర్ణంకాక ఈ పచ్చవిషాన్ని కక్కి ప్రశాంతతను పొందే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు!