ఆర్ఆర్ఆర్ కామెడీ వెర్షన్ కూడా ఉంది – రాజమౌళి

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల ఫిక్షనల్ పాత్రలతో ఓ పెద్ద యాక్షన్ డ్రామా తీశాడు రాజమౌళి. దాన్ని ఈనెల 25న అంతా చూడబోతున్నాం. అయితే అదే సినిమాను కామెడీగా తీస్తే ఎలా ఉంటుంది? ఆ…

కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల ఫిక్షనల్ పాత్రలతో ఓ పెద్ద యాక్షన్ డ్రామా తీశాడు రాజమౌళి. దాన్ని ఈనెల 25న అంతా చూడబోతున్నాం. అయితే అదే సినిమాను కామెడీగా తీస్తే ఎలా ఉంటుంది? ఆ కామెడీ వెర్షన్ కూడా సిద్ధంగా ఉందంటున్నాడు జక్కన్న. ఆర్ఆర్ఆర్ రిలీజైన వెంటనే.. ఆ సినిమా కామెడీ వెర్షన్ కూడా రిలీజ్ చేస్తానంటున్నాడు.

“నాకు 10 మంది అసిస్టెంట్ డైరక్టర్స్ ఉన్నారు. వాళ్లు లేకపోతే నేను సినిమాను ఇంత బెటర్ గా తీసేవాడ్ని కాదేమో. మాకు ఓ అలవాటు ఉంది. హీరోలు సెట్స్ పైకి రాకముందే మేమే టెస్ట్ షూట్ చేసుకుంటాం. మా అసిస్టెంట్ డైరక్టర్లే హీరోలుగా, హీరోయిన్లుగా, విలన్లుగా నటిస్తుంటారు. అదంతా ఎడిటింగ్ కూడా చేశాం. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయిన తర్వాత, మా అసిస్టెంట్ డైరక్టర్లు యాక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా కూడా రిలీజ్ చేస్తాం. అద్భుతమైన కామెడీ చూస్తారు మీరు. అంతకుమించిన కామెడీ సినిమా ఇంకోటి ఉండదు. “

ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో తన అసిస్టెంట్ డైరక్టర్లను పేరుపేరునా మెచ్చుకున్నాడు రాజమౌళి. ఈ దర్శకుడు ఇలా పేరుపేరునా తన టీమ్ ను ఓ పెద్ద వేదికపై మెచ్చుకోవడం ఇదే తొలిసారి. మరోవైపు ఇదే వేదికపై చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని బయటపెట్టాడు రాజమౌళి.

“ఏపీలో కొత్త జీవో కోసం చిరంజీవి చాలా ప్రయత్నించారు. సీఎం జగన్ తో తన సాన్నిహిత్యాన్ని ఉపయోగించి ఇండస్ట్రీకి మేలుచేశారు. ఆయన్ను చాలా మంది చాలా మాటలు అన్నారు. కానీ ఇండస్ట్రీని నెగ్గించడం కోసం తను తగ్గి, అన్ని మాటలు పడ్డారు. ఆయన అసలైన మెగాస్టార్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. తెలంగాణలో కూడా టికెట్ రేట్ల పెంపుపై గతంలో ఓ జీవో రావడానికి కూడా చిరంజీవి గారే కారణం. ఆయన తెరవెనక ఉండి అన్నీ చేశారు.”

ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం చిరంజీవికి ఇష్టం ఉండదని, ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడమే ఇష్టమని.. కానీ తను మాత్రం చిరంజీవిని ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తానని ప్రకటించాడు రాజమౌళి. పరిశ్రమ మొత్తం ఆయనకు రుణపడి ఉండాలన్నాడు.